చనువు పెంచుకుని.. మోసం చేసి..

2 Nov, 2019 11:56 IST|Sakshi
భార్యాభర్తలు కనిష్క, విజయ్‌కుమార్‌

తండ్రిలాంటివాడివని నమ్మించి.. వ్యాపారంలో పెట్టుబడికంటూ రూ.10 లక్షలు వసూలు

రిసార్ట్‌కు పిలిచి మత్తులోకి దింపి చర్చి ఫాదర్‌తో ఫొటోలు, వీడియోలు

బొమ్మ పిస్టల్‌తో భర్త ఎంట్రీ రూ.కోటి డిమాండ్‌ చేసి బాండ్‌పేపర్‌ రాయించుకున్నదంపతులు

హోటల్‌ బిజినెస్‌లో నష్టపోయి మోసాలకు తెరలేపిన వైనం

మొయినాబాద్‌ (చేవెళ్ల): తన ఆరోగ్యం బాగోలేదని, తనకోసం ప్రార్థనలు చేయాలంటూ ఓ మహిళ చర్చి ఫాదర్‌ను కోరింది. తన తండ్రిలాంటి వాడివంటూనే వలపు వల విసిరింది. తమకు హోటల్‌ బిజినెస్‌ ఉందని, చర్చికి అనుబంధంగా ఉన్న సంస్థకు విరాళాలు సైతం ఇస్తా మంటూ ఆశ చూపింది. పలుమార్లు అతడిని రెస్టారెంట్లకు భోజనానికి పిలిచింది. హోటల్‌ వ్యాపారంలో పెట్టుబడి కోసం రూ.10 లక్షలు కావాలంటూ అతడి వద్ద తీసుకుంది. ఓ రిసార్ట్‌కు తీసుకెళ్లి పళ్ల రసంలో మత్తుమందు కలిపి మాయ చేసింది. మత్తులో నుంచి తేరుకోగానే బొమ్మ పిస్తోల్‌తో భర్త ఎంట్రీ ఇచ్చాడు. ఫాదర్‌ను బెదిరించి రూ.కోటి బాకీ ఉన్నట్లు బాండ్‌ పేపర్‌ రాయించుకున్నారు. రూ.10 లక్షలు తీసుకుని మిగతా డబ్బుల కోసం వేధించడంతో చర్చి ఫాదర్‌ పోలీసులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన పోలీసులు భార్యాభర్తలను పట్టుకుని కటకటాల్లోకి నెట్టారు.

మొయినాబాద్‌ మండలంలోని ఓ చర్చి వద్దకు ఆగస్టు 11వ తేదీన మందాకిని కనిష్క అనే మహిళ వచ్చింది. చర్చి ఫాదర్‌ను కలిసి తన ఆరోగ్యం బాగోలేదని.. తనకోసం ప్రార్థనలు చేయాలని కోరింది. ఇలా మూడుసార్లు చర్చికి వచ్చి ఫాదర్‌తో ప్రార్థనలు చేయించి అతడితో చనువు పెంచుకుంది. తన తండ్రిలాంటి వాడివని మాటలు చెప్పి నమ్మించింది. తమకు హోటల్‌ బిజినెస్‌ ఉందని, చర్చికి అనుబంధంగా ఉన్న సంస్థకు విరాళాలు కూడా ఇస్తామని చెప్పడంతో ఫాదర్‌ ఆ మాటలు నమ్మాడు. తాము కూడా సికింద్రాబాద్‌లో అనాథాశ్రమం నడుపుతున్నట్లు ఫాదర్‌కు చెప్పింది. ఫాదర్‌ ఫోన్‌ నంబర్‌ తీసుకుని తరచూ వాట్సప్‌ చాటింగ్‌ చేసేది. ఈ క్రమంలో శంషాబాద్‌ ప్రాంతంలో రెస్టారెంట్‌లో భోజనానికి పిలిచింది. మరోసారి అనాథ పిల్లలను వండర్‌లాకు తీసుకెళ్తున్నామని అక్కడికి పిలిచి ఫాదర్‌తో సెల్ఫీలు దిగింది. మరోసారి అనాథలకు సబంధించిన సినిమా అంటూ సినిమాకు తీసుకెళ్లింది.

హోటల్‌ వ్యాపారంలో పెట్టుబడి అంటూ..
తన భర్త హోటల్‌ వ్యాపారం చేస్తాడని, విజయవాడలో కేఎఫ్‌సీ బ్రాంచి ఏర్పాటు చేస్తున్నామని, దానికి రూ.2 కోట్లు ఖర్చవుతుందని చర్చి ఫాదర్‌కు కనిష్క చెప్పింది. తమ వద్ద రూ.1.50 కోట్లు ఉన్నాయని, మీరు కూడా రూ.50 లక్షలు పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయని చెప్పింది. తన వద్ద అన్ని డబ్బులు లేవని.. తాను పెట్టుబడి పెట్టలేని చెప్పడంతో చేబదులుగా ఎన్ని డబ్బులు ఉన్నా ఇవ్వండని కనిష్క అడిగింది. దీంతో చర్చిఫాదర్‌ ఆమెను నమ్మి రూ.10 లక్షలు ఇచ్చాడు.

