మావోయిస్టుల ఘాతుకం

17 Apr, 2018 11:30 IST|Sakshi
నాగేశ్వరరావు మృతదేహం ఇన్‌సెట్‌(తెలగరెడ్డి బాలనాగేశ్వరరావు (పాతచిత్రం)

మావోయిస్టుల చేతిలో ఐ.పోలవరంవాసి హత్య

బతుకుదెరువుకు పరాయి రాష్ట్రం వెళ్లి మృతి 

ఐ.పోలవరం : ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో రోడ్డు పనుల కోసం వెళ్లిన ఐ.పోలవరానికి చెందిన కాంట్రాక్టర్‌ హత్యకు గురయ్యారు. బతుకుదెరువు కోసం వెళ్లి అక్కడ రోడ్డు నిర్మాణ కాంట్రాక్టు చేస్తున్న తెలగరెడ్డి బాలనాగేశ్వరరావు (52) (కాసులు) మావోయిస్టుల ఆగ్రహానికి గురయ్యాడు. అ ప్రాంతంలో రోడ్లు నిర్మించవద్దన్న మావోయిస్టుల హెచ్చరికలు కాదని రోడ్డు నిర్మించిన బాల నాగేశ్వరావును మావోయిస్టులు లక్ష్యంగా చేసుకొని ఈ నెల 14న హతమార్చగా సోమవారం పని చేసే చోటనే మృత దేహం బయటపడింది. దీంతో ఐ.పోలవరంలో విషాదం చోటుచేసుకుది. బాలనాగేశ్వరరావు మరణ వార్త టీవీల్లో ప్రసారం కావడంతో జిల్లా వాసులు ముఖ్యంగా ఐ.పోలవరం మండలవాసులు ఉలిక్కి పడ్డారు.

బాలనాగేశ్వరావుకు భార్య సత్యకుమారి, కుమార్తె రేవతి ఉన్నారు. కుమార్తెకు వివాహమై అదే గ్రామంలో ఎంపీటీసీ సభ్యురాలలిగా పనిచేస్తున్నారు. నాగేశ్వరరావు మరణించిన విషయాన్ని భార్యకు, కూతురికి తెలియకుండా గ్రామస్తులు గోప్యంగా ఉంచారు. నాగేశ్వరరావు గత 20 సంవత్సరాలుగా ఐ.పోలవరం మండలంలోనే తాపీ మేస్త్రిగా పనిచేస్తూ మండలంలోనే కాంట్రాక్టరుగా ఎదిగాడు. ఇటీవల కాలంలో ఇతర కాంట్రా క్టర్లతో పరిచయాలు ఏర్పడి ఛత్తీస్‌గఢ్‌లో రోడ్డు నిర్మాణ పనులు కాంట్రాక్టు తీసుకొన్నాడు. రోడ్డు నిర్మాణానికి ముందే మావోయిస్టులు ‘ఇక్కడ రోడ్డు నిర్మించవద్దంటూ’ హెచ్చరించనట్టు సమాచారం. అతను మావోయిస్టులు హెచ్చరికల్ని తేలికగా తీసుకొని నిర్మాణ పనులు కొనసాగించాడు.

దీంతో రెచ్చిపోయిన మావోయిస్టులు రోడ్డు పనుల్లో ఉన్న వాహనాలను తగుల పెట్టారు. అదే సమయంలో నాగేశ్వరరావును కిడ్నాప్‌ చేసి డీప్‌ ఫారెస్టులోకి తీసుకొని వెళ్లి రాళ్లతో కొట్టి చంపినట్లు సమాచారం. సోమవారం సాయంత్రం కిడ్నాప్‌ చేసిన ప్రాంతంలోనే నాగేశ్వరరావు మృత దేహాన్ని మావోయిస్టులు పడేసి వెళ్లారు. ఈ సమాచారం ఛత్తీస్‌గఢ్‌ నుంచి జిల్లా పోలీసులకు సమాచారం అందింది. తన పనేదో తాను చేసుకుంటూ వివాద రహితుడిగా ఉన్న నాగేశ్వరరావు మావోయిస్టుల చేతుల్లో హతమవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకొన్నాయి. ఇతని మృతదేహం మంగళవారం స్వగృహానికి చేరుకొంటుందని భావిస్తున్నారు. 

మరిన్ని వార్తలు