రుణమాఫీ కాలేదని భార్యాభర్తల బలవన్మరణం

28 Aug, 2018 09:30 IST|Sakshi

ఆలూరు: కర్నూలు జిల్లా ఆలూరు మండలం తుమ్మలబీడులో దారుణం చోటుచేసుకుంది. రుణమాఫీ కాలేదని గ్రామానికి చెందిన రామయ్య దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రభుత్వం చేస్తానన్న రుణమాఫీ కాకపోవడంతో పాటు తీసుకున్న అప్పుకు బ్యాంకు అధికారులు నోటీసులు జారీ చేయడంతో భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. అప్పుతీర్చడానికి మరో మార్గం లేకపోవడంతో మనస్తాపం చెందిన ఆ వృద్ధ దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు.

వివరాల్లోకి వెళితే.. గతంలో ఆ దంపతులు వ్యవసాయం కోసం ఆంధ్రా ప్రగతి గ‍్రామీణ బ్యాంకు నుంచి రూ. 1.46 లక్షల రుణం తీసుకున్నారు. అయితే 2016లో రుణ విమోచన పత‍్రాన్ని సైతం బ్యాంకు అధికారులు రామయ్యకు ఇచ్చారు. దాంతో  ఏపీ ప్రభుత్వం చేస్తానన్న రుణమాఫీపై కొండంత ఆశలు పెట్టుకున్నారు. ఇక్కడ రుణమాఫీ కాకపోవడంతో పాటు పంటలు కూడా సరిగా పండకపోవడంతో ఆ రుణం వారికి  భారంగా మారింది. మరొకవైపు బ్యాంకు అధికారుల నుంచి ఒత్తిడికి కూడా పెరిగిపోయింది. రుణం తీర్చాలంటూ బ్యాంకు అధికారులు నోటీసులు జారీ చేయడంతో ఆ వృద్ధ దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. మరొకవైపు నోటీసు ఫీజు రూ. 290 కూడా కట్టాలంటూ బ్యాంకు అధికారులు పేర్కొనడం కూడా వారిని తీవ్ర మనస్తాపానికి గురి చేసింది. దాంతో కలత చెందిన రామయ్య దంపతులు బ్రతకడాన్ని భారంగా భావించి ఆత్మహత్య చేసుకున్నారు.

ప్రభుత్వం వైఫల్యం వల్లే..
రుణమాఫీ కాకపోవడంతోనే రామయ్య దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారని వైఎస్సార్‌సీపీ రైతు విభాగం అధ్యక్షుడు నాగిరెడ్డి పేర్కొన్నారు. రుణమాఫీ చేయడంలో ప్రభుత్వం విఫలమవడం వల్లే.. ఆత్మాభిమానం చంపుకోలేక వృద్ధులు ఆత్మహత్యకు పాల్పడ్డారన్నారు. రైతులకు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందనీ, దయచేసి రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు