ఇళ్ల మధ్యే కుళ్లిన మాంసం నిల్వలు

30 Dec, 2019 11:52 IST|Sakshi
ఎంహెచ్‌ఓ తనిఖీలో 400 కిలోల మాంసం గుర్తింపు

గోదాములు ఏర్పాటుచేసి ఆవుల ఎముకలు, కుళ్లిన మాంసం నిల్వ

ఆకస్మిక దాడులు చేసిన కార్పొరేషన్‌ ఎంహెచ్‌ఓ

400 కేజీల కుళ్లిన మాంసం గుర్తింపు

అధికారులతో వాగ్వాదానికి దిగిన నిర్వాహకులు

అధికారులకు అండగా నిలిచిన స్థానికులు

నెల్లూరు సిటీ: వందలాది ఇళ్లు.. అందరూ పేదలే.. నిత్యం వ్యాధులతో హాస్పిటల్‌ పాలవుతుంటారు.. ఏళ్ల తరబడి కొందరు వ్యక్తులు గుట్టుచప్పుడు కాకుండా ఆవు మాంసం వ్యాపారం చేస్తున్నారు. ఇళ్ల మధ్య ఆవులను వధించి, వాటి మాంసాన్ని ఇతర ప్రాంతాలకు, హోటల్స్, రెస్టారెంట్లకు తరలిస్తుంటారు. ఆదివారం ఎంహెచ్‌ఓ వెంకటరమణ తన బృందంతో ఆకస్మిక దాడులు చేశారు. నిల్వ మాంసాన్ని గుర్తించారు. కుళ్లిపోయిన మాంసం, ఎముకలను గోదాముల్లో నిల్వ చేసి ఉంచిన వైనాన్ని చూసి అధికారులు అవాక్కయ్యారు. సుమారు 400 కేజీ ల మేర నిల్వ ఆవు మాంసాన్ని నిర్వీర్యం చేయగా, ఫ్రీజర్లను స్వాధీనం చేసుకున్నారు. అధికారుల వివరాల మేరకు..

పలుమార్లు చెప్పినా..
నగరంలోని బోడిగోడతోట ప్రధాన రహదారిలో కొందరు వ్యక్తులు స్కిన్‌ మర్చంట్స్‌ కింద అనుమతుల్లేకుండా వ్యాపారం చేస్తున్నారు. గోదాములో వధించిన ఆవుల చర్మాన్ని తొలగించి, మాంసాన్ని ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. ఇంకా కుళ్లిపోయిన మాంసం, ఆవుల ఎముకులు, వాటి కళేబరాలను నిల్వ చేశారు. ఏళ్ల తరబడి ఇళ్ల మధ్యే కళేబరాలను ఉంచడంతో స్థానికులకు దుర్వాసన వచ్చేది. ఎన్నిసార్లు నిర్వాహకులకు చెప్పినా వారు పట్టించుకోలేదు. ఈక్రమంలో స్థానికులు కార్పొరేషన్‌ అధికారులకు ఫిర్యాదు చేశారు. కొన్నినెలలుగా దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నామని చెప్పారు. దీంతో హెల్త్‌ ఆఫీసర్‌ వెంకటరమణ తన బృందంతో ఆదివారం ఉదయం ఆకస్మిక దాడులు చేశారు. 

కెమికల్‌ ఫ్యాక్టరీలకు నోటీసులు  
బోడిగోడతోట ప్రాంతంలో మూడు కెమికల్‌ ఫ్యాక్టరీలు నిర్వహిస్తున్నారు. వాటిని ఎంహెచ్‌ఓ వెంకటరమణ తనిఖీ చేశారు. ఫ్యాక్టరీకి సంబంధించిన పత్రాలను నిర్వాహకులు చూపలేదు. దీంతో ప్రజలు నివాసం ఉంటున్న ప్రాంతాల్లో కెమికల్‌ ఫ్యాక్టరీలను నిర్వహించకూడదని వెంకటరమణ చెప్పారు. వాటికి నోటీసులు జారీ చేయాలని శానిటరీ ఇన్‌స్పెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. రెండు రోజుల్లో ఫ్యాక్టరీలను వేరే ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మీ ఇళ్లలో ఇలా ఉంచుకుంటారా?
నిబంధనల ప్రకారం ఇళ్ల మధ్య తోళ్ల వ్యాపారం చేయకూడదు. అయితే కొందరు వ్యక్తులు స్కిన్‌ మర్చంట్స్‌ పేరుతో ఆవులు, మేకలు, పొట్టేళ్ల తోళ్లను తొలగించి వాటిని ఎగుమతి చేస్తున్నారు. గోదాముల్లో కుళ్లిన మాంసాన్ని, ఎముకులను, కళేబరాలను నిల్వ చేశారు. వాటిని గుర్తించిన ఎంహెచ్‌ఓ వెంకటరమణ నిర్వాహకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ ఇళ్లలో ఈవి«ధంగా ఉంచుకుంటారా అని ప్రశ్నించారు. ప్రజల జీవితాలతో ఆడుకుంటారా? అంటూ మండిపడ్డారు. నిర్వాహకులు అధికారులతో వాగ్వాదం దిగడంతో స్థానికులు అధికారులకు అండగా నిలిచారు. నిర్వాహకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో వెనుదిరిగారు.

ఇళ్లలో మాంసం  నిల్వలు
బోడిగోడతోటలో కొందరు ఇళ్లలో ఆవు మాంసాన్ని ఫ్రీజర్లలో నిల్వ చేసి ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. అధికారులు దాడులు చేసి ఫ్రీజర్లలో భారీగా నిల్వ మాంసాన్ని గుర్తించారు. మాంసాన్ని హోటల్స్, రెస్టారెంట్లు, ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. మాంసాన్ని స్వాధీనం చేసుకుని నిర్వీర్యం చేశారు. ఫ్రీజర్లు, ఇతర వస్తువులను సీజ్‌ చేశారు. ఈక్రమంలో కొందరు అధికారుల కళ్లుగప్పి ఇళ్లలోని నిల్వ మాంసాన్ని గుట్టుచప్పుడు కాకుండా తరలించారు. పలువురు ఆవు మంసాన్ని కొన్ని హోటళ్లకు తరలిస్తున్నారని, దానిని మటన్‌లో కలిపి విక్రయిస్తున్నారని అధికారుల విచారణలో వెల్లడైంది.

కఠిన చర్యలు తీసుకుంటాం
ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడితే కఠిన చర్యలు తీసుకుంటాం. కుళ్లిన మాంసాన్ని ఫ్రీజర్లలో నిల్వ చేసి ఉండడాన్ని గుర్తించాం. అదేవిధంగా గోదాముల్లో ఎముకులు, కుళ్లిన మాంసాన్ని నిల్వ చేశారు. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న నిర్వాహకులపై చర్యలు తీసుకున్నాం.– పిడుగు వెంకటరమణ, ఎంహెచ్‌ఓ 

మరిన్ని వార్తలు