రిసార్ట్‌కు పిలిచి..
డబ్బులు తీసుకున్న పది రోజుల తరువాత అక్టోబర్‌ 2వ తేదీన కేఎఫ్‌సీ ప్రతినిధులు శంకర్‌పల్లి లోని రిసార్ట్‌కు వస్తున్నారని, వారిని పరిచయం చేస్తానని అక్కడికి రావాలని ఫాదర్‌ను ఆమె కోరింది. రిసార్ట్‌లో ఓ కాటేజీ ఫాదర్‌కు,  తనకు మరో కాటేజీ బుక్‌ చేసుకుంది. రాత్ర యినా కేఎఫ్‌సీ ప్రతినిధులు రాలేదు. అప్పటికే ఆకలి వేస్తుందని, తాను భోజనం చేస్తానని ఫాదర్‌ చెప్పాడు. తన కాటేజీలోనే కలిసి భోజనం చేద్దామని కనిష్క పిలిచింది. భోజనం కాస్త ఆలస్యమవుతుందని, అప్పటివరకు పండ్ల రసం తాగమని యాపిల్‌ జ్యూస్‌ ఇచ్చింది. అందులో మత్తుమందు కలపడంతో జ్యూస్‌ తాగిన ఫాదర్‌ మత్తులోకి జారుకున్నాడు. మత్తులో ఉన్న సమయంలో అతడితో కలిసి ఉన్నట్లు ఫొటోలు, వీడియోలు తీసుకుంది. మరుసటి రోజు వేకువజాము 4 గంటలకు ఫాదర్‌ లేచి చూసేసరికి బాత్‌రూంలో ఉన్నాడు.

అదే సమయంలో కనిష్క భర్త విజయ్‌కుమార్‌ పిస్టల్‌తో ఫాదర్‌ కణతకు గురిపెట్టి చంపేస్తా నని బెదిరించాడు. నా భార్యను మోసం చేస్తావా అంటూ భయపెట్టాడు. ఫొటో లు, వీడియోలు ఉన్నాయని.. వాటిని బయటపెడితే నీ పరువు పోతుందని బెదిరించాడు. తమకు రూ.కోటి ఇస్తే ఇవి బయట పెట్ట మని రూ.కోటికి బాండ్‌పేపర్‌ రాయించుకున్నారు. ఆ తరువాత ఫోన్‌చేసి డబ్బులు డిమాండ్‌ చేయడంతో రూ.10 లక్షలు ఇచ్చాడు. మరో వారం తరువాత మళ్లీ ఫోన్‌ చేసి మిగతా డబ్బులు ఇవ్వాలని వేధించడం మొదలుపెట్టారు. విషయం బయటకు వస్తే పరువు పోతుందని భావించిన ఫాదర్‌ లోలోనే మదనపడ్డాడు. ఓ దశలో ఆత్మహత్య చేసుకోవాలని భావించిన చర్చి ఫాదర్‌ ఎట్టకేలకు తన మిత్రుడితో ఈ విషయం పంచుకున్నాడు. ఆ తరువాత మొయినాబాద్‌ పోలీసులను ఆశ్రయించాడు.

కటకటాల్లోకి నిందితులు..
అక్టోబర్‌ 18వ తేదీన మొయినాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హైదరాబాద్‌లో కనిష్క, విజయ్‌కుమార్‌ దంపతులను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి బాండ్‌ పేపర్లు, ఫొటోలు, వీడియోలు, సెల్‌ఫోన్లు, బొమ్మ తుపాకీ స్వాధీనం చేసుకున్నారు. వ్యాపారంలో వచ్చిన నష్టాలను పూడ్చుకోవడం కోసమే బెదిరింపులకు పాల్పడినట్లు తేలడంతో పోలీసులు వారిద్దరినీ రిమాండ్‌కు పంపారు.

హోటల్‌ వ్యాపారంలో నష్టం రావడంతో..
విజయవాడకు చెందిన మందాకిని కనిష్క గతంలో హైదరాబాద్‌లో ఎయిర్‌ హోస్టెస్‌గా పని చేసింది. జగ్గయ్యపేటకు చెందిన విజయ్‌ కుమార్‌ కొన్నేళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చి హోటల్‌ బిజినెస్‌ నిర్వహిస్తున్నాడు. ఎయిర్‌ హోస్టెస్‌గా పనిచేసే సమయంలో కనిష్క విజయ్‌కుమార్‌ హోటల్‌కు వెళ్లేది. ఆ క్రమంలో ఇద్దరికి పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త ప్రేమగా మారడంతో గతేడాది పెళ్లి చేసుకున్నారు. ఆ తరువాత హోటల్‌ వ్యాపారంలో నష్టాలు వచ్చాయి. దీంతో ఏదో రకంగా డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో చర్చి ఫాదర్‌పై వలపు వల పన్నారు. పథకం ప్రకారమే అతడిని మాయచేసి డబ్బులు గుంజారు.

మరిన్ని వార్తలు