ఇందూరులో కార్డన్‌ సెర్చ్‌

26 Feb, 2018 09:41 IST|Sakshi
ఆటో పత్రాలను పరిశీలిస్తున్న సీపీ కార్తికేయ

అర్ధరాత్రి ఉలిక్కిపడిన నగరవాసులు

రెండున్నర గంటలపాటు తనిఖీలు

పోలీసుల అదుపులో 10 మంది

అనుమానితులు, పలు వాహనాలు

నిజామాబాద్‌ క్రైం(నిజామాబాద్‌ అర్బన్‌): ప్రశాంతంగా నిద్రపోతున్న ప్రజల ఇంటి తలుపులు తట్టడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇళ్ల నుంచి బయటకు రండని పిలుపులతో ఏమైందోనంటూ భయపడ్డారు. కిటికీలో నుంచి చూస్తే ఒకరు కాదు ఇద్దరు కాదు పదుల సంఖ్యలో పోలీసులు వచ్చారేంటి అని కంగారుపడ్డారు. కొందరు తమ బయటకు వచ్చేందుకు భయపడ్డారు. అలాంటి వారిని బయటకు రప్పించేందుకు పోలీసులు ముందస్తుగా వారితో పరిచయం ఉన్న వ్యక్తిని వెంట తీసుకెళ్లి అతడితో ప్రజలను ఇళ్ల నుంచి బయటకు రప్పించారు. అనంతరం పోలీసులు కార్డన్‌ సెర్చ్‌ చేశారు. విషయం తెలుసుకున్న ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. 

నేరాలను అరికట్టేందుకే: సీపీ కార్తికేయ
నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో నేరాల నియంత్రణకు కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించాం. ఇండ్లున్నవారు పరిచయం లేనివారికి ఇల్లు అద్దెకు ఇవ్వరాదు. కొత్త వ్యక్తులకు ఇంటిని అద్దెకు ఇచ్చేటప్పుడు వారి పూర్తి సమాచారం తెలుసుకోవాలి. ఆధార్‌ కార్డు పరిశీలించాలి. కొత్త వ్యక్తులు తిరిగితే పోలీస్‌స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలి.   

సీపీ కార్తికేయ ఆధ్వర్యంలో తనిఖీలు..
నేరాల నియంత్రణలో భాగంగా నగరంలోని ఒకటో టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో పరిధిలో గల ఎరుకలవాడ, ఇస్లాంపురా, కోజాకాలనీ, అశోక్‌నగర్, మహబుబ్‌ భాగ్, మిర్చి కంపౌడ్‌ ప్రాంతాల్లో  సీపీ కార్తికేయ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 4.30 నుంచి 6.30 గంటల వరకు కార్డన్‌ సెర్చ్‌ చేశారు. అదనపు డీసీపీ ఆకుల రాంరెడ్డి, ముగ్గురు ఏసీపీలు, 12 మంది సీఐలు, ముగ్గురు ఆర్‌ఐలు, 16మంది ఎస్‌ఐలు, 250 మంది పోలీసులు, 40 మంది మహిళా కానిస్టేబుళ్లు కార్డన్‌ సెర్చ్‌లో పాల్గొన్నారు. వారు 12 బృందాలుగా తనిఖీ చేశారు. అనుమానితులను ఆరాతీసి, క్రిమినల్స్‌ ఎవరైనా షెల్టర్‌ తీసుకున్నారా?, పాత నేరస్తులు ఉన్నారా లేదా ఆరాతీశారు. ప్రతి వాహనం డాక్యూమెంట్లను పరిశీలించారు. సరైన ధ్రువపత్రాలు, నెంబర్‌ ప్లేట్లు లేని మొత్తం 67 బైకులు, 7 ఆటోలు, ఒక జీపును పోలీసులు స్వాధీనం చేసుకుని వాటిని గాంధీగంజ్‌కు తరలించారు. ఐదుగురు పాత రౌడీ షీటర్లను, 10 మంది అనుమానితులను ఆధీనంలోకి తీసుకున్నారు. పోలీసుల అదుపులో 25 బైకులు, మూడు ఆటోలు, ఒక జీపు ఉంది. ధ్రుపత్రాలు లేనివారికి ఒకటో టౌన్‌ ఎస్‌హెచ్‌వో నాగేశ్వర్‌రావు రూ.28,500 జరిమానాలు విధించారు.

మరిన్ని వార్తలు