ఔష‘ధరలో’ మాయాజాలం

15 Jul, 2020 06:32 IST|Sakshi
స్వాధీనం చేసుకున్న మెడిసిన్‌ చూపిస్తున్న కొత్వాల్‌

అధిక ధరలకు మందుల విక్రయం

8 మంది ముఠా సభ్యుల అరెస్ట్‌

రూ.35.5 లక్షల విలువైన మెడిసిన్‌ స్వాధీనం

సాక్షి, సిటీబ్యూరో: కోవిడ్‌ రోగుల చికిత్సకు ఉపకరించే యాంటీ వైరల్‌ ఔషధాలను బ్లాక్‌ మార్కెట్‌ చేసి, అధిక ధరలకు విక్రయిస్తున్న ముఠా గుట్టును దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు రట్టు చేశారు. మొత్తం ఎనిమిది మంది సభ్యులతో కూడిన అంతర్రాష్ట్ర ముఠాను అరెస్టు చేసిన అధికారులు రూ.35.5 లక్షల విలువైన ఔషధాలను స్వాధీనం చేసుకున్నారు. అదనపు డీసీపీ చక్రవర్తి గుమ్మితో కలిసి మంగళవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొత్వాల్‌ అంజనీకుమార్‌ వివరాలు వెల్లడించారు. కరోనా వైరస్‌ విజృంభణ ప్రారంభమైన నాటి నుంచి రెమిడెసివీర్, ఆక్టెమ్రా, ఫాబి ఫ్లూ వంటి యాంటీ వైరల్‌ ఔషధాలకు భారీగా డిమాండ్‌ వచ్చింది. కొవిడ్‌ రోగుల చికిత్సలో వీటిని వినియోగిస్తుండటంతో గతంలో ఎన్నడూలేని విధంగా వీటి ప్రాధాన్యం పెరిగింది. రెమిడెసివీర్‌ డ్రగ్‌ సంగారెడ్డిలో ఉన్న హెటిరో సంస్థలో తయారవుతోంది. అత్యవసర యాంటీ వైరల్‌ మందుల్ని బ్లాక్‌ మార్కెట్‌కు తరలించి, ఈ విపత్కర పరిస్థితుల్ని క్యాష్‌ చేసుకోవడానికి ఓ ముఠా రంగంలోకి దిగింది. సికింద్రాబాద్‌ ప్రాంతానికి చెందిన కె.వెంకట సుబ్రహ్మణ్యం అలియాస్‌ ఫణి ఈ ముఠాకు సూత్రధారిగా ఉన్నాడు.

ఇతగాడు శ్రీ మెడిక్యూర్‌ ప్రొడక్టŠస్‌ (ఓపీసీ) ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థను నిర్వహిస్తున్నాడు. ఇతడు తన సంస్థ పేరుతో హెటిరో సంస్థ నుంచి రెమిడెసివీర్‌ ఇంజెక్షన్లు ఖరీదు చేస్తున్నాడు. తన వద్ద వీటిని దాచి పెట్టి తన అనుచరుడైన సంతోష్‌ కుమార్‌కు రూ.3500 లాభంతో విక్రయిస్తున్నాడు. శంకర్‌ ఈ ఔషధాన్ని కె.కిషోర్, మహ్మద్‌ షాకీర్‌లకు రూ.6 వేల లాభానికి అమ్ముతున్నాడు. వీరిద్దరూ రాహుల్‌ అనే వ్యక్తికి రూ.8 వేల లాభానికి విక్రయిస్తుండగా.. ఇతగాడు సైఫ్, ఫిర్దోష్‌ల ద్వారా వినియోగదారులకు రూ.15 వేల నుంచి రూ.18 వేల లాభానికి అమ్ముతున్నారు. మొత్తమ్మీద ఈ ఔషధం రోగి వద్దకు చేరేసరికి రూ.30 వేల నుంచి రూ.40 వేలు అధిక ధరకు అమ్ముడవుతోంది. రాహుల్‌ ఇతర యాంటీ వైరల్‌ ఔషధాలను ఢిల్లీ నుంచి ఖరీదు చేస్తున్నాడు.

దీన్ని గగన్‌ కౌరానా అనే మధ్యవర్తి ద్వారా అధిక ధరలకు విక్రయిస్తున్నాడు. రూ.5,400 ఖరీదు చేసే రెమిడెసివీర్‌ గరిష్టంగా రూ.40 వేలకు, రూ.40 వేలు ఖరీదు చేసే ఆక్టెమ్రా రూ.లక్షకు, రూ.3500 ఖరీదు చేసే ఫాబిఫ్లూ రూ.5 వేలకు రూ.1200 ఖరీదు చేసే ర్యాపిడ్‌ టెస్టింగ్‌ కిట్‌ రూ.1800 విక్రయిస్తున్నారు. నిబంధనల ప్రకారం ఈ ఔషధాలను నేరుగా ఆస్పత్రులకే విక్రయించాల్సి ఉన్నా.. అడ్డదారిలో బ్లాక్‌ మార్కెట్‌ చేస్తూ ఈ గ్యాంగ్‌ రోగుల్ని ముంచుతోంది. కొన్ని రోజులుగా గుట్టుగా సాగుతున్న ఈ వ్యవహారంపై దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌.రాఘవేంద్ర నేతృత్వంలో ఎస్సైలు వి.నరేందర్, ఎన్‌.శ్రీశైలం, మహ్మద్‌ థక్కుద్దీన్‌ తమ బృందాలతో దాడి చేశారు. ఎనిమిది మందినీ పట్టుకుని వీరి నుంచి రూ.35.5 లక్షల విలువైన ఔషధాలు, నగదు తదితరాలు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం కేసును చాదర్‌ఘాట్‌ పోలీసులకు అప్పగించారు.

మరిన్ని వార్తలు