రోడ్డు ప్రమాదంలో దంపతుల మృతి...

19 Nov, 2018 10:30 IST|Sakshi
కోటేశ్వరరావు, స్వప్న

అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు..

ద్విచక్రవాహనంపై వెళుతున్న భార్యాభర్తల మృతి

బస్సు డ్రైవర్‌ సెల్‌డ్రైవింగ్‌ కారణం?

బోడుప్పల్‌: ఉప్పల్‌ నుంచి ఘట్‌కేసర్‌ వెళుతున్న ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బీభత్సం సృష్టించడంతో దంపతులు మృతి చెందారు. మేడిపల్లి ఇనస్పెక్టర్‌ డి.అంజిరెడ్డి, స్థానికులు తెలిపిన ప్రకారం... రాజమండ్రికి చెందిన పి.కోటేశ్వరరావు (29) గత కొంత కాలంగా నగరంలో ఉంటూ తార్నాకలోని ఓ ప్రైవేటు సంస్థలో మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నారు. ఆయన యాదాద్రి జిల్లా బొమ్మల రామారం మండలానికి చెందిన నాగినేని పల్లికి చెందిన స్వప్న(27) రెండేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పీర్జాదిగూడ మునిసిపాలిటీ పరిధిలోని బాలాజీ నగర్‌లో నివసిస్తున్న  వీరు ఆదివారం పనిమీద  అన్నోజిగూడకు బయలుదేరారు.  నారపల్లి చౌరస్తా వరకూ వచ్చి ఆర్టీసీ బస్సుకు దారి ఇచ్చేందుకు వాహనాన్ని నిలిపారు. అదే సమయంలో ఏపీ 29జడ్‌ 2157 నంబరు కలిగిన ఆర్టీసీబస్సును  మరో టూవీలర్‌ వేగంగా క్రాస్‌ చేసి వెళ్లింది. ఈ క్రమంలో బస్సు డ్రైవర్‌ సడన్‌ బ్రేక్‌ వేసి హఠాత్తుగా  సీట్లో నుంచి బస్సులో కింద పడిపోయాడు. 

దీంతో అదుపు తప్పిన బస్సు  డివైడర్‌ ఎక్కింది.  బస్సు వెళ్లాక వెళ్దామని అక్కడే ఆగి ఉన్న కోటేశ్వరరావు వాహనాన్ని బస్సు ఢీకొట్టింది.  తీవ్రంగా గాయపడిన వీరిద్దరినీ ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయారు. పోలీసులు ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ టీవీ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. సంఘటనా స్థలానికి మల్కాజ్‌గిరి ఏసీపీ గోనె సందీప్‌రావు సందర్శించారు. మృతుల బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనలో మరో ముగ్గురు కూడా గాయపడినట్లు సమాచారం. ప్రమాదానికి డ్రైవర్‌ సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ బస్సు నడపడమే కారణమని కొందరు స్థానికులు చెప్పారు. 

మరిన్ని వార్తలు