కరోనాపై ఇన్ఫోసిస్ ఉద్యోగి పైత్యం...అరెస్టు

28 Mar, 2020 08:41 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

కరోనాపై ఇన్ఫోసిస్ ఉద్యోగి వివాదాస్పద పోస్ట్

అరెస్టు,  కేసు నమోదు

ఉద్యోగంనుంచి తొలగించిన ఇన్ఫోసిస్

సాక్షి, బెంగళూరు : ఒకవైపు  ప్రపంచమంతా కరోనా కల్లోలంతో భయకంపితులవుతోంది. మరీ ముఖ్యంగా శరవేగంగా పెరుగుతున్నకరోనా( కోవిడ్ -19) పాజిటివ్ కేసులతో కర్ణాటక రాష్ట్రం అల్లకల్లోలమవుతోంది. మరోవైపు బెంగళూరులోని ఒక ఇన్ఫోసిస్ ఉద్యోగి  (25) పెట్టిన సోషల్ మీడియా పోస్టు ప్రకంపనలు రేపింది. "అందరూ బయటకు వెళ్లండి..తుమ్మండి...కరోనా వైరస్‌ని వ్యాపింపజెయ్యండి' అంటూ  అభ్యంతరకర పోస్టు పెట్టాడు. ఇది క్షణాల్లో వైరల్  కావడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. దీంతో రంగంలోకి దిగిన  సిటీ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) అతగాడిని అరెస్టు చేసింది. బెంగళూరులోని ఇన్ఫోసిస్  కంపెనీలో పనిచేస్తున్న అతనిపై కేసు నమోదైందని జాయింట్ కమిషనర్ సందీప్ పాటిల్ ప్రకటించారు

ఈ వ్యవహారంపై ఇన్ఫోసిస్ లిమిటెడ్ కూడా  స్పందించింది. అతని అనుచితమైన  పోస్ట్ పై దిగ్బ్రాంతిని వ్యక్తం చేసింది. దర్యాప్తునకు ఆదేశించింది. ఇది తమ కంపెనీ ప్రవర్తనా నియమావళికి , బాధ్యతాయుతమైన సామాజిక భాగస్వామ్యానికి వ్యతిరేకమని స్పష్టం చేసింది. అంతర్గత దర్యాప్తు అనంతరం అతణ్ని ఉద్యోగం నుంచీ తొలగిస్తున్నామని ట్విటర్ ద్వారా ప్రకటించింది. అంతేకాదు ఇలాంటి చర్యల్ని ఎంతమాత్రం సహించే ప్రసక్తే లేదన్న ఇన్ఫోసిస్ యాజమాన్యం...ఇది అతను అనుకోకుండా చేసిన పొరపాటు కాదని, ఉద్దేశపూర్వంగానే ఇలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడని వివరించింది.  

కాగా కరోనాను విస్తరణను అడ్డుకునే క్రమంలో ఇన్ఫోసిస్ బీపీఎం, నాస్కామ్ సహకారంతో కర్ణాటక ప్రభుత్వంతో కలిసి పనిచేస్తోంది. ముఖ్యంగా విదేశాలనుంచి  తిరిగి వచ్చిన  ప్రజలు పాటించాల్సిన స్వీయ-నిర్బంధ పద్ధతులు, పరీక్షా సౌకర్యాల గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. అలాగే ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కరోనావైరస్ బారిన పడిన పౌరుల ఆరోగ్య అవసరాలను తీర్చడానికి, వైద్య సదుపాయాల విషయంలో అక్కడి  ప్రభుత్వానికి మద్దతు నందిస్తోంది.

మరిన్ని వార్తలు