కరోనా మందులతో కాసుల దందా!

21 Jul, 2020 10:52 IST|Sakshi
టొసిలీజుమాబ్‌ ఇంజెక్షన్‌ ఇదే

ప్రజల అవసరాన్ని సొమ్ము చేసుకుంటున్న ముఠాలు

అక్రమంగా ఆక్సిజన్‌ సిలిండర్లు, మందుల విక్రయాలు

మార్కెట్‌లో కృత్రిమ కొరత సృష్టిస్తున్న వైనం

విజయవాడ, గుంటూరులో యథేచ్ఛగా సాగుతున్న తంతు

సాక్షి, అమరావతిబ్యూరో: ఒకవైపు కరోనా మహమ్మారి కృష్ణా,గుంటూరు జిల్లాలను గడగడలాడిస్తుంటే.. మరోవైపు బాధితుల అవసరాలను సొమ్ము చేసుకునేందుకు కొందరు అడ్డదారులు తొక్కుతున్నారు. ఆక్సిజన్‌ సిలిండర్ల సరఫరా పేరుతో రూ.వేలల్లో దండుకుంటున్నారు. ఆయా మాత్రలు, సూది మందులను తయారీ కంపెనీల నుంచి మెడికల్‌ ఏజెన్సీల పేర్లతో తీసుకుని మందుల దుకాణాల్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. గుంటూరు, విజయవాడ నగరాల్లో ఇటీవల ఈ అక్రమ దందాల వ్యవహారాలు జరుగుతున్నట్లు సమాచారం. కొన్ని ముఠాలు కృత్రిమ కొరత   సృష్టించి మార్కెట్లో అధిక ధరలకు విక్రయించి భారీగానే సొమ్ము చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.  

గుజరాత్‌ నుంచి దిగుమతి..
రసాయన సంస్థలు, కొన్ని కార్పొరేటు ఆస్పత్రులు మహారాష్ట్ర, గుజరాత్‌లోని భావనగర్, జునాగఢ్‌ ప్రాంతాల నుంచి ఆక్సిజన్‌ సిలిండర్లను తెప్పించుకుంటున్నాయి.
అక్కడి కిందిస్థాయిఉద్యోగుల అత్యాశ కారణంగా అవి అక్రమార్కులకు          చేరుతున్నాయి.  
10 కిలోల ఆక్సిజన్‌ సిలిండర్‌ రూ.4,500 అసలు ధర కాగా.. కిందిస్థాయి ఉద్యోగులు రూ.5,500 నుంచి రూ.6,500 వరకూ విక్రయిస్తున్నారు.  
వీటిని తీసుకున్న అక్రమార్కులు రూ.10 వేల నుంచి రూ.11 వేలకు అమ్మేస్తున్నారు.
రోజూ ఒక్కో కంపెనీకి నాలుగైదు లారీల ఆక్సిజన్‌ సిలిండర్ల లోడ్లు వస్తుండటం, వాటి లెక్కలు చూసేవారు కిందిస్థాయి ఉద్యోగులకు బాధ్యత అప్పగించడంతో ఇదంతా జరుగుతోందని సమాచారం.  
అయితే ఇలా చేస్తున్న వారికి ఒక్కరికి కూడా ఆక్సిజన్‌ సిలిండర్లు విక్రయించేందుకు ప్రభుత్వ అనుమతి లేదని తెలుస్తోంది. 

ఆస్పత్రుల వద్ద గుట్టుచప్పుడు కాకుండా..
కొత్తగా మార్కెట్‌లోకి వచ్చిన రెమ్‌డిసివెర్‌ తదితర మందులు తక్షణం అందజేస్తామంటూ కొందరు దుకాణాల నిర్వాహకులు, ఏజెన్సీల ప్రతినిధులు ప్రభుత్వ, కార్పొరేట్‌ కోవిడ్‌ ఆస్పత్రుల సమీపంలో ప్రచారం చేసుకుంటున్నారు. ఢిల్లీ, ముంబైల నుంచి తెప్పించామని.. అందుకే బిల్లులు ఇవ్వలేకపోతున్నామని చెబుతున్నారు. ఒక్కో డోసు అమ్మినందుకు వీరికి రూ.10 వేల నుంచి రూ.20 వేలకు వరకూ లాభం వçస్తుంది. ఫ్యాబిఫ్లూ మందుల్లో మాత్రం రూ.వందల్లో గిట్టుబాటు అవుతుందని ఔషధ రంగ నిపుణులు చెబుతున్నారు.   

కరోనా మందులు అధిక ధరకు  విక్రయిస్తే కఠిన చర్యలు..  
టొసిలీజుమాబ్‌ ఇంజెక్షన్‌ అత్యవసర పరిస్థితుల్లో కరోనా రోగులకు వినియోగిస్తుంటారు. వీటి ఖరీదెక్కువు. విదేశాల నుంచి ముంబైకు అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వీటిని దిగుమతి చేసుకుంటారు. ప్రతి ఇంజెక్షన్‌ వివరాలు మా శాఖ వద్ద ఉంటాయి. మెడికల్‌ ఏజెన్సీలకు, కార్పొరేట్‌ ఆస్పత్రులకు ఎనెన్ని ఇంజక్షన్లు సరఫరా చేశారు.. ఎన్నింటిని వినియోగించారు అన్న దానిపై నిత్యం పర్యవేక్షణ ఉంటుంది. ఎవరైనా వీటిని అధిక ధరకు విక్రయిస్తుంటే ఔషధ నియంత్రణ శాఖకు సమాచారం ఇస్తే అక్రమార్కుల ఆట కట్టిస్తాం.  – రాజాభాను, అసిస్టెంట్‌ డైరెక్టర్,ఔషధ నియంత్రణ శాఖ, కృష్ణా జిల్లా  

బ్లాక్‌ మార్కెట్‌లో ఇలా..
విజయవాడ వన్‌టౌన్‌కు చెందిన ఓ వ్యక్తికి ఇటీవల కరోనా సోకింది. అయితే అతనికి వైరస్‌ లక్షణాలు ఎక్కువగా ఉండటంతో బంధువులు అతన్ని గుంటూరు జిల్లాలో ఓ ప్రైవేట్‌ కోవిడ్‌ ఆస్పత్రిలో చేర్పించారు.  
చికిత్సలో భాగంగా వైద్యులు ఆ రోగికి అత్యవసర పరిస్థితుల్లో వినియోగించే టొసిలీజుమాబ్‌ 400 మిల్లీగ్రాముల ఇంజెక్షన్‌ను రాసిస్తూ.. అది తమ వద్ద లేదని, బయట నుంచి తీసుకురావాలని                   సూచించారు.  
రోగి బంధువులు గుంటూరు నగరంలోని ఒక దుకాణంలో ఈ మందును తీసుకొచ్చారు.  
అయితే దీని ఎంఆర్‌పీ ధర రూ.35 వేలుగా ఉండగా ఆ దుకాణంలో రూ.90 వేలకు కొనుగోలు చేశారని తెలిసింది.  
అయితే సాధారణంగా ఈ మందు ప్రభుత్వ అనుమతలు పొందిన డ్రగ్‌ డీలర్లు.. స్పెషలిస్ట్‌ వైద్యుల ప్రిస్కిప్షన్‌ ఉంటేనే రోగులకు విక్రయిస్తారు. అయితే రోగుల అవసరాన్ని బట్టి వీటిని అధిక ధరలకు మాత్రం విక్రయించరాదు. 

మరిన్ని వార్తలు