‘బతకాలంటే బీజేపీతో డీల్‌ చేస్కో’

15 Apr, 2018 16:36 IST|Sakshi

ఝాన్సీ : యూపీలో ఎన్‌కౌంటర్‌ల పర్వం కొనసాగుతున్న వేళ.. ఓ సంచలన ఆడియో టేపు వాట్సాప్‌ గ్రూప్‌లో చక్కర్లు కొడుతోంది. ఓ పోలీస్‌ అధికారి- ఓ క్రిమినల్‌కు మధ్య కొనసాగిన సంభాషణ అది. ప్రాణాలతో బయటపడాలంటే బీజేపీ నేతలతో డీల్‌ కుదుర్చుకోవాలని ఆ అధికారి సదరు క్రిమినల్‌కు సలహా ఇచ్చాడు. ఈ ఆడియోను సదరు క్రిమినల్‌ వైరల్‌ చేయగా.. ప్రస్తుతం ఆ అధికారిపై వేటు పడింది. 

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మురానిపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో సునీత్‌ కుమార్‌ సింగ్‌ ఎస్‌హెచ్‌వోగా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం, లేఖ్‌రాజ్‌ యాదవ్‌ అనే రౌడీ షీటర్‌కు ఫోన్‌ చేసి.. ఎన్‌కౌంటర్‌ లిస్ట్ లో అతని పేరు ఉన్నట్లు అప్రమత్తం చేశాడు. లేఖ్‌రాజ్‌పై హత్యలు, దొమ్మీలు ఇలా మొత్తం 14 కేసులు ఉండగా.. ప్రస్తుతం బెయిల్‌ మీద బయట ఉన్నాడు. అయితే ప్రాణాలతో బయటపడాలనుకుంటే మాత్రం తక్షణమే స్థానిక బీజేపీ నేతలు రాజీవ్‌ సింగ్‌ పరిచా, సంజయ్‌ దుబేలను ఆశ్రయించి డీల్‌ కుదుర్చుకోవాలని లేఖ్‌రాజ్‌కు సునీత్‌ సూచించాడు. ఈ మొత్తం కాల్ సంభాషణను లేఖ్‌రాజ్‌ తన ఫోన్‌లో రికార్డు చేశాడు. అదే రోజు సాయంత్రం అతను ఎన్‌కౌంటర్‌ నుంచి తృటిలో తప్పించుకున్నాడు. దీంతో ఆగ్రహంతో లేఖ్‌రాజ్‌ వాట్సాప్‌లో  ఆ ఆడియో క్లిప్‌ను విడుదల చేసేశాడు.

శనివారం ఉదయం నుంచి అది వాట్సాప్‌ గ్రూప్‌ల్లో చక్కర్లు కొడుతోంది. ఈ ఫిక్సింగ్‌ వ్యవహారంపై యూపీ పోలీస్‌ శాఖ స్పందించింది. ఆ ఆడియో టేపుపై దర్యాప్తు కొనసాగుతుందన్న డీజీపీ ఓపీ సింగ్‌.. పోలీసులు-క్రిమినల్స్‌ కుమ్మకయ్యారన్న ఆరోపణలను మాత్రం తోసిపుచ్చారు. మరోవైపు దర్యాప్తు ముగిసే వరకు సునీత్‌ కుమార్‌పై వేటు పడింది. ఇక సదరు బీజేపీ నేతలు ఈ వ్యవహారంతో తమకు సంబంధం లేదని చెబుతున్నారు. గత ఏడాది కాలంలో యూపీలో 1000కి పైగా ఎన్‌కౌంటర్‌లు జరగ్గా.. సుమారు 50 మందికి పైగా క్రిమినల్స్‌ మృతి చెందారు. విమర్శలు వెల్లువెత్తినప్పటికీ.. మానవ హక్కుల సంఘం నోటీసులు పంపినప్పటికీ ఎన్‌కౌంటర్‌ల విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదంటూ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ కుండబద్ధలు కొట్టారు.


                                           సునీత్‌ కుమార్‌ సింగ్‌.. లేఖ్‌రాజ్‌ యాదవ్‌

మరిన్ని వార్తలు