సినీ ఫక్కీలో చైన్‌ స్నాచింగ్‌లు

9 Oct, 2018 10:46 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న ఇన్‌చార్జి డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్‌ నిందితులు

ఇద్దరి అరెస్ట్‌ 9.9 తులాల బంగారం, ఆటో, బైక్‌ స్వాధీనం

నాగోలు: సినీ ఫక్కీలో బైక్‌పై తిరుగుతూ చైన్‌ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ఓ వ్యక్తితో పాటు మరో మహిళను ఎల్‌బీనగర్‌ సీసీఎస్, యాచారం పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం ఎల్‌బీనగర్‌ డీసీపీ కార్యాలయంలో ఇన్‌చార్జి డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్‌ వివరాలు వెల్లడించారు. సూర్యపేటకు చెందిన నందిపాటి వినోద్‌ వృత్తిరీత్యా ఆటో డ్రైవర్‌. నగరానికి వలస వచ్చిన ఇతను సరూర్‌నగర్‌లోని జనప్రియ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నాడు. 2015లో పెళ్లి చేసుకున్న అనంతరం సంతోష్‌ శివశక్తి గ్యాస్‌ ఏజెన్సీ గోదాములో ఇన్‌చార్జిగా చేరాడు. విధినిర్వహణలో అక్రమాలకు పాల్పడటంతో నిర్వాహకులు అతడిని ఉద్యోగం నుంచి తొలగించారు. అనంతరం కర్మన్‌ఘాట్‌లోని ఐశ్వర్య గ్యాస్‌ ఏజెన్సీలో డెలివరీ బాయ్‌గా చేరి గోదాము ఇన్‌చార్జిగా పదోన్నతి పొందాడు.

సరూర్‌నగర్‌ తపోవన్‌కాలనీకి చెందిన గోవూరి కీర్తితో అతడికి పరిచయం ఏర్పడింది. సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశ్యంతో చైన్‌ స్నాచింగ్‌లకు పథకం పన్నారు. ఒక చాకు, కారం పొడి తీసుకుని బైక్‌పై తిరుగుతూ ఒంటరిగా వెళుతున్న మహిళల కళ్లల్లో కారంకొట్టి చోరీలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో యాచారం పోలీసు స్టేషన్‌ పరిధిలో ఓ మహిళ నుంచి 4.5 తులాల బంగారు గొలుసు, రూ.1000 నగదు లాక్కెళ్లారు. మంచాల పోలీసు స్టేషన్‌ పరిధిలో 4.5 తులాల బంగారు ఆభరణాలు, సరూర్‌నగర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో 3 తులాల బంగారం చోరీ చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఎల్‌బీనగర్‌ సీసీఎస్, యాచారం పోలీసులు నిందితులను అరెస్టు చేసి వారి  నుంచి బంగారం, వాహనాలు, నగదు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. సమావేశంలో క్రైమ్‌ అడిషనల్‌ డీసీపీ శ్రీనివాస్, ఇబ్రాహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డి, సీఐ శివశంకర్, ప్రవీణ్‌బాబు తదితరులు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు