మహిళల అక్రమ రవాణా.. దంపతులపై పీడీ యాక్ట్‌

12 Sep, 2018 07:47 IST|Sakshi

నాగోలు: మహిళలను అక్రమ రవాణా చేస్తూ వ్యభిచార గృహాలకు తరలిస్తున్న ఇద్దరి నిందితులపై రాచకొండ పోలీస్‌ కమీషనర్‌ ఆదేశాల మేరకు వారిపై పీడీ యాక్ట్‌ నమోదు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వెస్ట్‌ బెంగాల్, కోల్‌కతా ప్రాంతానికి చెందిన బెనిడ్‌ వర్మా ఆలియాస్‌ షేక్‌ మిజాన్‌ (35) ఇతడి భార్య షేక్‌ నియాల్ఫా అలియాస్‌ లీలా(35) ఇద్దరు కలిసి నగరానికి వచ్చి నేరెడ్‌మెట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చంద్రగిరి కాలనీలో ఇంటిని అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నారు. కొంత కాలం వివిధ కంపెనీల్లో పనిచేసినా సరిపడా డబ్బులు రాచపోవడంతో వ్యభిచార దందాను నిర్వహించాలనుకున్నారు. ఈ క్రమంలో బంగ్లాదేశ్‌ నుంచి బాలికలను, మహిళలను నెల జీతం లెక్కన తీసుకువచ్చి నగరంలో వ్యభిచార దందాను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో వర్మను 2014లో పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌ తరలించారు.

గత నెల 17న నేరెడ్‌మెట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో వ్యభిచారం జరుగుతోందని సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేయగా ఇద్దరు బంగ్లాదేశ్‌ మహిళలు పట్టుబడ్డారు. దీంతో వీరిని నేరెడ్‌మెట్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. జైలులో ఉన్న వీరిపై కమిషనర్‌ పీడీయాక్ట్‌ నమోదు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 

మరిన్ని వార్తలు