రోడ్డు ప్రమాదంలో దంపతుల దుర్మరణం

28 Apr, 2020 08:07 IST|Sakshi
కేశవనాయక్‌ కుటుంబ సభ్యులు (ఫైల్‌)

అనాథలుగా మారిన పిల్లలు

రోడ్డు ప్రమాదంతో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది. గంటల వ్యవధిలో తల్లిదండ్రులు మరణించా­రు. అమ్మా, నాన్న తిరిగిరాని లోకా­లకు వెళ్లారని తెలియని పిల్లలు అమా­యకంగా అటు ఇటు తిరుగుతుండటం చూపరులను కలచివేసింది. చిన్నవయసులోనే ఆ పిల్లలకు తల్లిదండ్రులను దూరం చేశావా దేవుడా అంటూ బంధువులు విలపించారు.

అనంతపురం, వజ్రకరూరు: రోడ్డు ప్రమాదంలో దంపతులు దుర్మరణం చెందారు. వారి ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు. వజ్రకరూరు మండలం బోడిసానిపల్లి తండాకు చెందిన మూడ్‌ కేశవనాయక్‌(30)కు ఇదే మండలం ఎన్‌ఎన్‌పి తండాకు చెందిన వరలక్ష్మిబాయి(26)తో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి మూడు సంవత్సరాల కుమారుడు యువరాజ్‌తోపాటు ఒకటిన్నర సంవత్సరం వయసు గల కూతురు నందిని ఉంది. వరలక్ష్మిబాయి ప్రస్తుతం మూడు నెలల గర్భిణి.

కేశవనాయక్‌ అక్క ధనలక్ష్మికి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో నాలుగు రోజుల క్రితం ద్విచక్రవాహనంలో భార్య, కూతురితో కలిసి బళ్లారికి వెళ్లాడు. ఆదివారం సాయంత్రం బళ్లారి నుంచి  స్వగ్రామానికి ద్విచక్ర వాహనంలో వస్తుండగా మార్గమధ్యంలో పాల్తూరు క్రాస్‌ వద్ద గుర్తు తెలియని బొలెరో వాహనం ఢీకొంది. ఈ ఘటనలో వరలక్ష్మిబాయి అక్కడికక్కడే మృతి చెందగా కేశవనాయక్‌ అనంతపురం ఆస్పత్రిలో అదే రోజు రాత్రి మృతి చెందాడు. కూతురు నందిని స్వల్ప గాయాలతో బయట పడింది. ఉరవకొండ ఎస్‌ఐ ధరణిబాబు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు