నగరంలో నగదు వేట

6 Apr, 2019 07:29 IST|Sakshi
స్వాధీనం చేసుకున్న నగదును చూపుతున్న సీపీ అంజనీకుమార్‌

ఎన్నికల నిబంధనలు పక్కాగా అమలు చేస్తున్నాం

ఈసీ నిర్దేశించిన ప్రకారం ఫిర్యాదులపై స్పందన

నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ వెల్లడి

సాక్షి, సిటీబ్యూరో: లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నగర పోలీసు విభాగం అప్రమత్తమైంది. గడిచిన కొన్ని రోజులుగా పలు ప్రాంతాల్లో చేపట్టిన ముమ్మర తనిఖీలు, సోదాల్లో మొత్తం రూ.9.45 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని బషీర్‌బాగ్‌లోని పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొత్వాల్‌ అంజనీకుమార్‌ వెల్లడించారు. నగర పోలీస్‌ విభాగం.. రిటర్నింగ్‌ అధికారులు, సహాయ రిటర్నింగ్‌ అధికారులతో పాటు ప్రత్యేక స్క్వాడ్స్‌తో సమన్వయం ఏర్పాటు చేసుకుని పనిచేస్తోంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోనూ మూడు స్టాటిక్‌ సర్వైలెన్స్‌ టీమ్స్‌ (ఎస్‌ఎస్‌టీ), మరో మూడు ఫ్లయింగ్‌ స్క్వాడ్స్‌ అనునిత్యం విధుల్లో ఉంటున్నాయి. ఇలా ఏర్పడిన మొత్తం 45 టీమ్స్‌ మార్చి 18 నుంచే విధుల్లోకి దిగాయి. నగర, కమిషనరేట్‌ సరిహద్దుల్లో అవసరమైన మేర చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు.

ఇప్పటి దాకా ప్రవర్తన నియమావళి ఉల్లంఘనపై 43 కేసులు నమోదు చేశారు. నగర వ్యాప్తంగా ఇప్పటి వరకు చేపట్టిన తనిఖీల్లో రూ.9.45 కోట్ల నగదు, రూ.3.73 లక్షల విలువైన ఇతర వస్తువులు, రూ.9 లక్షల విలువైన 135 లీటర్ల మద్యం, రూ.9.15 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, 40 కేజీల గంజాయి, భారీగా గుట్కా స్వాధీనం చేసుకున్నారు. గడిచిన కొన్ని రోజులుగా పెట్టీ కేసుల నమోదుపై నగరంలో ప్రత్యేక డ్రైవ్‌ జరుగుతోంది. ఇందులో భాగంగా క్షేత్రస్థాయి అధికారులు తమ చేతుల్లో ఉండే ట్యాబ్స్‌ సహాయంతో వివిధ రకాలైన ఉల్లంఘనలపై చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు నగర వ్యాప్తంగా 9243 ఈ–పెట్టీ కేసులు నమోదు చేశారు. ఎన్నికల నేపథ్యంలో నగరంలో నివసించే వారు తమ లైసెన్స్డ్‌ ఆయుధాలు డిపాజిట్‌ చేయాల్సిందిగా కొత్వాల్‌ అంజనీకుమార్‌ గతంలో నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం వరకు మొత్తం 4,614 ఆయుధాలు డిపాజిట్‌ అయ్యాయి.

రక్షణ బలగాలు, బ్యాంకు విధులు, క్రీడాకారులతో పాటు కొన్ని కేటగిరీలకు చెందిన వారికి ఈ లైసెన్స్డ్‌ ఆయుధాల డిపాజిట్‌ నుంచి మినహాయింపు ఇచ్చారు. ఎన్నికల సీజన్‌ ప్రారంభమయ్యే నాటికి 2,429 నాన్‌ బెయిలబుల్‌ వారెంట్లు (ఎన్‌బీడబ్ల్యూ) పెండింగ్‌లో ఉండగా.. వీటికి అదనంగా మరో 206 వచ్చి చేరాయి. వీటిలో ఇప్పటి వరకు 881 ఎన్‌బీడబ్ల్యూలు ఎగ్జిక్యూట్‌ చేశారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మొత్తం 194 ఎన్నికల నేరాలకు సంబంధించిన కేసులు నమోదు చేశారు. వీటిలో 154 కేసుల దర్యాప్తు పూర్తి చేసి అభియోగపత్రాలు దాఖలు చేయగా, 19 కేసుల విచారణ పూర్తి కావడంతో పాటు నిందితులు దోషులుగానూ తేలారు. ఎస్సార్‌నగర్‌ పరిధిలో నమోదైన ఓ కేసులో న్యాయస్థానం దోషులకు రెండు రోజుల జైలు శిక్ష కూడా విధించింది. ఎన్నికల క్రతువు ప్రశాంతంగా పూర్తి కావడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్న, జాగ్రత్తలు తీసుకుంటున్న నగర పోలీసులు అసాంఘికశక్తుల్ని బైండోవర్‌ చేస్తున్నారు. గత ఎన్నికల సందర్భంలో 1,406 కేసుల్లో 4,309 మందిని బైండోవర్‌ చేశారు. దీనికి కొనసాగింపుగా మొత్తం ఇప్పటి వరకు 1,869 కేసుల్లో 5,490 మందిని బైండోవర్‌ చేశారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు నగరంలోని పరిస్థితులను అనునిత్యం సమీక్షిస్తున్న ఉన్నతాధికారులు.. అవసరాలకు తగ్గట్టు ఏర్పాట్లు చేస్తున్నారు.

ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు
సిటీలో అక్రమంగా భారీస్థాయిలో తరలిస్తున్న నగదును నగర పోలీస్‌ విభాగం స్వాధీనం చేసుకుంటోంది. ఇందులో అత్యధికంగా దాదాపు 70 శాతం వరకు ప్రజల నుంచి వచ్చిన సమాచారంతోనే సాధ్యమైంది. ఎన్నికల్లో నల్లధన ప్రవాహాన్ని అడ్డుకోవడం, హవాలా వ్యాపారాన్ని కట్టడిచేయడంలో నగర ప్రజలు పోషిస్తున్న పాత్ర అభినందనీయం. ఇలా ఎప్పటికప్పుడు పోలీసులకు సమాచారం ఇస్తున్న వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఏదైనా ఓ ఉదంతంపై ఫిర్యాదు వస్తే గరిష్టంగా 100 నిమిషాల్లో ఆ ప్రాంతానికి చేరుకోవడమే కాదు సమస్యను పరిష్కరించాల్సి ఉంటుంది. అందుకు తగ్గట్టు నగర పోలీసు విభాగం ఏర్పాట్లు చేస్తోంది.– అంజనీకుమార్, నగర పోలీస్‌ కమిషనర్‌ 

మరిన్ని వార్తలు