ఆగర్తిపాలెంలో విషాదఛాయలు

27 Jun, 2020 09:36 IST|Sakshi
మనవళ్లతో సత్యానందం, విజయకుమారి దంపతులు (ఫైల్‌)

సూర్యాపేటలో జిల్లాకు చెందిన ముగ్గురి దుర్మరణం  

పశ్చిమగోదావరి, పాలకొల్లు అర్బన్‌: తెలంగాణలోని సూర్యాపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పాలకొల్లు మండలం ఆగర్తిపాలెం గ్రామానికి చెందిన ఉపాధ్యాయ దంపతులతోపాటు వారి కుమారుడు మృత్యువాత పడడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆగర్తిపాలెంకు చెందిన మైలాబత్తుల సత్యానందం, విజయకుమారి దంపతులతోపాటు వీరి కుమారుడు జోసఫ్‌ మృతిచెందినట్లు వార్తా మాధ్యమాల్లో తెలుసుకుని గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు. వారితో సత్సంబంధాలను, స్నేహాన్ని తలచుకుని కన్నీటిపర్యంతమయ్యారు. గ్రామానికి చెందిన మైలాబత్తుల రాబర్ట్, మరియమ్మ దంపతుల జ్యేష్ట కుమారుడుసత్యానందం. ఈయనకు ఇద్దరు తమ్ముళ్లు, ముగ్గురు చెల్లెళ్లు ఉన్నారు.(సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం)

సత్యానందం నరసాపురం వైఎన్‌ కళాశాలలో డిగ్రీ చదువుకున్నారు. రాజమండ్రి డిగ్రీ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. అలాగే ఈయన భార్య విజయకుమారి కూడా ఉపాధ్యాయురాలిగా పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. వీరికి కుమారుడు జోసఫ్, కుమార్తె ఉన్నారు. జోసఫ్‌ విజయవాడలో ఇంటీరియల్‌ డెకరేషన్‌ వ్యాపారం చేస్తున్నారు. సత్యానందం, విజయకుమారి దంపతులు ఉద్యోగ విరమణ చేసిన అనంతరం రాజమండ్రిలో స్థిరపడ్డారు. విజయకుమారికి అనారోగ్యంగా ఉండడంతో కుమారుడు జోసఫ్, సత్యానందం కలిసి ఆమెకు హైదరాబాద్‌లో చికిత్స ఇప్పించేందుకు విజయవాడ నుంచి శుక్రవారం తెల్లవారుజామున బయలుదేరారు. మార్గమధ్యలో జరిగిన ప్రమాదంలో ముగ్గురూ మరణించారు.  

మెగాస్టార్‌ చిరంజీవి క్లాస్‌మేట్‌
నరసాపురం వైఎన్‌ కళాశాలలో సత్యానందం డిగ్రీ చదివారు. ఆ రోజుల్లో మెగాస్టార్‌ చిరంజీవితో స్నేహంగా ఉండేవారు. వీరిద్దరూ బాల్య స్నేహితులు. డిగ్రీ కలిసి చదువుకున్నారు. ప్రస్తుతం సత్యానందానికి ఆగర్తిపాలెంలో వ్యవసాయ భూములు ఉన్నాయి. ఇంటిని ఇటీవలే విక్రయించారని స్థానికులు చెబుతున్నారు. 

ఆగర్తిపాలెంలో అంత్యక్రియలు
రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన సత్యానందం, విజయకుమారి, జోసఫ్‌ల భౌతికదేహాలు శుక్రవారం రాత్రికి ఆగర్తిపాలెం చేరుకుంటాయని, శనివారం క్రైస్తవ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తామని సత్యానందం సోదరుడు రమేష్‌ విలేకరులకు తెలిపారు. 

ప్రముఖుల సంతాపం  
సత్యానందం దంపతులతోపాటు, వారి కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతిచెందారనే వార్త ఆగర్తిపాలెం ప్రజలను తీవ్రంగా కలచివేసింది.ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్, డీసీసీబీ చైర్మన్‌ కవురు శ్రీనివాస్, డీసీఎంఎస్‌ చైర్మన్‌ యడ్ల తాతాజీ, పార్టీ మండల కన్వీనర్‌ మైలాబత్తుల మైఖేల్‌రాజు, మాజీ సర్పంచ్‌ తోటె మార్టిన్‌ లూథర్, ఆగర్రు సొసైటీ మాజీ అధ్యక్షుడు మేడిది జాన్‌ డేవిడ్‌రాజు తదితరులు సంతాపం తెలిపారు. 

మరిన్ని వార్తలు