చెత్త ఎత్తేస్తారు..ఇళ్లు దోచేస్తారు..

26 Nov, 2017 12:43 IST|Sakshi

పగలు రెక్కీ ... రాత్రి  చోరీ

పెందుర్తిలో ముగ్గురు దొంగల అరెస్టు

సొత్తును కొనుగోలు చేసిన ముగ్గురు కటకటాల పాలు

పెందుర్తి: పగటిపూట చెత్త ఏరుకుంటూ మనుషులు లేని ఇళ్లను కనిపెడతారు. రాత్రయ్యే సరికి ఆ ఇళ్లను గుళ్ల చేస్తారు. ఇలా  దొంగతనా లకు పాల్పడుతున్న నేరస్తుల ఆటను పెందుర్తి పోలీసులు కట్టించారు. పలు ఇళ్లల్లో చోరీలకు పాల్పడిన ముగ్గుర్ని శనివారం అరెస్టు చేశారు. దొంగసొత్తును కొనుగోలు చేసిన మరో ముగ్గురు కటకటాలపాలయ్యారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో వెస్ట్‌ సబ్‌ డివిజన్‌ క్రైం బ్రాంచ్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ పి.సూర్యనారాయణ కేసు వివరాలను వెల్లడించారు.

గోపాలపట్నం ఇం దిరానగర్‌కు చెందిన చలపాక రాజేష్‌(తునీగా),గాజువాక సమతానగర్‌కు చెందిన పెర్రటి ప్రతాప్, మధురవాడ మారికవలస కాలనీకి చెందిన రంగల రంగరావు కలిసి ముఠాగా ఏర్పడ్డారు. వీరిలో చలపాక రాజేష్‌ భుజాన గోనె సంచి తగిలించుకుని జనవాసాల్లో చెత్త ఏరుకుంటున్నట్లు నటిస్తూ తాళాలు వేసి ఉన్న ఇళ్లను గుర్తిస్తాడు. అనంతరం ప్రతాప్, రంగా రావులతో కలసి ఆయా ఇళ్లతాళాలు బద్దలు కొట్టి దోచేస్తారు. పెందుర్తి, గోపాలపట్నం పోలీస్‌స్టేషన్ల పరిధిలో వీరిపై నాలుగు కేసులు నమోదయ్యాయి. ఆయా కేసుల్లో బాధితుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేసిన పోలీసులు వీరిని గోపాలపట్నం ప్రాంతంలో పట్టుకున్నారు. వీరంతా నగరంలో కూడా పలు కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నారు.

కొనుగోలు చేసిన వారూ అరెస్ట్‌
దొంగ బంగారాన్ని టౌన్‌ కొత్తరోడ్‌ ప్రాంతానికి చెందిన చెట్టి శ్రీనివాసరావు, 104 ఏరియా ప్రాంతానికి చెందిన కలిశెట్టి రాంబాబు, గోపాలపట్నం కొత్తపాలేనికి చెందిన వేగి రాం బాబులు కొనుగోలు చేశారు. వీరు గతంలో కూడా దొంగసొత్తును కొనుగోలు చేసినట్లు సీఐ వివరించారు.  ఆరుగురు నిందితుల నుం చి రూ.1,83,000 విలు వైన 61.06గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. ఇంకా 121.8 గ్రాముల బంగారంతో పాటు, 816 గ్రాముల వెండిసామగ్రి స్వాధీనం చేసుకోవాల్సి ఉందని చెప్పారు. 

మరిన్ని వార్తలు