అవినీతికి అటెండర్‌

29 Dec, 2017 12:49 IST|Sakshi
సరకు బిల్లులను తనిఖీ చేస్తున్న కొండపల్లి శ్రీనివాస్‌

ఉయ్యూరులో ఉద్యోగం.. వన్‌టౌన్‌లో వసూళ్లు

డీసీటీవోలకు బదులుగా ఆయనే స్వయంగా తనిఖీలు

వీడియో తీసి ఉన్నతాధికారులకు పంపిన బాధితులు

వాణిజ్యపన్నుల శాఖలో ఓ అటెండర్‌ మాముళ్ల కథ

పేరు కొండపల్లి శ్రీనివాస్‌. చేసేది వాణిజ్యపన్నుల శాఖలో అటెండర్‌ ఉద్యోగం. అయితేనేం.. వన్‌టౌన్‌లోని వ్యాపారులను హడలెత్తిస్తాడు. కమర్షియల్‌ ట్యాక్‌ ఆఫీసర్‌ తరహాలో ఆయనే వాహనాలను తనిఖీ చేస్తాడు. జీరో వ్యాపారంపై దృష్టిపెట్టి వేలాది రూపాయలు ముడుపులు వసూలు చేస్తాడు. ఓ ఉన్నతాధికారి అండతో కోట్లకు పడగలెత్తి, వ్యాపారులను శాసిస్తున్న ఈ అటెండర్‌ బాగోతాన్ని కొందరు వీడియో తీసి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.

సాక్షి, విజయవాడ: దేశంలోని ప్రధాన నగరాల నుంచి రెడీమేడ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్‌ తదితర లక్షల రకాల వస్తువులు రైలుమార్గంలోని విజయవాడ  రైల్వే పార్సిల్‌ కార్యాలయానికి వస్తాయి. అక్కడి నుంచి ఆ వస్తువులు నగరంలోని హోల్‌సేల్, రిటైల్‌ వ్యాపారులకు చేరతాయి. ఈ సరుకులో ఎక్కువ భాగానికి వ్యాపారులు పన్ను చెల్లించరు. ఈ విషయం వాణిజ్యపన్నుల శాఖలోని సిబ్బందికి బాగా తెలుసు. దీన్ని ఆసరాగా చేసుకుని ఉయ్యూరు సర్కిల్‌ కార్యాలయంలో అటెండర్‌గా పనిచేస్తూ వన్‌టౌన్‌లో ఉండే కొండపల్లి శ్రీనివాస్‌ సొమ్ము చేసుకుంటున్నాడు.

ఒంటరిగా తనిఖీలు
వాణిజ్యపన్నుల శాఖలో వాహనాలు తనిఖీ చేయాలంటే జాయింట్‌ కమిషనర్‌ లేదా సీటీవో స్థాయి అధికారి  ఆదేశాలతో డీసీటీవో తమ సిబ్బందితో కలిసి తనిఖీలు చేస్తారు. అయితే, కొండపల్లి శ్రీనివాస్‌ మాత్రం ఇవేం అవసరం లేదు. వన్‌టౌన్‌ కాళేశ్వరరావు మార్కెట్‌ వద్ద ఒక్కడే వాహనాలు తనిఖీ చేస్తాడు. సరకుతో వెళ్తున్న రిక్షాలు, ఆటోలు, వ్యాన్‌లను ఆపి బిల్లులు తనిఖీ చేస్తాడు. బిల్లులో ఏమాత్రం తేడా ఉన్నా వెంటనే సరకు సీజ్‌ చేస్తానంటూ బెదిరిస్తాడు. చివరకు వ్యాపారి కాళ్లబేరానికి వస్తే ముడుపులు తీసుకుని వదిలేస్తాడు. ఒక్కో వ్యాపారి నుంచి రూ.10వేల నుంచి రూ.లక్ష వరకూ వసూలు చేస్తున్నాడని సమాచారం. ఎవరైనా వ్యాపారులు గట్టిగా ప్రశ్నిస్తే, వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించి వారితో భారీగా జరిమానాలు వేయించగల సమర్థుడు. కేవలం అటెండర్‌గా పనిచేసే శ్రీనివాస్‌కు డీసీటీవో స్థాయిలో తనిఖీలు చేయడం గమనార్హం. ఒక డివిజన్‌కు చెందిన డీసీటీవోలు మరో డివిజన్‌ పరిధిలోకి వెళ్లి తనిఖీలు చేయరు. అయితే, డివిజన్‌–2 పరిధిలోని ఉయ్యూరు సర్కిల్‌కు చెందిన శ్రీనివాస్, డివిజన్‌–1 పరిధిలోకి వెళ్లి వాహనాలను ఆపడం వ్యాపారులకు విస్మయం కలిగిస్తోంది.

తనిఖీలపై వీడియో
శ్రీనివాస్‌ వాహనాలను తనిఖీలు చేస్తుండగా, కొంతమంది బాధితులు వీడియోలు, ఫొటోలు తీసి వాణిజ్యపన్నుల శాఖ కమిషనర్‌తోపాటు జాయింట్‌ కమిషనర్లకు పంపారు. దీనిపై జాయింట్‌ కమిషనర్‌–2 రఘునా«థ్‌ స్పందిస్తూ ఈ వీడియోపై విచారణ చేయాలని ఉయ్యూరు సీటీవో విజయభాస్కర్‌ను ఆదేశించారు. 

రంగంలోకి ఉన్నతాధికారి
శ్రీనివాస్‌కు వాణిజ్యపన్నుల శాఖ కమిషనర్‌ కార్యాలయంలో పనిచేసే ఉన్నతాధికారితో సంబంధాలు ఉన్నాయి. ఆయన గతంలో డివిజన్‌–2 కార్యాలయంలో పనిచేశారు. ఆ అధికారిపై గతంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు కూడా చేశారు. ప్రస్తుతం ఆ అధికారి శ్రీనివాస్‌ను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగా తామే తనిఖీలు చేయించామంటూ నివేదిక ఇవ్వాలంటూ డివిజన్‌–1 కార్యాలయానికి చెందిన ఒక అధికారిపై ఒత్తిడి కూడా తెస్తున్నారు.

విచారణకు ఆదేశించాం
కొండపల్లి శ్రీనివాస్‌ వాహనాలను తనిఖీ చేస్తున్నట్లు ఎవరో నాకు వీడియో పంపారు. దాని గురించి విచారణ చేసి నివేదిక ఇవ్వమని ఉయ్యూరు సీటీవోను ఆదేశించాను. ఆదేశాల మేరకే విచారణ చేశారా? ఎప్పుడు చేశారు? పక్కన ఇంకా ఎవరైనా అధికారులు ఉన్నారా? శ్రీనివాస్‌ ఒక్కడే తనిఖీలు చేశాడా? అనేది తేలాల్సి ఉంది. శ్రీనివాస్‌ను విచారించి సీటీవో నివేదిక ఇస్తారు. అప్పుడే నిర్ణయం తీసుకుంటాను.
– రఘునాథ్, జాయింట్‌ కమిషనర్‌ 

మరిన్ని వార్తలు