సిగ్గు సిగ్గు.. నడిరోడ్డుపై పోలీసులు ఇలా!!

12 Nov, 2019 16:06 IST|Sakshi

ముంబై : మనకు ఏదైనా సమస్య వస్తే నేరుగా పోలీస్ స్టేషన్‌కి వెళ్లి పోలీసువారికి చెప్పుకుంటాం. కానీ ఆ పోలీసులకే సమస్య వస్తే మరి ఎవరికి చెప్పుకుంటారనే సందేహం చాలా మంది మదిలో మెదిలేది. కానీ ఈ మధ్య వారికి ఆ సమస్యకు పరిష్కారం దొరికినట్టు కనిపిస్తోంది. వారికి సమస్య వస్తే వారిలో వారే తన్నుకోవడం, తిట్టుకోవడం ఇలా పరస్పర దాడులకు పూనుకుంటున్నారు. గతంలో ఉత్తరప్రదేశ్‌లోని జరిగిన ఘటన మరవక ముందే.. తాజాగా మరో ఘటన మహారాష్ట్ర రాజధాని ముంబైకి దగ్గరల్లోని భండారా జిల్లా పోలీస్‌ హెడ్ క్వార్టర్స్‌లో జరిగింది.  విధుల్లో ఉన్న ఇద్దరు పోలీసులు ఒకరి మీద మరొకరు పిడిగుద్దులు కురిపిస్తూ, పరస్పరం దాడి చేసుకున్నారు.

ఒకరి కంటే మరొకరు ఎక్కువ కొట్టాలన్న కసితో కొట్టుకున్నారు. చేతులతో కొట్టుకున్న తర్వాత అది సరిపోలేదు అన్నట్లు బూట్లు తీసి మరీ కొట్టుకున్నారు. పరస్పరం దాడులకు పాల్పడిన వారిని విష్ణు కేడికర్, వికాస్ గైక్వాడ్‌గా గుర్తించారు. వీరు దాడికి పాల్పడుతున్న సమయంలో నిలువరించేందుకు సివిల్‌ డ్రెస్‌లో ఉన్న పక్కనున‍్నవారు ప్రయత్నించారే తప్ప, ఆ సమయంలో వారితో ఉన్న పోలీసులు వెంటనే ఆపడాని పక్కకు ప్రయత్నించలేదు.  సివిల్‌ డ్రెస్‌లో ఓ వ్యక్తి ఒకరిని పట్టుకుని పక్కకు తీసుకుని వెళ్లగా, ఆ తర్వాత మిగిలిన పోలీసులు వచ్చి మరో పోలీసును పక్కకు తీసుకెళ్లారు.

ఈ ఘటనకు సంబంధించి వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారనే దానిపై అధికారులు నుంచి ఎటువంటి స్పందన లేదు. కానీ వారు అలా పరస్పరం ఎందుకు దాడికి దిగి కొట్టుకున్నారో తెలీదని ఉన్నతాధికారులు చెబుతున్నారు. గతంలో ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో లంచం విషయంలో ఇద్దరు పోలీసుల మధ్య తలెత్తిన చిన్న వివాదం కొట్టుకునే వరకూ వెళ్లింది. నడిరోడ్డుపై ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లు కర్రలతో విచక్షణా రహితంగా కొట్టుకున్న సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు