అధికారుల వేధింపులతో కానిస్టేబుల్‌ ఆత్మహత్య?

21 May, 2018 01:44 IST|Sakshi
రాజశేఖర్‌(ఫైల్‌)

మిస్‌ఫైర్‌ అయి చనిపోయాడని చెబుతున్న పోలీసులు

సాక్షి, చిత్తూరు: ఉన్నతాధికారుల వేధింపులు తాళలేక చిత్తూరు ఎస్పీ బంగళాలో ఏఆర్‌ కానిస్టేబుల్‌ రాజశేఖర్‌ (30) ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. కానిస్టేబుళ్ల సమస్యలపై రాజశేఖర్‌ ఉన్నతాధికారులను ప్రశ్నించడంతో వారు అతన్ని వేధించడం ప్రారంభించారని, ఆ వేధింపులు తట్టుకోలేకే అతను ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలం పీర్‌సాహెబ్‌పేటకు చెందిన రాజశేఖర్‌ 2013లో విధుల నిర్వహణ నిమిత్తం చిత్తూరుకు వచ్చాడు. అప్పటి నుంచి జిల్లాలోనే పనిచేస్తున్నాడు.
మృతి చెందిన కానిస్టేబుల్‌ రాజశేఖర్‌  

ఆదివారం తెల్లవారు జామున ఎస్పీ బంగళా వెనుక భాగంలో సెంట్రీగా విధులు నిర్వర్తిస్తున్నాడు. రాత్రి 2 నుంచి 4 గంటల వరకు డ్యూటీ చేసి జయచంద్రారెడ్డి అనే కానిస్టేబుల్‌కు బాధ్యతలు అప్పగించాల్సి ఉంది. ఉదయం 5.30కి విధులు చేపట్టేందుకు రాజశేఖర్‌ వద్దకు వెళ్లిన జయచంద్రారెడ్డి అప్పటికే గుండెల్లో బుల్లెట్‌ దిగి  రక్తపుమడుగులో పడి ఉన్న రాజశేఖర్‌ను చూసి దిగ్భ్రాంతికి గురయ్యాడు. వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించాడు. ఎస్పీ రాజశేఖర్‌ బాబు, చిత్తూరు డీఎస్పీ సుబ్బారావు తదితరులు ఘటనా స్థలానికి చేరుకుని రాజశేఖర్‌ మృతి విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. ఘటనపై ఎస్పీ విచారణకు ఆదేశించారు. పంచనామా నిమిత్తం మృతదేహాన్ని చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 

మూడు నెలల నుంచి..
సెలవు కావాలని రాజశేఖర్‌ 3 నెలలుగా ఉన్నతాధికారులను అడుగుతున్నా వారు పట్టించుకోలేదు. ఊర్లో జాతర ఉందని, కనీసం 5 రోజులైనా సెలవు ఇవ్వాలని బతిమలాడినా కనికరించకపోవడంతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని రోజుల క్రితం కానిస్టేబుళ్ల సమస్యలపై ఉన్నతాధికారులు దర్బార్‌ సమావేశం నిర్వహించారు. దాదాపు 15 నిమిషాల పాటు రాజశేఖర్‌ కానిస్టేబుళ్ల సమస్యలను ఉన్నతాధికారుల ఎదుట ప్రస్తావించాడని, అప్పటి నుంచి తనపై కక్షసాధింపు చర్యలు ఎక్కువయ్యాయని సహచరులతో మదనపడేవాడని తెలిసింది. పోలీసు ఉన్నతాధికారులు మాత్రం గన్‌ మిస్‌ఫైర్‌ అవ్వడం వల్లనే రాజశేఖర్‌ చనిపోయాడని ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. గన్‌ మిస్‌ఫైర్‌ అయి చనిపోయినట్లు భావిస్తున్నామని రాజశేఖర్‌ తల్లిదండ్రులు కూడా అంగీకారం తెలిపారని తెలిసింది. 

మరిన్ని వార్తలు