ఉలిక్కిపడ్డ ధర్మాజిపేట

9 Feb, 2018 17:39 IST|Sakshi
కార్డెన్‌ సెర్చ్‌పై డీసీపీ, ఏసీపీలతో చర్చిస్తున్న సీపీ శివకుమార్‌ 

గ్రామంలో పోలీసుల కార్డెన్‌ సెర్చ్‌

ఉదయం 5 గంటల నుంచి సోదాలు

సరైన పత్రాలు లేని 102 వాహనాలు సీజ్‌

పాల్గొన్న సిద్దిపేట సీపీ, డీసీపీ, ఏసీపీ

దుబ్బాకటౌన్‌: దుబ్బాక నగర పంచాయతీ పరిధిలోని ధర్మాజిపేటలో గురువారం తెల్లవారుజామున సిద్దిపేట పోలీస్‌ కమిషనర్‌ శివకుమార్‌ ఆధ్వర్యంలో పోలీ సులు కార్డెన్‌ సెర్చ్‌ చేపట్టారు. సీపీ శివకుమార్, డీసీపీ నర్సింహారెడ్డి, ఏసీపీ రామేశ్వర్‌ ఆధ్వర్యంలో దుబ్బాక సీఐ నీరంజన్, ఎస్‌ఐ సుభాష్‌గౌడ్‌తో పాటు మిరుదొ డ్డి, చిన్నకోడూర్‌ ఎస్‌ఐలు.. మొత్తం 65 మంది సిబ్బం ది బ్యాచ్‌లుగా విడిపోయి ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు కార్డెన్‌ సెర్చ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటినీ తనిఖీ చేసి వివరాలు తెలుసుకున్నారు. ఎలాంటి పత్రాలు లేని 94 మోటార్‌ సైకిళ్లు, 3 ఆటోలు, 2 కార్లు, 3 ట్రాక్టర్లను సీజ్‌ చేశారు. గ్రామంలో అక్రమంగా మద్యం అమ్ముతున్న ముగ్గురిని గుర్తించా రు. వారిపై చర్యలు తీసుకోవాలని సీపీ శివకుమార్‌.. ఎస్‌ఐ సుభాష్‌గౌడ్‌కు సూచించారు. గతంలో 30 నేరాలతో సంబంధం ఉన్న భిక్షపతితో పాటు పలు నేరాలు చేసిన కాస్తి కనకయ్య, శ్రీనివాస్‌ను విచారణ చేశారు. 

ఆందోళనకు గురైన ప్రజలు
తెల్లవారుజామున 5 గంటలకు ఒక్కసారిగా ధర్మాజిపేటను పోలీసులు చట్టుముట్టడంతో ప్రజలు ఆందోళన చెందారు. గతంలో నక్సలైట్ల కోసం పోలీసులు గ్రామాలను చుట్టుముట్టేవారు.. చాలా సంవత్సరాల తర్వాత మళ్లీ అలాంటి సంఘటలన ఏదైనా జరుగుతుందేమోనని ధర్మాజీపేట ప్రజలు ఉలిక్కిపడ్డారు. పోలీసులు అన్ని వివరాలు చెప్పడంతో వారంతా ఊపిరిపీల్చుకున్నారు.

నేర రహిత సమాజం కోసమే..
నేరరహిత గ్రామాలుగా తీర్చిదిద్దడంలో భాగంగా నిరంతరం పనిచేస్తున్నామని సిద్దిపేట పోలీస్‌ కమిషనర్‌ శివకుమార్‌ అన్నారు. గురువారం ధర్మాజిపేటలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సిద్దిపేట పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో నేరాల అదుపునకు పకడ్బందీగా చర్యలు చేపడుతున్నామన్నారు. ప్రజల మేలు కోసమే కార్డెన్‌ సెర్చ్‌లు నిర్వహిస్తున్నామని చెప్పారు. వాహనదారులు తమ వాహనాల ఆర్సీ, ఇన్సురెన్స్, డ్రైవింగ్‌ లైసెన్స్‌లు తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలని సీపీ సూచించారు. 

మరిన్ని వార్తలు