రేవంత్‌రెడ్డి అరెస్టు

6 Mar, 2020 01:36 IST|Sakshi
గురువారం రాత్రి రేవంత్‌రెడ్డిని చర్లపల్లి జైలుకు తరలిస్తున్న పోలీసులు

కేటీఆర్‌ బంధువుల ఫాంహౌస్‌ను డ్రోన్‌ కెమెరాతో చిత్రీకరించడంపై కేసు

విచారణ కోసం పోలీస్‌ స్టేషన్‌కు వచ్చిన మల్కాజ్‌గిరి ఎంపీ

అరెస్టు చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచిన పోలీసులు

14 రోజుల రిమాండ్‌.. చర్లపల్లి జైలుకు తరలింపు

సాక్షి, మణికొండ/కుషాయిగూడ: టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ బంధువులకు చెందిన ఫాంహౌస్‌ను అనుమతి లేకుండా డ్రోన్‌ కెమెరాతో చిత్రీకరించిన కేసులో మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి అరెస్టయ్యారు. ఇదే కేసులో ఆయన అనుచరులు ఎం.జైపాల్‌రెడ్డి, ఓంప్రకాశ్‌రెడ్డి, ప్రవీణ్‌పాల్‌ రెడ్డి, విజయసింహారెడ్డి, డ్రోన్‌ ఆపరేటర్లు రాజేశ్, శివకృష్ణను పోలీసులు బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో రేవంత్‌ను మొదటి నిందితుడిగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో విచారణ నిమిత్తం గురువారం నార్సింగి పోలీస్‌ స్టేషన్‌కు వచ్చిన రేవంత్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు.

ఈ విషయం తెలియడంతో ములుగు ఎమ్మెల్యే సీతక్క, మాజీ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. తమ నాయకుడితో మాట్లాడాలని, స్టేషన్‌ లోపలకు అనుమతించాలంటూ వాదనకు దిగారు. దీంతో రేవంత్‌ను మరో గేటు నుంచి బయటకు తరలించారు. ఆ గేటు దగ్గరే ఉన్న రేవంత్‌ అను చరులు పోలీసులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రేవంత్‌ను తొలుత గోల్కొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహిం చారు. అనంతరం ఉప్పర్‌పల్లిలోని 14వ మెట్రోపాలిటన్‌ కోర్టు జడ్జి సంతోష్‌కుమార్‌ఎదుట హాజరు పరిచారు. జడ్జి ఆయనకు 14 రోజుల రిమాండ్‌ విధించడంతో చర్లపల్లి జైలుకు తరలించారు.

రేవంత్‌ లొంగిపోయారు: డీసీపీ
ఎంపీ రేవంత్‌రెడ్డి తనంత తానుగా వచ్చి పోలీసులకు లొంగిపోయారని మాదాపూర్‌ డీసీపీ వెంకటేశ్వరరావు తెలిపారు. దీంతో పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి న్యాయమూర్తి ముందు హాజరుపరిచారని వెల్లడించారు. రేవంత్‌పై సెక్షన్‌ 188, 287, 109, 120బి, 11ఎ, ఎయిర్‌క్రాఫ్ట్‌ చట్టం 5ఏ ప్రకారం కేసులు నమోదు చేసినట్లు వివరించారు. కాగా, ఇదే కేసులో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కూడా నిందితుడిగా ఉన్నారు. అయితే, ఆయన గాయపడి ఉండటంతో పోలీసులు ఇంకా అరెస్టు చేయలేదని తెలుస్తోంది.

అవినీతిని ప్రశ్నిస్తే అరెస్టా?: సీతక్క
ముఖ్యమంత్రి కుటుంబం అవినీతిని ప్రశ్నించే ప్రతిపక్ష గొంతులను నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు. రేవంత్‌రెడ్డిని చర్లపల్లి జైలుకు తీసుకువస్తున్నారని తెలియడంతో సీతక్క కాంగ్రెస్‌ కార్యకర్తలతో అక్కడకు చేరుకుని ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో అనేక భూములు కబ్జాచేసి ఫాంహౌజ్‌లు నిర్మించుకున్న వ్యవహారంతోపాటు ప్రభుత్వ భూముల్లో హోంల పేరుతో జరుగుతున్న అవినీతి నిర్మాణాలపై పోరాడుతున్న రేవంత్‌ను అక్రమంగా అరెస్టు చేయడం హేయమైన చర్య అని దుయ్యబట్టారు. వాస్తవాలను వెలికితీస్తే కుట్రపూరిత చర్యలకు పాల్పడుతున్న ప్రభుత్వ తీరును ప్రజలు గమనిస్తున్నారని, కేసీఆర్‌ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పే సమయం దగ్గరపడిందని వ్యాఖ్యానించారు. రేవంత్‌ అక్రమ అరెస్టును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని తెలిపారు.

మరిన్ని వార్తలు