క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠా అరెస్ట్‌

4 May, 2019 11:08 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి

మహబూబాబాద్‌ రూరల్‌: బెట్టింగ్‌లతో జీవితాలు ఆగమాగమవుతాయని, యువకులు బెట్టింగ్‌ల బారిన పడి బలికావద్దని మహబూబాబాద్‌ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి అన్నారు. ‘కాయ్‌ రాజా కాయ్‌’ మానుకోటలో జోరుగా ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ అనే శీర్షికన ఏప్రిల్‌ 18న ‘సాక్షి’లో కథనం ప్రచురితమైన విషయం విదితమే. ఐపీఎల్‌ క్రికెట్‌ బెట్టింగ్‌ విష సంస్కృతి గ్రామాలకు పాకి, రూ.100 నుంచి రూ.లక్షల వరకు నిమిషాల్లో నగదు చేతులు మారుతున్నాయి. దీంతో జిల్లా పోలీసులు, సెంట్రల్‌ క్రైం పోలీసులు అప్రమత్తమై ఐపీఎల్‌ క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠాను అరెస్టు చేశారు. మహబూబాబాద్‌ టౌన్‌ పోలీసుస్టేషన్‌ సమావేశ మందిరంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి ఐపీఎల్‌ క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠా అరెస్ట్‌ వివరాలు వెల్లడించారు.

క్రికెట్‌ బెట్టింగ్‌కు పాల్పడే వ్యక్తులపై జిల్లా పోలీసులు ప్రత్యేకమైన నిఘా పెట్టారు. మహబూబాబాద్‌ పట్టణంలో కొద్ది రోజుల నుంచి ఐపీఎల్‌ క్రికెట్‌ బెట్టింగ్‌లకు పాల్పడుతూ అమాయకులను బలి చేస్తున్న ఏడుగురు మంది వ్యక్తులను మహబూబాబాద్‌ డీఎస్పీ ఆంగోతు నరేష్‌కుమార్, సీసీఎస్‌ సీఐ ఎన్‌.వెంకటేశ్వర్లు, టౌన్‌ సీఐ ఎస్‌.రవికుమార్‌ నిఘా పెట్టి పట్టుకున్నారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా వారి వద్ద నుంచి రూ.2,09,920 నగదు, 8 సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో కె.గోపి, కె.సతీష్‌కుమార్, బి.భాస్కర్, ఎల్‌.వీరు, ఎం.వంశీకృష్ణ, బి.రాము, బి.శివరాజన్‌ ఉన్నారు. వీరంతా కూడా బెట్టింగ్‌లకు ఆన్‌లైన్‌ సేవలైన వాట్సాప్, గూగుల్‌ప్లే, పేటీఎం, ఫోన్‌ పేవంటి యాప్‌లను ఫోన్లలో డౌన్‌లోడ్‌ చేసుకుని క్రికెట్‌ బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారు. వీరు క్రికెట్‌ టీం ఆరోజు ఆడే ఐపీఎల్‌ మ్యాచ్‌లోని టాప్‌గా ఉన్న టీంను అంచనా వేసుకుని మ్యాచ్‌ టు మ్యాచ్‌ను బట్టి, ప్లేయర్లను బట్టి బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారు.

ప్రస్తుతం మొబైల్‌ ఆన్‌లైన్‌ ద్వారా బెట్టింగ్‌ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. 8 మంది కోసం పోలీసులు పరిశోధించగా కె.సుధాకర్‌ అనే వ్యక్తి పరారయ్యాడు.  ఐపీఎల్‌ క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠాను పట్టుకునేందుకు ప్రతిభ కనబర్చిన పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ఈ సమావేశంలో డీఎస్పీ ఆంగోతు నరేష్‌కుమార్, సీసీఎస్, టౌన్‌ సీఐలు ఎన్‌.వెంకటేశ్వర్లు, ఎస్‌.రవికుమార్, సీసీఎస్, టౌన్‌ ఎస్సైలు జి.రాజ్‌కుమార్, సీహెచ్‌.అరుణ్‌కుమార్, సీహెచ్‌.రమేష్‌బాబు, సీసీఎస్‌ ఏఎస్సై ఉప్పలయ్య, సీసీఎస్, సివిల్‌ పోలీసు పీసీలు బాలరాజు, వేణు, శంకర్, రఘురాం, సురేష్, సలీం తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు