ఆర్థిక ఇబ్బందులతో దంపతుల ఆత్మహత్య

9 Nov, 2018 08:42 IST|Sakshi
కూతురితో బాపయ్య చౌదరి, శిరీష (ఫైల్‌)

ఉరి వేసుకుని భార్య..

రైలు కిందపడి భర్త బలవన్మరణం

కేపీహెచ్‌బీ కాలనీ: ఆర్థిక ఇబ్బందులతో చెలరేగిన కలహాలు చివరకు భార్యాభర్తల ఆత్మహత్యకు దారితీశాయి.  భర్త షేర్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టి నష్టపోవటంతో పాటు ఆస్తులు అమ్ముకోవటాన్ని ప్రశ్నించిన భార్య తీవ్ర మనోవేదనకు గురై ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భార్య ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకున్న భర్త రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. రేపల్లె గ్రామం అమరావతికి చెందిన బాపయ్య చౌదరీకి కేపీహెచ్‌బీ కాలనీకి చెందిన బాతినేని çశిరీష (27)తో  2017లో వివాహమైంది. కొన్నాళ్లపాటు స్వగ్రామంలో ఉన్న వీరు అనంతరం కేపీహెచ్‌బీకాలనీలో నివాసముంటూ దివ లేబరేటరీలో ఉద్యోగం చేస్తూ నివాసం ఉంటున్నారు. వీరికి మూడేళ్ల కూతురు ఉంది.

బాపయ్య చౌదరి స్టాక్‌ మార్కెట్‌లో షేర్లు కొనుగోలు చేసి నష్టపోయాడు. వివాహ సమయంలో భరణం కింద ఇచ్చిన భూమిని సైతం అమ్మివేశాడు. దీంతో భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. మనస్తాపానికి గురైన శరీష సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బుధవారం దీపావళి రోజున ఆమె సోదరుడు కృష్ణ చైతన్య పండుగకు సోదరినిఆహ్వానించేందుకు ఫోన్‌ చేయగా స్పందించలేదు.  దీంతో ఇంటికి వెళ్లి చూడగా ఆమె ఉరివేసుకుని కనిపించింది. బావ బాపయ్య చౌదరికి ఫోన్‌ చేసి సమాచారం అందించాడు. గురువారం ఉదయం ప్రసాద్‌ అనే వ్యక్తి కృష్ణ చైతన్యకు ఫోన్‌ చేసి బాపయ్యచౌదరి సనత్‌నగర్‌ రైల్వే ట్రాక్‌ వద్ద ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపాడు. ఆర్థిక ఇబ్బందులతో భార్యాభర్తలు బలవన్మరణానికి పాల్పడడంతో మూడేళ్ల కూతురు మిగిలిన సంఘటన చూపరులను కంటతడి పెట్టించింది. కేపీహెచ్‌బీ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు