వనపర్తిలో కార్డెన్‌ సెర్చ్‌

23 Mar, 2018 13:28 IST|Sakshi
వనపర్తి : పోలీసులకు సూచనలు ఇస్తున్న ఏఎస్పీ సురేందర్‌రెడ్డి

గాంధీనగర్,ఇంద్రకాలనీల్లోవిస్తృత తనిఖీలు

59 ద్విచక్రవాహనాలు, ఆటో స్వాధీనం

14 మందిఅనుమానితుల అరెస్ట్‌

తనిఖీల్లో పాల్గొన్న123 మంది పోలీసులు

వనపర్తి విద్యావిభాగం: జిల్లాకేంద్రంలో ఎస్పీ రోహిణి ప్రియదర్శిని ఆదేశాల మేరకు పోలీసులు కార్డెన్‌ సెర్చ్‌ నిర్వహించారు. పట్టణంలోని గాంధీనగర్, ఇంద్రకాలనీల్లో పోలీసులు గురువారం తెల్లవారుజామున 4 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు తనిఖీలు చేపట్టారు. ఏఎస్పీ సురేందర్‌రెడ్డి నేతృత్వంలో ఒక సీఐ, 9 మంది ఎస్‌ఐలు, 123 మంది సిబ్బంది 15 బృందాలుగా ఏర్పడి ఇంటింటిని క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ తనిఖీల్లో సరైన ధ్రువపత్రాలు లేని 59 ద్విచక్రవాహనాలు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఉత్తరప్రదేశ్, తమిళనాడు, ఇతర రాష్ట్రాలకు చెందిన 14 మందిని అనుమానితులుగా గుర్తించి పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఎలాంటి అనుమతి లేకుండా నిర్వహిస్తున్న రెండు బెల్టు షాపులను తనిఖీ చేసి 34 బీరు బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.

ప్రజల భద్రతే ముఖ్యం..
జిల్లాకేంద్రంలో నేరాలు, దొంగతనాలను అరికట్టేందుకు ప్రజల భద్రత పర్యవేక్షణలో భాగంగానే ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఏఎస్పీ సురేందర్‌రెడ్డి తెలిపారు. ఇతర ప్రాంతాల వారికి ఇళ్లను అద్దెకు ఇచ్చే ముందు వారి సరైన ధ్రువపత్రాలు తీసుకోవాలని ఏఎస్పీ సూచించారు. ఒకవేళ అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. పట్టణంలో ఈవ్‌టీజింగ్, వేధింపులకు పాల్పడడం వంటి సంఘటనలు జరిగితే వెంటనే షీ టీం బృందాలకు సమాచారం ఇవ్వాలన్నారు. ప్రస్తుతం పోలీసులు స్వాధీనం చేసుకున్న వాహనాలకు సంబంధించి యజమానులు సరైన ధ్రువపత్రాలు చూయిం చి వాహనాలను తీసుకెళ్లాలని సూచించా రు. పట్టణంలోని అన్ని వార్డుల్లో విడతల వారీగా కార్డెన్‌ సెర్చ్‌ తనిఖీలు చేపడుతామన్నారు. దొంగతనాలు, నేరాలను అదుపు చేసేందుకు పట్టణ ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో సీఐ వెంకటేశ్వర్లు, పట్టణ ఎస్‌ఐ నాగశేఖరరెడ్డి, జిల్లాలోని వివిధ పోలీస్‌ స్టేషన్ల సిబ్బంది పాల్గొన్నారు.

అయిజలోనూ తనిఖీలు..
అయిజ (అలంపూర్‌): అయిజ నగర పంచాయతీలోని వల్లూరుపేట వీధిలో గురువారం ఉదయం 5 గంటల నుంచి 7 గంటల వరకు జోగుళాంబ గద్వాల జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి ఆధ్వర్యంలో పోలీస్‌ బృందాలు కార్డెన్‌ సర్చ్‌ నిర్వహించారు.  అదనపు ఎస్పీ, డీఎస్పీతో కలిసి 83 మంది పోలీసులు, ముగ్గురు సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్లు 8 టీంలుగా ఏర్పడి ఆపరేషన్‌ చేపట్టారు. వీధిలోని 240 ఇళ్ల వద్దనున్న వివిధ వాహనాలను, ఆయా ఇళ్లలో ఉన్నవారి ఆధార్‌ కార్డులను తనిఖీ చేసారు. సరైన ధ్రువపత్రాలు లేని 5 ప్యాసింజర్‌ ఆటోలు, ఒక కారు, 45 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకుని సీజ్‌ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ విలేకరులతో మాట్లాడుతూ అయిజలో త్వరలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. దీంతో అనుమానాస్పదంగా ఎవరైనా వ్యక్తులు ఉంటే దొరికిపోతారన్నారు.

ఈ ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, ఫలితంగా ఎంతోమం అమాయకులు బలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ట్రాఫిక్‌ రూల్స్‌ గురించి చాలామందికి అవగాహన లేదని, త్వరలో అయిజలో లైసెన్స్‌ మేళా ఏర్పాటు చేస్తామన్నారు. సీజ్‌ చేసిన వాహనాలపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటామన్నారు. కొత్త వ్యక్తులు ఎవరైనా అనుమానంగా సంచరిస్తున్నా, అద్దె ఇళ్లలో నివాసముంటున్నా పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. ప్రజలతో మమేకమై ఫ్రెండ్లీ పోలీస్‌ కార్యక్రమాన్ని నిరంతరం నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ భాస్కర్, డీఎస్పీ సురేందర్‌రావు, గద్వాల, అలంపూర్‌ సీఐలు వెంకటేశ్వర్లు, రజిత, అయిజ ఎస్‌ఐ బాలవెంకటరమణతోపాటు జిల్లాలోని ఆయా మండలాల ఎస్‌ఐలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు