వీడియోల పేరుతో బెదిరింపులు

27 Dec, 2019 08:41 IST|Sakshi
నిందితులు మహేశ్వరి, సంతోష్‌

రూ.4.50 లక్షలు వసూలు

ఇద్దరు నిందితుల అరెస్ట్‌

కేపీహెచ్‌బీకాలనీ: అశ్లీల వీడియోలను బహిర్గతం చేస్తామని బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతున్న ఓ మహిళతో పాటు ఆమెకు సహకరించిన మరో వ్యక్తిని కేపీహెచ్‌బీ పోలీసులు గురువారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇప్పటికి వరకు ఇద్దరూ కలిసి బాధితుడి నుంచి రూ. 4.50 లక్షలు వసూలు చేయడమేగాక మరో రూ.1.5లక్షలు డిమాండ్‌ చేశారు. సీఐ లక్ష్మీనారాయణ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కావేరి హిల్స్‌లో ఉంటున్న మణికంఠకు టెండర్‌  ఆన్‌లైన్‌ అప్లికేషన్లు పూర్తి చేసే క్రమంలో మహేశ్వరి అనే యువతితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ఆధారంగా ఈ నెల 14న వీరిద్దరూ కూకట్‌పల్లి విజయానగర్‌ కాలనీలోని ఓయో లాడ్జిలో గడిపారు. అనంతరం మహేశ్వరి తన స్నేహితుడు సంతోష్‌తో కలిసి మణికంఠను బెదిరించి డబ్బులు వసూలు చేయాలని పథకం పన్నింది.

ఇందులో భాగంగా సంతోష్‌తో మణికంఠకు ఫోన్‌ చేయించి తాము  కూకట్‌పల్లి పోలీసులమని చెబుతూ లాడ్జిలో గడిపిన వీడియోలు తమ వద్ద ఉన్నాయని అతడిని బెదిరించి అతడి నుంచి రూ.4.49 లక్షలు వసూలు చేయడంతో పాటు ఐఫోన్‌ కూడా తీసుకున్నారు. మరో రూ. 1.5లక్షలు ఇవ్వాలని ఒత్తిడి చేయడంతో బాధితుడు ఈ నెల 22న మాదాపూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేపీహెచ్‌బీ పోలీసులకు బదిలీ చేశారు. కేపీహెచ్‌బీ పోలీసులు మణికంఠ ద్వారా నిందితులకు ఫోన్‌ చేయించి డబ్బులు తీసుకునేందుకు ఫోరంమాల్‌ వద్దకు రావాలని చెప్పారు. గురువారం ఉదయం మహేశ్వరి, సంతోష్‌ అక్కడికి రాగానే పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులను స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించగా   నేరం అంగీకరించారు. వారి నుంచి 4.09లక్షల నగదు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. నిందితులను పట్టుకోవటంలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీస్‌ అధికారులకు ప్రోత్సాహకం అందజేయనున్నట్లు సీఐ లక్ష్మీనారాయణ తెలిపారు.

మరిన్ని వార్తలు