పది నిమిషాల్లోనే...

1 Feb, 2020 12:58 IST|Sakshi
గాయపడిన బాలుడు తన్వీర్‌

ఆస్పత్రికని బయలుదేరి అనంతలోకాలకు...

జాతీయ రహదారిపై అవ్వపేట వద్ద రోడ్డు ప్రమాదం

లారీని ఢీకొన్న బైక్‌

భర్త దుర్మరణం భార్య పరిస్థితి విషమం  

పదకొండు నెలల బిడ్డను విశాఖలోని  ఆస్పత్రికి తీసుకువెళ్లేందుకు బయలుదేరిన ఆ తల్లిదండ్రులు అంతలోనే ప్రమాదానికి గురయ్యారు. ఇంటి నుంచి బయలుదేరిన పది నిమిషాల్లోనే తమ బిడ్డతో పాటు తల్లిదండ్రులు ప్రమాదానికి గురయ్యారన్న సమాచారం ఆ కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాదం నింపింది. అదుపుతప్పిన బైక్‌ లారీ కింది భాగంలోకి బలంగా దూసుకుపోవడంతో బిడ్డ తండ్రి అక్కడికక్కడే మృతి చెందాడు. తల్లి తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లింది. ఈ ప్రమాదంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

పూసపాటిరేగ (భోగాపురం): ఇంటి నుంచి బయలుదేరిన పది నిమిషాల వ్యవధిలో ఆ కుటుంబం చిన్నాభిన్నమైంది. మోటారుసైకిల్‌పై ఆస్పత్రికి వెళ్తుండగా అదుపుతప్పి లారీని ఢీకొన్న ప్రమాదంలో భర్త అక్కడికక్కడే దుర్మరణం చెందగా, భార్య తలకు తీవ్ర గాయమై పరిస్థితి విషమంగా ఉంది. వారితో ఉన్న 11 నెలల బాలుడు తన్వీర్‌కు గాయమైంది. వివరాల్లోకి వెళ్తే...జియ్యమ్మవలస మండలం పెదబుడ్డిడి గ్రామానికి చెందిన పడాల శ్రీనివాసరావు(30) తొమ్మిది నెలల కిందట అక్కివరం శ్రీనివాస హేచరీలో సూపర్‌వైజర్‌గా విధుల్లో చేరాడు. శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో భార్య స్వాతి(29), 11 నెలల కుమారుడు తన్వీర్‌తో కలిసి విశాఖపట్నంలోని ఎల్‌వీ ప్రసాదు కంటి ఆస్పత్రికి శ్రీనివాసరావు బయలుదేరారు. సవరవిల్లి పంచాయతీ అవ్వపేట జంక్షన్‌కు వచ్చేసరికి ముందుగా వెళ్తున్న లారీని బైక్‌తో బలంగా ఢీకొని లారీ కిందకు మోటారుసైకిల్‌తో పాటు దూసుకెళ్లాడు. శ్రీనివాసరావు వెనక్కి తూలడంతో తలకు బలంగా గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. స్వాతి తలకు తీవ్ర గాయమై కోమాలోకి వెళ్లింది. 11 నెలల తన్వీర్‌ కిందకు పడడంతో తలకు స్వల్ప గాయమైంది. వెంటనే సమాచారం అందుకున్న భోగాపురం ఎస్‌ఐ శ్యామల సంఘటనా స్థలానికి చేరుకొని తీవ్రంగా గాయపడిన స్వాతిని తన వాహనంలో ఆస్పత్రికి తరలించారు. స్వాతి పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స నిమిత్తం విశాఖలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. శ్రీనివాసరావు మృతదేహానికి పోస్టుమార్టం నిమిత్తం విజయనగరం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. భోగాపురం ఎస్‌ఐ శ్యామల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

పెదబుడ్డిడిలో విషాదం...
జియ్యమ్మవలస: రోడ్డు ప్రమాదంలో శ్రీనివాసరావు మృత్యువాత పడడంతో పాటు భార్య స్వాతి పరిస్థితి విషమంగా ఉండడంతో పెదబుడ్డిడిలో విషాదం నెలకొంది. అప్పుడే ఇంటి నుంచి బయలుదేరిన కుటుంబం ఇలా చిన్నాభిన్నం కావడంతో గ్రామమంతా ఉలిక్కి పడింది. రెండేళ్ల కిందటే వివాహమైన శ్రీనివాసరావు, స్వాతి దంపతులకు 11 నెలల బిడ్డ తన్వీర్‌ కూడా ఈ ప్రమాదంలో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. తండ్రి మృతి చెందడం, తల్లి కోమాలోకి వెళ్లడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. బిడ్డను ఆస్పత్రికి తీసుకువెళ్తుండగా ఘటన జరగడంతో గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మృతుని తండ్రి కొద్ది సంవత్సరాల కిందట మరణించగా తల్లి, నాన్నమ్మ, తమ్ముడితో కలిసి శ్రీనివాసరావు పెదబుడ్డిడిలో నివాసం ఉంటున్నాడు. నిరుపేద కుటుంబం కావడం, ఇంటికి శ్రీనివాసరావే ఆధారం కావడం ఇంతలోనే మృత్యువాత పడడంతో ఇక ఎలా జీవించేదని కుటుంబ సభ్యులు చేస్తున్న రోదనలు చూపరులను కన్నీరు పెట్టించాయి.

మరిన్ని వార్తలు