ఆదమరిచారు.. చిన్నారులు మసై‘పోయారు’

6 May, 2018 11:36 IST|Sakshi
శార్థక్‌, అక్షర (ఫైల్‌ ఫోటో)

సాక్షి, న్యూఢిల్లీ: అమ్మా, నాన్నా..! అంటూ ఆ చిన్నారులిద్దరూ ఎగిసి పడే మంటల్లో కాలిపోతూ అరిచిన అరుపులు అక్కడున్న వారందరినీ కంటతడి పెట్టించాయి. వారిని రక్షించడానికి ఇరుగుపొరుగు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఇంటి తలుపులు మూసేసి ఉండడం. అప్పటికే మంటలు అంతటా వ్యాపించడంతో పిల్లలు బయటపడే మార్గం లేకపోయింది.

శుక్రవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో నానమ్మతో కలిసి నిద్రిస్తున్న అక్షర (9), శార్థక్‌ (7) విగత జీవులవగా.. ఆ వృద్ధురాలు ప్రాణాలతో బయటపడింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వినీత్‌ గార్గ్‌, అతని భార్య శుక్రవారం సాయంత్రం అలీపూర్‌లో ఒక పెళ్లి వేడుకలో పాల్గొనేందుకు వెళ్లారు. ఇద్దరు పిల్లల్ని వాళ్ల నానమ్మ దగ్గరే విడిచి వెళ్లారు.

వాళ్లు వెళ్లిన కొద్ది సేపటికే ఆ భవనం మొదటి అంతస్థులో అగ్ని ప్రమాదం జరిగింది. ఇరుగుపొరుగు వారు మంటల్ని గమనించి భవనంలోని వారిని అప్రమత్తం చేసేసరికే మంటలు రెండో అంతస్థుకి పాకాయి. భయంతో పెద్దావిడ ఇంట్లో విద్యుత్తు సరఫరాను నిలిపేసిందని, దీంతో ఇద్దరు పిల్లలు చీకట్లో తలో దిక్కుకు వెళ్లారని చెప్పారు.

కొందరి సాయంతో ప్రాణాలతో బయటపడిన ఆమె షాక్‌కు నుంచి తేరుకుని పిల్లలు లోపలే ఉన్నారని భోరున విలపించిందని స్థానికులు పేర్కొన్నారు. కానీ, అప్పటికే సమయం మించిపోయిందనీ.. బయటపడే మార్గం లేక ఆ చిన్నారులిద్దరూ మంటలకు ఆహుతయ్యారని పోలీసులు వెల్లడించారు. ప్రమాద విషయం తెలుసుకున్న ఆ చిన్నారుల తల్లిదండ్రులు ఘటనా స్థలానికి చేరుకునే అంతా బూడిదైపోయింది.

మరిన్ని వార్తలు