స్నేహితులే హంతకులు

9 Aug, 2019 12:58 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

వెంకటాచలం మండలంలో హత్య కేసును ఛేదించిన పోలీసులు

వివాహేతర సంబంధం నేపథ్యంలోనే హత్య

ముగ్గురు నిందితుల అరెస్ట్‌

సాక్షి, వెంకటాచలం (నెల్లూరు): మండలంలోని నిడిగుంటపాళెం సమీపంలో నక్కలకాలువ బ్రిడ్జి వద్ద గత నెల 30వ తేదీన జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. నెల్లూరు రూరల్‌ డీఎస్పీ రాఘవరెడ్డి గురువారం మండల కేంద్రమైన వెంకటాచలంలోని పోలీస్‌స్టేషన్‌లో వివరాలను వెల్లడించారు. ఈదగాలి గ్రామం ఉలవదిబ్బ ప్రాంతానికి చెందిన బండారు ప్రకాష్, అతని స్నేహితులు గత నెల 30వ తేదీన మద్యం తాగేందుకు నిడిగుంటపాళెం నక్కలకాలువ బ్రిడ్జి కిందకు వెళ్లారు. ప్రకాష్‌ మద్యం మత్తులో కాలువలో పడి మృతిచెందాడని స్నేహితులు చెప్పడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మృతదేహానికి పోస్టుమార్టం చేయించి బంధువులకు అప్పగించారు. అయితే పోస్టుమార్టం రిపోర్టులో ప్రకాష్‌ ప్రమాదవశాత్తు చనిపోలేదని తేలడంతో పోలీసులు విచారణ ప్రారంభించారు.

వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ రాఘవరెడ్డి
నమ్మించారు
ప్రకాష్‌ భార్యకు అతని స్నేహితుడైన ఇడిమేపల్లి గ్రామానికి చెందిన ఎ.వెంకటేష్‌కు కొంతకాలంగా వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం ప్రకాష్‌కు తెలిసి భార్యాభర్తల మధ్య నిత్యం గొడవలు జరిగేవి. ఈక్రమంలో ఆమె తన పుట్టింటికి వెళ్లిపోయింది. ప్రకాష్‌ ఇదంతా నీ వల్లే జరిగిందంటూ వెంకటేష్‌తో గొడవపడేవాడు. దీంతో వెంకటేష్‌ ప్రకాష్‌ను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం తన స్నేహితులైన చెన్నకృష్ణయ్య, విజయభాస్కర్‌ల సాయం కోరాడు. వీరు ముగ్గురూ కలిసి గత నెల 30వ తేదీన మద్యం తాగుదామని చెప్పి ప్రకాష్‌ను నక్కలకాలువ బ్రిడ్జి కిందకు తీసుకెళ్లారు. అక్కడ గొంతు నలిపి హత్య చేసి కాలువలో పడి చనిపోయాడని అందర్ని నమ్మించారు. పోస్టుమార్టం నివేదికలో ప్రకాష్‌ ప్రమాదవశాత్తు చనిపోలేదని తెలియడంతో పోలీసులు విచారణ మొదలుపెట్టారు. ఈక్రమంలో వెంకటేష్‌ను విచారించగా అసలు విషయం బయటపడింది. ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారింగా హత్య చేసినట్టుగా ఒప్పుకున్నారు. దీంతో వారిని అరెస్ట్‌ చేశారు. సమావేశంలో సీఐ రామకృష్ణ, ఎస్సై షేక్‌ కరీముల్లా, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు