బెట్టింగే వీరి ప్రొఫెషన్‌

14 Jan, 2019 11:07 IST|Sakshi
వివరాలను వెల్లడిస్తున్న శంషాబాద్‌ డీసీపీ ప్రకాష్‌రెడ్డి

మూడుసార్లు శిక్ష అనుభవించినా తీరు మార్చుకోని సోదరులు

క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠా రిమాండ్‌ రూ. 5 లక్షల నగదు స్వాధీనం  

శంషాబాద్‌: క్రికెట్‌ బెట్టింగ్‌ ప్రొఫెషన్‌గా మార్చుకొన్న ఇద్దరు సోదరులతో పాటు వారికి సహకరించిన ఓ ఏజెంట్, ఓ గ్యాంబ్లర్‌ను శంషాబాద్‌ ఎస్‌ఓటీ, రాజేంద్రనగర్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. శంషాబాద్‌ డీసీపీ ప్రకాష్‌రెడ్డి ఆదివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలు వెల్లడించారు. సులువుగా డబ్బులు సంపాదించాలనే లక్ష్యంతో పాతనగరంలోని ఘాన్సీబజార్‌కు చెందిన అకింత్‌ అగర్వాల్‌(28), మోహిత్‌ అగర్వాల్‌(25) క్రికెట్‌ బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారు. ఇటీవల కాలంలో నిరంతరంగా బిగ్‌బాష్‌ లీగ్‌ క్రికెట్‌ మ్యాచ్‌ల సందర్భంగా శంషాబాద్‌ ఎస్‌ఓటీ పోలీసులు బెట్టింగ్‌లపై నిఘా పెంచారు. రాజేంద్రనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఆరాంఘర్‌ చౌరస్తాలో ఉన్న ఓ హోటల్‌ ఓ గదిని అకింత్‌ అగర్వాల్, మొహిత్‌ అగర్వాల్‌తో పాటు జిడిమెట్ల ప్రాంతానికి చెందిన యాసిమిన్‌ మహేష్‌(44) కలెక్షన్‌ ఏజెంట్, బెట్టింగ్‌ సబ్‌ ఆర్గనైజర్‌గా వ్యవహరిస్తున్న చార్‌కమాన్‌ బస్తీకి చెందిన రోహిత్‌ అగర్వాల్‌ (27) అద్దెకు తీసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు శనివారం రాత్రి ఎస్‌ఓటీ పోలీసులు, రాజేంద్రనగర్‌ పోలీసులు ఈ ముఠాను పట్టుకున్నారు.

వీరి వద్ద నుంచి రూ. 5 లక్షల నగదుతో పాటు ఎనిమిది సెల్‌ఫోన్లు, ఓ క్యాలికులేటర్, స్కోరింగ్‌ పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. గతంలో కూడా అంకిత్, మొహిత్‌ అగర్వాల్‌లు 2016 క్రికెట్‌ బెట్టింగ్‌కు పాల్పడుత సుల్తాన్‌బజార్‌ పోలీసులకు చిక్కి జైలుశిక్ష సైతం అనుభవించారు. అదే తరహాలో 2018 ఐపీఎల్‌ క్రికెట్‌ సందర్భంలో రాజేంద్రనగర్, వెస్ట్‌మారేడ్‌పల్లి పోలీసులు వీరిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ఆన్‌లైన్‌ ద్వారా బెట్టింగ్‌ లావాదేవీలన్నింటినీ వీరు కొనసాగిస్తున్నారని డీసీపీ ప్రకాష్‌రెడ్డి తెలిపారు. యువత క్రికెట్‌ బెట్టింగ్‌లకు పాల్పడకూడదని డీసీపీ సూచించారు. ఇలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాల ద్వారా చాలామంది యువత భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని, బెట్టింగ్‌లపై సైబరాబాద్‌ పోలీసులు గట్టి నిఘా వేసి ఉంచారని చెప్పారు. బెట్టింగ్‌ ముఠాను అరెస్ట్‌ చేసి ఎస్‌ఓటీ, రాజేంద్రనగర్‌ పోలీసులను డీసీపీ అభినందించారు. 

>
మరిన్ని వార్తలు