నలుగురు క్రికెట్‌ బుకీలు అరెస్టు

22 Oct, 2018 13:47 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న సీసీఎస్‌ డీఎస్పీ నాగేశ్వరరెడ్డి, స్వాధీనం చేసుకున్న నగదు, సెల్‌ఫోన్లు

రూ.ఎనిమిది లక్షల నగదు, రెండున్నర కిలోల గంజాయి, వాహనం, సెల్‌ఫోన్లు స్వాధీనం

సీసీఎస్‌ డీఎస్పీ వెల్లడి

కడప అర్బన్‌ : ఎక్కడ అంతర్జాతీయ, దేశీయ క్రికెట్‌ మ్యాచ్‌లు జరిగినా బెట్టింగ్‌లకు పాల్పడుతూ అమాయక ప్రజలను ఆ వ్యసనానికి బానిసలుగా మారుస్తున్న నలుగురు క్రికెట్‌ బుకీల ముఠాను సీసీఎస్‌ డీఎస్పీ నాగేశ్వర్‌రెడ్డి తమ సిబ్బందితో కలిసి అరెస్టు చేశారు. వివరాలను ఆదివారం సాయంత్రం కడప సీసీఎస్‌ పోలీసుస్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీసీఎస్‌ డీఎస్పీ వెల్లడించారు. ప్రొద్దుటూరు టౌన్‌ నడింపల్లెవీధికి చెందిన షేక్‌ ఇమ్రాన్, ఆర్ట్స్‌ కళాశాల రోడ్డులో నివసిస్తున్న కందుల కుమార్‌ అలియాస్‌ రాజేష్, ముళ్ల మైనుద్దీన్, షేక్‌ మహబూబ్‌బాషా ముఠాగా ఏర్పడి రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో తమ మకాం మారుస్తూ అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌ల సమయాల్లో బెట్టింగ్‌లకు పాల్పడుతారు.

దీంతో వారిపై పోలీసులు నిఘా ఉంచారు. ఎట్టకేలకు ఆదివారం మధ్యాహ్నం రాజంపేట మండలం మన్నూరు పోలీసుస్టేషన్‌ పరిధిలోని ఇందిరమ్మ కాలనీలో క్రికెట్‌ బెట్టింగ్, గంజాయి అమ్మకం గురించి తెలుసుకుని దాడి చేశారు.   పై నలుగురు నిందితులు టీవీలో ఇండియా–వెస్టిండీస్‌ క్రికెట్‌ జట్ల మధ్య జరుగుతున్న మొదటి వన్డే మ్యాచ్‌ చూస్తూ క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తూ గంజాయి పెట్టుకుని అమ్ముతూ ఉండగా సీసీఎస్‌ డీఎస్పీ తమ సిబ్బందితో దాడి చేశారు. ఈ దాడిలో రెండున్నర కిలోల గంజాయి, రూ. 8,00,550 నగదు, బొలెరో వాహనం, పది సెల్‌ఫోన్లు, ఒక టీవీ, ఒక ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టుకు కృషి చేసిన పెండ్లిమర్రి ఎస్‌ఐ ఎన్‌.రాజరాజేశ్వరరెడ్డి, మన్నూరు ఎస్‌ఐలను, సీసీఎస్‌ సిబ్బంది, హెడ్‌ కానిస్టేబుళ్లు భూపాల్‌రెడ్డి, విశ్వనాథరెడ్డి, జగన్నాథరెడ్డి, కానిస్టేబుళ్లు పరమేష్, ప్రసాద్, బాలరాజు, హోంగార్డు సుబ్బరాయుడులను డీఎస్పీ అభినందించారు.

మరిన్ని వార్తలు