దంపతులు ఇద్దరూ ఒకే రీతిలో..

28 Aug, 2019 08:40 IST|Sakshi

సాక్షి, నాగర్‌కర్నూల్‌ : రాత్రి భోజనం చేసి నిద్రించిన భార్యభర్తలు అకస్మాత్తుగా ఒకరి వెంట మరొకరు అనారోగ్యానికి గురి కావడం..ఆ తర్వాత ఇరువురు మృతి చెందడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సంఘటన మండలంలోని మంతటిలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాలిలా.. మంతటికి చెందిన సూగూరు నారాయణ (65) సూగూరు ఈశ్వరమ్మ (50) భార్యభర్తలు. ఇరువురు సోమవారం రాత్రి ఇంట్లోనే భోజనం చేసి నిద్రించగా.. అకస్మాత్తుగా ఈశ్వరమ్మ వాంతులు, విరేచనాలతో  అనారోగ్యానికి గురికాగా, గమనించిన భర్త నారాయణ తన తమ్ముడు, అన్న కొడుకు, అల్లుడికి  సమాచారం అందించాడు. వారు వెంటనే అక్కడికి చేరుకుని ఈశ్వరమ్మను చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి ఆటోలో తరలిస్తుండగా మార్గమద్యలోనే మృతిచెందింది.

ఆటోలో నాగర్‌కర్నూల్‌ చేరుకున్న తర్వాత అకస్మాత్తుగా నారాయణ సైతం వాంతులు చేసుకుని అనారోగ్యానికి గురయ్యాడు. వెంటనే అతన్ని జిల్లా ఆసుపత్రిలో చికిత్స చేయించారు. అతని పరిస్థితి విషమంగా ఉండటంలో వైద్యులు మహబూబ్‌నగర్‌ జిల్లా ఆసుపత్రికి రెఫర్‌ చేయడంతో అక్కడికి తీసుకువెళ్లారు. అక్కడి వైద్యులు హైద్రాబాద్‌కు రెఫర్‌ చేయడంతో అంబులెన్స్‌లో చికిత్స కోసం తరలిస్తుండగా షాద్‌నగర్‌ చేరుకోగానే మృతిచెందాడు. ఇరువురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న సిఐ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్‌ఐ భగవంత్‌రెడ్డి  జిల్లా ఆసుపత్రికి చేరుకుని మృతదేహాలను పరిశీలించి అక్కడి నుంచి మంతటిలోని మృతుల ఇంటిని పరిశీలించి రాత్రి మిగిలిన ఆహార పదార్దాలన ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపడం జరిగింది. 

దంపతుల మృతిపై భిన్నాభిప్రాయాలు 
నారాయణ, ఈశ్వరమ్మ మృతిపట్ల కుటుంబసభ్యుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మృతిపట్ల కుమారుడు సూగురు మహేష్‌ తన తల్లిదండ్రులు ఫుడ్‌ పాయిజన్‌ వల్ల చనిపోయి ఉండవచ్చని ఫిర్యాదు చేశారు. కానీ మృతుల కుమార్తె మాత్రం తన తల్లిదండ్రులకు కోడలికి చాలా రోజుల నుంచి తగదాలు వున్నాయని, విషప్రయోగం జరిగి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేసింది. సంఘటనకు సంబంధించి ఎస్‌ఐ భగవంత్‌రెడ్డిని వివరణ కోరగా అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతదేహాలకు పోస్టుమార్టం చేసిన అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. 

మరిన్ని వార్తలు