ఆవులను పట్టుకున్న పోలీసులు

7 Aug, 2018 09:21 IST|Sakshi
కరన్‌కోట్‌ పోలీస్‌స్టేషన్‌ వద్ద ఆవులు 

తాండూరు రూరల్‌ వికారాబాద్‌ : ఎలాంటి పత్రాలు లేకుండా తరలిస్తున్న ఆవులను కరన్‌కోట్‌ పోలీసులు సోమవారం పట్టుకున్నారు. పోలీస్‌స్టేషన్‌ ఎదుట నుంచి వెళ్తున్న ఆవులను తోలుకెళ్తున్న వ్యక్తులను ఆపి వివరాలు అడిగారు. ఆవుల క్రయవిక్రయాలకు సంబంధించిన పత్రాలు చూపించాలని కోరారు. వారి నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో కరన్‌కోట్‌ పోలీస్‌స్టేషన్‌కు ఆవులను తరలించారు.

ఈ విషయం తెలుసుకున్న వీహెచ్‌పీ, బజరంగ్‌దళ్, బీజేపీ, ఏబీవీపీ నాయకులు కరన్‌కోట్‌ పోలీస్‌స్టేషన్‌కు పెద్దఎత్తున తరలివచ్చారు. ఆవులను ఎక్కడికి తరలిస్తున్నారని వ్యక్తులను ప్రశ్నించారు. యాలాల మండలం జుంటుపల్లి అనుబంధ గ్రామం రేళ్లగడ్డతండా నుంచి 33 ఆవులను తాండూరు మండలం రాంపూర్‌తండాకు తీసుకెళ్తున్నమని వారు చెప్పారు. సరైన సమాధానం చెప్పాలని కోరగా తాండూరుకు చెందిన సాధిక్‌ ఈ ఆవులను రూ.1.60 లక్షలకు కొనుగోలు చేసినట్లు తెలిపారు.

అనంతరం ఎస్‌ఐ రేణుకారెడ్డితో నాయకులు భేటీ అయ్యారు. బక్రీద్‌ సందర్భంగా ఆవులను విక్రయించడానికి తీసుకెళ్తున్నారని వారు ఆరోపించారు. తాండూరు చుట్టూ చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలని కోరారు. ఇందుకు ఎస్‌ఐ స్పందిస్తూ ఆవులకు సంబంధించిన పూర్తి విచారణ చేపడతామన్నారు.

అప్పటి వరకు ఆవులను పట్టణంలోని గోశాలకు తరలిస్తామని చెప్పారు. ఆవులను తీసుకెళ్తున్న వ్యక్తుల నుంచి వివరాలు తెలుసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో రమ్యానాయక్, బొప్పి సురేష్, టైలర్‌ రమేష్, రజనీ, అశోక్, నాగేష్, దాస్, మహేష్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు