ఫైనాన్స్‌ చేస్తున్న కానిస్టేబుల్‌ అరెస్టు

19 Jul, 2018 12:02 IST|Sakshi
గిరివాసులు ఇంట్లో తనిఖీలు చేస్తున్న పోలీసులు

చిత్తూరు అర్బన్‌: ప్రజలకు సేవ చేయాల్సిన పోలీసు కానిస్టేబుల్‌ అక్రమ వడ్డీ వ్యాపారంలోకి దిగాడు. ద్విచక్ర వాహనాలకు ఫైనాన్స్‌ చేస్తూ ఉన్నతాధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. అతన్ని బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. విషయం తెలుసుకున్న ఎస్పీరాజశేఖర్‌బాబు అతన్ని సస్పెండ్‌ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. వివరాల్లోకెళితే.. చిత్తూరు నగరంలోని ఆర్టీసీ డిపో రోడ్డులో ఉంటున్న గిరివాసులు (46) ఆర్ముడు విభాగం (ఏఆర్‌)లో హెడ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. అతను పలువురు ఎమ్మెల్యేల వద్ద గన్‌మెన్‌గా పనిచేయడంతో బాగా పరిచయాలు పెంచుకున్నాడు. ఐదేళ్ల క్రితం ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ఫోన్‌ వెయిటింగ్‌ విభాగంలో సైతం పనిచేసిన అనుభవం ఉంది. ఈ నేపథ్యంలో ఎన్‌ఎన్‌ కన్సల్టెన్సీ పేరిట ఏడేళ్ల క్రితం ఫైనాన్స్‌ కంపెనీ ప్రారంభించాడు. దీనికి ఎలాంటి రిజిస్ట్రేషన్‌ లేదు. తన బంధువుల సాయంతో కన్సల్టెన్సీ నడుపుతూ ద్విచక్ర వాహనాలతోపాటు, కార్లకు ఫైనాన్స్‌ ఇస్తున్నాడు. సెకండ్‌ హ్యాండ్‌ వాహనాన్ని రూ.50 వేలకు కొనడం.. దాని అవసరం ఉన్న వారికి రూ.10 వేలు కట్టించుకుని మిగిలిన రూ.40 వేలను ఫైనాన్స్‌ రూపంలో చెల్లించాలని ప్రామిసరీ నోటు రాయించుకునే వాడు.

ఈ నేపథ్యంలో చిత్తూరు నగరానికి చెందిన ఓ వ్యక్తి రూ.50 వేలు చెల్లించి ఇన్నోవా వాహనాన్ని కొనుగోలు చేశాడు. మిగిలిన రూ.6 లక్షలను బయట ఫైనాన్స్‌ తీసుకుంటానని చెప్పాడు. మాట ప్రకారం అతను డబ్బు చెల్లించలేదు. దీంతో ఆగ్రహించిన గిరివాసులు ఇన్నోవా వాహనాన్ని తన వద్ద ఉంచుకున్నాడు. దీనిపై బాధితుడు ఎస్పీ రాజశేఖర్‌బాబును కలిసి ఫిర్యాదు చేశాడు. ఎస్పీ ఆదేశాలతో గిరివాసులు ఇంటిని సోదా చేసి ఏం జరుగుతోందో నివేదిక ఇవ్వాలని చిత్తూరు డీఎస్పీ సుబ్బారావు తన సిబ్బం దిని ఆదేశించారు. రంగంలోకి దిగిన వన్, టూటౌన్‌ సీఐలు శ్రీధర్, వెంకటకుమార్, పది మంది సిబ్బంది గిరివాసులు ఇంట్లో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో 200లకు పైగా ప్రామిసరీ నోట్లు, పలు వాహనాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్ల(ఆర్‌సీ)ను పోలీసులు సీజ్‌ చేశారు. ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ వడ్డీ వ్యాపారం చేస్తున్నట్లు, డబ్బులు చెల్లించకుంటే వారిపై భౌతిక దాడులకు దిగుతున్నందుకు గిరివాసులును అరెస్టు చేసినట్లు పోలీసులు ప్రకటించారు. చాలా మంది తమకు ఫిర్యాదు చేశారని పోలీసులు పేర్కొన్నారు.

ఎస్పీ ఆగ్రహం..
విషయం తెలుసుకున్న ఎస్పీ రాజశేఖర్‌బాబు కానిస్టేబుల్‌ గిరివాసులు వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని పేర్కొన్నారు. గిరివాసులు నేరం చేసినట్లు ప్రాథమిక ఆధారాలు ఉండడంతో అతన్ని ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. పోలీసులు ప్రజలకు సమాజానికి వారధిగా ఉండాలని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే దాని పర్యవసనం ఇలాగే ఉంటుందని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు