రైలులో కీకీ అన్నారు.. ఇప్పుడు అనుభవిస్తున్నారు

9 Aug, 2018 19:30 IST|Sakshi
పోలీసుల అదుపులో రైల్వే స్టేషన్‌లో కీకీ చాలెంజ్‌ డ్యాన్స్‌ చేసిన యువకులు

ముంబై : కీకీ చాలెంజ్‌ చాలా ప్రమాదకరం.. కీకీ అంటూ విన్యాసాలు చేస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా జనాలు మాత్రం వాటిని బుర్రకెక్కించుకోవడం లేదు. దాంతో ఇన్ని రోజులు మందలించి వదిలేసిన పోలీసులు ఇప్పుడు మాత్రం కాస్తా కఠినంగానే వ్యవహరిస్తున్నారు. కీకీ చాలెంజ్‌ అంటూ కదులుతున్న రైలుతో పాటు విన్యాసాలు చేసిన ఒక యువకుడికి, ఈ తతంగాన్నంతా వీడియో తీసిన అతని స్నేహితులకు కూడా పనిష్మెంట్‌ ఇచ్చారు. కాకాపోతే అది కాస్తా వెరైటీ పనిష్మెంట్‌. రైల్వే ప్లాట్‌ఫాంపై  డ్యాన్స్‌ చేశారు కాబట్టి వరుసగా మూడు రోజుల పాటు రైల్వే స్టేషన్‌ను శుభ్రపర్చాలంటూ కోర్టు ఆ యువకులను ఆదేశించింది.

వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని విరార్‌ ప్రాంతానికి చెందిన నిషాంత్‌ షా(20), ధ్రువ్‌ షా(23), శ్యాం శర్మ(24) అనే ముగ్గురు యువకులు కీకీ ఛాలెంజ్‌ పేరిట కదులుతున్న రైల్లో నుంచి కిందకి దిగి డ్యాన్స్‌ చేశారు. అంతటితో ఆగకుండా ఫ్లాట్‌ఫాంపై రకరకాల విన్యాసాలు చేశారు. దీన్నంతా వీడియో తీసి ఇంటర్నెట్‌లో పోస్టు చేశారు. దాంతో అది కాస్తా పోలీసుల కంట పడింది. రంగంలోకి దిగిన రైల్వే పోలీసులు, సీసీ టీవీ, సదరు కీకీ వీడియోలోని దృశ్యాల ఆధారంగా ఆ ముగ్గురుని అరెస్టు చేశారు. అయితే ఈ యువకులు కీకీ పేరుతో ఇలా విన్యాసాలు చేయడం ఇదే ప్రథమం కాదని తెలిసిందే. గతంలో వీళ్లు ఏకంగా అంబులెన్స్‌ దగ్గర కూడా కీకీ ఛాలెంజ్‌ డ్యాన్స్‌ చేశారట. ఆ వీడియోను కూడా రైల్వే పోలీసులు గుర్తించారు. అనంతరం వాళ్లను అరెస్టు చేసి వసాయ్‌ ప్రాంతంలోని రైల్వే కోర్టులో హాజరుపరిచారు.

యువకులను విచారించిన రైల్వే కోర్టు వారికి శిక్ష విధించింది. ఈ వారంలో మూడు రోజుల పాటు వసాయ్‌ రైల్వే స్టేషన్‌ను శుభ్రం చేయాల్సిందిగా ఆదేశించింది. అంతేకాక ముగ్గురు యువకులు రైల్వే స్టేషన్‌ను శుభ్రపరుస్తుండగా వీడియో తీసి దాన్ని కోర్టుకు అందజేయాల్సిందిగా పోలీసులను ఆదేశించింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటలు, అనంతరం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకూ రైల్వే స్టేషన్‌ను శుభ్రం చెయ్యాలని కోర్టు ఆదేశించింది.

మరిన్ని వార్తలు