ఇరానీ గ్యాంగ్‌ ఆటకట్టించిన స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌

21 Jan, 2019 16:30 IST|Sakshi

సాక్షి, సైబరాబాద్‌ : గత అక్టోబర్‌లో సంచలనం సృష్టించిన ఇరానీ గ్యాంగ్‌ (డైవర్టింగ్‌ గ్యాంగ్‌) కేసును తమ స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీమ్‌ ఛేదించినట్లు సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ తెలిపారు. సోమవారం ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో మాట్లాడుతూ.. ఇరానీ గ్యాంగ్‌ లీడర్ వసీం అబ్బాస్ సిరాజ్, జై కుమార్ రాజక్, నియాజ్ మొహమ్మద్ ఖాన్, జావీద్ బాలీలను అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. ముంబై, వారణాసి, అలహాబాద్, పట్నాలలో ఈ గ్యాంగ్ నేరాలకు పాల్పడినట్లు గుర్తించామన్నారు. మొత్తం 11 లక్షల విలువ చేసే 32 తులాల మంగళ సూత్రాలను ఇరానీ ముఠా దోచుకెళ్లిందని.. వారి వద్ద నుంచి 100 శాతం ప్రాపర్టీని రికవరీ చేశామని పేర్కొన్నారు. ఇక ఇరానీ గ్యాంగ్‌ లీడర్‌ వసీం మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అని, అతడిపై 58 దొంగతనం కేసులు ఉన్నాయని తెలిపారు.

మంగళ సూత్రాలు దోచేస్తారు ఇలా..
దేవాలయాలకు దగ్గరలో ఉన్న ఒంటరి మహిళలను గ్యాంగ్ టార్గెట్ చేసి ఇరానీ గ్యాంగ్‌ కొత్త తరహా మెసానికి పాల్పడిందని సీపీ సజ్జనార్‌ పేర్కొన్నారు. ‘ మొదట పూజా సామగ్రిని దేవాలయంలో ఇవ్వాలని మహిళలను ట్రాప్ చేస్తారు. ఆ తర్వాత మంగళసూత్రం పూజా సామాగ్రి పైన పెడితే మంచి జరుగుతుందని నమ్మిస్తారు. ఈ క్రమంలో మహిళలు మెడలో నుంచి మంగళసూత్రం తీసిన వెంటనే వెయ్యి రూపాయల నోటులో మడత పెట్టి పూజా బ్యాగులో పెడతారు. ఆ తర్వాత మహిళలను మాటల్లో పెట్టి వాటిని దోచుకెళ్తారు’ అని సీపీ వెల్లడించారు.

మరిన్ని వార్తలు