నిప్పంటించుకున్న దంపతులు..ముగ్గురి సస్పెండ్‌

29 Aug, 2019 08:25 IST|Sakshi

లక్నో : తమను వేధిస్తున్న వారిపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదనే ఆవేదనతో దంపతులు ఆత్మహత్యాయత్నం చేశారు. పోలీసుస్టేషను ముందే ఒంటికి నిప్పంటించుకుని ప్రాణాలు తీసుకునేందుకు సిద్ధపడ్డారు. ఈ క్రమంలో తీవ్ర గాయాలపాలైన వారిని పోలీసులు ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్‌ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మథురలో చోటుచేసుకుంది. వివరాలు...మథుర జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన జోగీందర్‌- చంద్రావతి దంపతులు ఇటుక బట్టీలో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి అదే ఊరిలో సొంతభూమి ఉంది. అయితే గ్రామంలో పెద్దమనుషులుగా చెలామణీ అవుతున్న కొంతమంది వ్యక్తులు ఆ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ విషయంలో సదరు దంపతులను తీవ్రంగా వేధిస్తున్నారు. ఈ క్రమంలో జోగీందర్‌ తలపై రాడ్‌తో కొట్టి.. చంద్రవతిని బెదిరించారు. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు.

ఈ నేపథ్యంలో ఫిర్యాదు చేసి వారం రోజులు గడుస్తున్నా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మరోవైపు గ్రామంలోని పెద్ద మనుషులు కూడా భూమి తమ పేరిట రాయాల్సిందిగా ఒత్తిడి పెంచారు. దీంతో ఆవేదన చెందిన దంపతులు బుధవారం ఉదయం ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని పోలీసు స్టేషనుకు చేరుకున్నారు. తమను వేధిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. అయితే పోలీసుల నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో అక్కడే నిప్పంటించుకున్నారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న కొంతమంది పోలీసులు వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. అప్పటికే 60 శాతం గాయాలతో విలవిల్లాడుతున్న దంపతులను మెరుగైన చికిత్స కోసం ఢిల్లీకి తరలించాల్సిందిగా వైద్యులు సూచించారు. అక్కడ వారు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. కాగా ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఈ క్రమంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకుని సదరు స్టేషను ఇంచార్జి సహా ఇద్దరు అధికారులను సస్పెండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు