ఆవు పేడ చోరీ.. జైలు పాలైన ప్రభుత్వ ఉద్యోగి

7 Feb, 2019 10:25 IST|Sakshi

సాక్షి, బెంగళూరు:  డబ్బు, బంగారం, విలువైన వస్తువులే కాదు.. ఆవు పేడను కూడా చోరీ చేస్తున్నారు. ఆవు పేడ చోరీ చేసిన కేసులో ప్రభుత్వ ఉద్యోగి జైలు పాలయ్యాడు.  లక్షల్లో జీతం వస్తున్నా.. పేడ కోసం కక్కుర్తిపడి ఇలా కటకటాలపాలవడం అందినీ ఆశ్చర్యపరుస్తోంది. కర్ణాటకలోని చిక్కమాళలూరు జిల్లా బీరూర్ పట్టణంలో ఈ ఘటన జరిగింది. బీరూర్‌  పశుసంవర్ధక శాఖ సుమారు 30-40 ట్రక్కుల పేడను సేకరించింది. దాని విలువ రూ. 1.25 లక్షలు. అయితే అక్కడ నిల్వ ఉంచిన పేడ రాత్రికిరాత్రే మాయమైంది. ఈ చోరీ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న పశుసంవర్దక శాఖ డైరెక్టర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ శాఖలోనే సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న ఉద్యోగే ఈ చోరీకి పాల్పడ్డాడని పోలీసుల విచారణలో తేలింది. 

దీంతో అతడిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారించగా.. దొంగలించిన పేడను ఓ ప్రైవేట్‌ స్థలంలో దాచినట్టు.. పేడను కాజేసీ రైతులకు అమ్మాలని భావించానని ఒప్పుకున్నాడు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట్లో తెగ వైరల్‌ అవుతోంది. ఇకపై గోవులతో పాటు వాటి పేడపైనా దృష్టిపెట్టాల్సిన అవసరం వస్తుందేమోనని నెటిజన్లు జోకులు పేల్చుతున్నారు. కాగా, భారతీయ వ్యవసాయ విధానంలో ఆవు మూత్రం, పేడకు ప్రత్యేక స్థానముంది. పశువుల పెంటను పంటపొలాలకు ఎరువుగా చల్లుతారు . దీంతో ఆవు పేడకు దేశవ్యాప్తంగా డిమాండ్ పెరిగింది.

మరిన్ని వార్తలు