సంక్రాంతికి మీ ఇంటికా.. మా ఇంటికా?

14 Jan, 2020 08:27 IST|Sakshi
అనూష మృతదేహాన్ని పరిశీలిస్తున్న కానిస్టేబుల్‌ 

కానిస్టేబుల్‌ దంపతుల మధ్య వివాదం 

కొద్దిసేపటికి భార్య అనుమానాస్పద మృతి 

భర్తపై వరకట్నం, హత్య కేసుల నమోదు 

కీలకం కానున్న పీఎం నివేదిక

సాక్షి, ఒంగోలు: స్థానిక మహేంద్రనగర్‌లో నివాసం ఉంటున్న ఓ కానిస్టేబుల్‌ భార్య తాను నివాసం ఉండే ఇంట్లోనే అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ సంఘటన సోమవారం ఉదయం వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం.. నెల్లూరు జిల్లా సుబేదార్‌పేటకు చెందిన అనూష(25)కు 2015లో ఉలవపాడుకు చెందిన బి.నాగరాజుతో వివాహమైంది. నాగరాజు ఏఆర్‌ ఒంగోలు విభాగంలో బాంబు డిటెక్షన్‌ స్క్వాడ్‌లో పనిచేస్తున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు. స్థానిక మహేంద్రనగర్‌లో అనూష ఉరేసుకుందని, ఆమె మృతదేహం స్థానిక ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఉన్నట్లు టూటౌన్‌ పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు వచ్చి ఆమె గొంతు చుట్టూ నల్లగా కమిలిన మచ్చను పరిశీలించారు. అనంతరం సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించగా చీరె కోసి ఉంది. ఆమె భర్త కానిస్టేబుల్‌ నాగరాజును విచారించారు.

చదవండి: కొంపముంచిన విదేశీ యువతితో ఫేస్‌బుక్‌ పరిచయం

తాను ఉదయం రోల్‌ కాల్‌కు వెళ్లి వచ్చానని, టిఫిన్‌ తీసుకొచ్చేందుకు తాను బయటకు వెళ్లి వచ్చే సరికి తన భార్య చీరెతో ఉరేసుకున్నట్లు కనిపించిందని, చీర కోసి ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించినట్లు కానిస్టేబుల్‌ నాగరాజు పోలీసు అధికారులకు తెలిపాడు. దీనిపై ఆ దంపతుల నాలుగేళ్ల పాపను విచారించగా ఊరికి అమ్మగారింటికా, అత్తగారింటికా అన్న విషయంలో గొడవ పడ్డారని పేర్కొంటోంది. పోలీసులు మృతదేహాన్ని రిమ్స్‌ మార్చురీకి తరలించారు. తహసీల్దార్‌ శవ పంచనామా చేశారు. అనంతరం మృతురాలి తల్లి ప్రభావతి ఒంగోలు చేరుకుని కన్నీరుమున్నీరైంది. అనంతరం ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు వరకట్నం వేధింపుల కేసు నమోదు చేశారు. ఫిర్యాది కథనం ప్రకారం.. వివాహం సమయంలో రూ.2.50 లక్షల కట్నం, 15 సవర్ల బంగారు ఆభరణాలు ఇచ్చారు.

అయినా ఇంకా కట్నం కావాలంటూ వివాహమైన కొద్దికాలం నుంచే భార్యను నాగరాజు వేధించేవాడు. ఈ నేపథ్యంలోనే తన కుమార్తె మృతిని ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని పేర్కొంటూ తల్లి తన ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు ప్రాథమికంగా వరకట్నం వేధింపుల కారణంగా మరణించినట్లు పేర్కొంటూ మొత్తం ఏడుగురిపై కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా ఆత్మహత్య లేక హత్య అన్న దానిపై స్పష్టత వస్తుందని ఒంగోలు డీఎస్పీ కేవీవీఎన్‌వీ ప్రసాద్‌ తెలిపారు. 

>
మరిన్ని వార్తలు