సంచలనం: మత ఘర్షణల్లో పోలీస్‌ సిబ్బంది

14 May, 2018 14:44 IST|Sakshi
వీడియో ఫుటేజీలోని దృశ్యాలు

సాక్షి, ముంబై: ఔరంగబాద్‌ మత ఘర్షణలకు సంబంధించి సంచలన వీడియో ఫుటేజీ ఒకటి బయటికి పొక్కింది. ఘర్షణల్లో పాల్గొన్న కొందరికి పోలీసులు సాయం చేశారన్న ఆరోపణలకు బలం చేకూర్చేదిగా ఉంది. తమ కళ్ల ముందే వాహనాలను తగలబెడుతున్నా పోలీస్‌ సిబ్బంది వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించకపోవటం గమనార్హం. శుక్రవారం రాత్రి రెండు వర్గాల మధ్య ఘర్షణతో ఆ ప్రాంతం అతలాకుతలమైన సంగతి తెలిసిందే. 

శనివారం వేకువ ఝామున నవాబుపుర ప్రాంతంలో పోలీసులు గస్తీ కాస్తున్నారు. ఆ సమయంలో అల్లరి మూక, పోలీసు సిబ్బందితో కలిసి నడుచుకుంటూ వెళ్లింది. భారతీయ నర్సింగ్‌ హోం వద్దకు చేరుకోగానే పార్కింగ్‌లో ఉన్న వాహనాలపై అల్లరిమూక తమ ప్రతాపం చూపింది. కొందరు వాహనాలను ధ్వంసం చేసి ఆపై తమ వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ క్యాన్లను పోసి తగలబెట్టారు. ఓ భవనంలోంచి ఓ వ్యక్తి కిటీకి గుండా ఈ ఘటనను రికార్డు చేసినట్లు తెలుస్తోంది. అయితే అల్లర్లు చెలరేగిన వెంటనే ఇంటర్నెట్‌ సేవలు నిలిపేయటంతో ఆ వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మొత్తం 9 నిమిషాల నిడివి ఉన్న వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తోంది.

ఘటనపై మహారాష్ట్ర హోం మంత్రిత్వ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ సిబ్బందిపై వేటు వేసి, అత్యున్నత దర్యాప్తునకు ఆదేశించి. ఇక ఈ వీడియోపై అల్లర్లను పర్యవేక్షించిన అదనపు డీజీపీ బిపిన్‌ బిహారీ మాట్లాడారు. చట్టాన్ని చేతుల్లో తీసుకుంది ఎవరైనా సరే ఉపేక్షించబోమని ఆయన అన్నారు.  

అల్లర్లకు కారణం.. 
ఔరంగాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అక్రమ నల్లా కనెక్షన్లను తొలగించే కార్యక్రమాన్ని ప్రారంభించడంతో గత కొన్నిరోజులుగా స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం రాత్రి 10 గంటలకు కార్పొరేషన్‌ సిబ్బంది మోతీకరంజాలోని ఓ ప్రార్థనాలయంలో ఉన్న అక్రమ నల్లా కనెక్షన్‌ను తొలగించడంతో వివాదం రాజుకుంది. తమ కనెక్షన్‌తో పాటు మరో వర్గానికి చెందిన ప్రార్థనాస్థలంలో ఉన్న అక్రమ నీటి కనెక్షన్‌ను కూడా తొలగించాలని ఓ వర్గం డిమాండ్‌ చేయడంతో ఘర్షణ చెలరేగింది. దీంతో అల్లర్లు మోతీకరంజా నుంచి గాంధీనగర్, రాజా బజార్, షా గంజ్, సరఫా ప్రాంతాలకు విస్తరించాయి. రెచ్చిపోయిన ఆందోళనకారులు 100 దుకాణాలకు, 80 వాహనాలకు నిప్పుపెట్టారు. వీరిని అదుపు చేసేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో ఓ యువకుడు(17)చనిపోగా, ఆందోళనకారులు మంట లు అంటించడంతో ఓ షాపులో 65 ఏళ్ల వృద్ధుడు దుర్మరణం చెందాడు.

మరిన్ని వార్తలు