క్రికెట్‌ బెట్టింగ్‌రాయుళ్ల అరెస్ట్‌

5 Jul, 2019 08:42 IST|Sakshi
అరెస్టయిన బెట్టింగ్‌ రాయుళ్లు, స్వాధీనం చేసుకున్న నగదు, సెల్‌ఫోన్లు

9 మంది అరెస్టు

5.91 లక్షల స్వాధీనం

ప్రత్యేక నిఘా పెట్టామన్న ఎస్పీ అమ్మిరెడ్డి

సాక్షి, శ్రీకాకుళం: ప్రస్తుత క్రికెట్‌ వరల్డ్‌కప్‌ నేపథ్యంలో యువత బలహీనతను సొమ్ము చేసుకుంటున్న బెట్టింగ్‌ ముఠాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఈ మేరకు నగరంలోని రెండో పట్టణ పోలీస్‌ స్టేషన్‌ పరిధి న్యూకాలనీలోని క్లాసిక్‌ మెడికల్‌ ఏజెన్సీపై నిఘా పెట్టి క్రికెట్‌ బెట్టింగ్‌కు పాల్పడుతున్నట్లు గుర్తించారు. గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు పక్కా సమాచారంతో దాడి చేశారు. మొత్తం 17 మంది నిందితుల్లో 9 మందిని అరెస్టు చేశారు.

మిగతావారు పరారయ్యారు. వీరి నుంచి రూ.5,91,360 నగదు, 9 సెల్‌ఫోన్లు, 3 ఏటీఎం కార్డులు, ఒక చెక్‌ బుక్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం నగరంలో ఎస్పీ అమ్మిరెడ్డి వివరాలు వెల్లడించారు. బెట్టింగ్‌ వ్యవహారంలో బుగత దేవీప్రసాద్, పెల్లూరి రాజేష్, పళ్లా గణేష్, మరడాన సురేష్‌కుమార్, అల్లు ఉమామహేశ్వరరావు, పెళ్లూరి విజయ, బుడ్డి గురునాథరావు, శిమ్మ భాస్కరరావు, కడిమి ఉమామహేష్, సర్వేశ్వరరావులను అరెస్టు చేసినట్లు వివరించారు.

నాగరాజు, అప్పన్న, రవిశంకర్, రాజేష్, వెంకటరమణ, రామినాయుడు, బరంపురం శ్రీను, మయూరి పరారీలో ఉన్నారని పేర్కొన్నారు. ప్రధానంగా జిల్లాలో జూదం, బెట్టింగ్, బైక్‌ రేసింగ్, గంజాయి తదితర మాదకద్రవ్యాల విక్రయం వంటి అనైతిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా శ్రీకాకుళం నగరం, రాజాం పట్టణ క్లబ్‌ల్లో జూదం ఆడుతున్నట్లు సమాచారం ఉందని, దీనిపైనా దృష్టి పెట్టామన్నారు. ఇటీవల జాతీయ రహదారిపై రాత్రిళ్లు బైక్‌ రేసింగ్‌ చేస్తున్నట్లు సమాచారం ఉందని, దీనిపైనా నిఘా పెట్టి అరెస్టు చేస్తామన్నారు.

గంజాయిపై ప్రత్యేక దృష్టి సారించడం వల్ల ఇప్పటికే పెద్ద ఎత్తున పట్టుకున్నామని, ఎవరికైనా మాదకద్రవ్యాల విషయంలో సమాచారం ఉంటే తెలియజేయాలన్నారు. బెట్టింగ్‌ వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చిన ఏఎస్‌ చక్రవర్తి, పీవీ కృష్ణవర్మ, ఎస్‌ శంకరరావు, ఎం పారినాయుడు, కే ముకుందరావు, వై ప్రసాదరావు, ఎల్‌ జగన్మోహనరావు, వీ మోహనరావు, బీ సత్యనారాయణ, ఈ రామకృష్ణ, పీ శివ, ఎస్‌ ఉషాకిరణ్‌లను అభినందించారు. ఈ సమావేశంలో ఏఎస్పీ మంగరాజు, డీఎస్పీ చక్రవర్తి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు