మనోళ్లకు మామూళ్లే!

5 May, 2019 08:17 IST|Sakshi
తాడిపత్రిలో మట్కా నిర్వాహకులు తగులబెట్టిన పోలీసు వాహనం(ఫైల్‌)

అనంతపురం సెంట్రల్‌:  దొంగతనాలు.. క్రికెట్‌ బెట్టింగ్‌.. మట్కా.. అసాంఘిక కార్యకలాపాలకు జిల్లా నిలయంగా మారుతోంది. వీటి విషయంలో స్థానిక పోలీసులు అంటీముట్టనట్లుగా వ్యవహరి స్తుండటం మొత్తం పోలీసు వ్యవస్థను అప్రతిష్టపాలు చేస్తోంది. ముఖ్యంగా అంతర్‌జిల్లా దొంగలు సైతం ఆయా ప్రాంతాల్లో చోరీ చేసిన సొమ్మును నగరంలోని పలు బంగా రు దుకాణాల్లో విక్రయించిన ఘటనలు వెలుగుచూడటం ఇక్కడి పరిస్థితులకు అద్దం పట్టింది. ఈ నేపథ్యంలో హైదరబాద్, తమిళనాడు పోలీసులు సైతం జిల్లా కేంద్రానికి వచ్చి సొమ్ము రికవరీ చేసుకుపోవడం గమనార్హం. దొంగలు ఈ ప్రాంతాన్ని తమ అడ్డాగా మార్చుకున్నా స్థానిక పోలీసులు ‘ఇంటి దొంగలను’ గుర్తించలేకపోవడం గమనార్హం.
 
క్రికెట్‌ బెట్టింగ్, మట్కా లాంటి అసాంఘిక శక్తులు సైతం జిల్లాను అడ్డాగా చేసుకుంటున్నాయి. తాడిపత్రిలో జేసీ సోదరుల అనుచరులుగా చెలామణి అవుతున్న వ్యక్తులు మట్కా నిర్వహిస్తున్నట్లు గతేడాది వైఎస్సార్‌ జిల్లా సీఐ హమీద్‌ఖాన్‌ జరిపిన దాడుల్లో తేలింది. ఏకంగా పోలీసులపై దాడి చేసి వారి వాహనాలను తగలబెడితే ఖండించాల్సింది పోయి వారికే అనుకూలంగా ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి మాట్లాడారు.

పోలీసులపైనే కౌంటర్‌ కేసులు నమోదు చేయించారు. ఈ ఘటనలో నిందితులను అరెస్ట్‌ చేయలేకపోయినా తాడిపత్రిలో జరుగుతున్న చీకటి మట్కా సామ్రాజ్యం బాహ్య ప్రపంచానికి తెలిసింది. ఇంత జరుగుతున్నా స్థానిక తాడిపత్రి పోలీసులు ఏం చేస్తున్నారనే ప్రశ్న అప్పట్లో తలెత్తింది. నిందితులు టీడీపీ నాయకులు కావడంతోనే వారికి గులాంగిరి చేస్తున్నారనే విషయం అర్థమైంది.
 
నేరస్తులకు రాజకీయనేతల అండ 
జిల్లాలో చాలామంది ప్రజాప్రతినిధులు, రాజకీయనాయకులు నేరస్తులకు అండగా నిలుస్తున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వ్యక్తులు రాజకీయ నాయకుల పంచన చేరి వారి కార్యకలాపాలను యథేచ్ఛగా సాగిస్తున్నారు. పోలీసుల వద్ద నుంచి ఒత్తిళ్లు వచ్చినప్పుడు నేతలతో ఫోన్లు చేయిస్తూ వారి చీకటి పనులను దర్జాగా చేసుకుంటున్నారు. తాజాగా శుక్రవారం క్రికెట్‌ బెట్టింగ్‌కు పాల్పడుతున్న వ్యక్తులను తప్పించాలని నగరంలోని ఓ ప్రజాప్రతినిధి జిల్లా ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్‌పై తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు తీసుకొచ్చినట్లు తెలిసింది.

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కోసం పనిచేశాడని, తప్పించకపోతే తనకు చెడ్డ పేరు వస్తుందని పేర్కొన్నట్లు సమాచారం. అయినప్పటకీ నేరస్తున్ని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. తాడిపత్రిలో ఏకంగా పోలీసులే టీడీపీ నేతల అనుచరులుగా చెలామణి అవుతున్నారు. పోలీసులశాఖలో కింది స్థాయి సిబ్బంది పోస్టింగ్‌లు స్థానిక ప్రజాప్రతినిధుల సిఫార్సులతో జరుగుతుండడంతో విధి నిర్వహణలో వారి అనుచరులు, అనుయాయుల విషయంలో చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరికొన్ని చోట్ల మామూళ్ల మత్తులో నేరాలను అడ్డుకోలేకపోతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ పరిస్థితులు జిల్లాలో శాంతి భద్రతలను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. 

తాజాగా శుక్రవారం క్రికెట్‌ బెట్టింగ్, గంజాయి విక్రేతలను అరెస్ట్‌ చేసి దాదాపు రూ. 25.10 లక్షలు నగదు, 38 సెల్‌ఫోన్‌లు, ఎల్‌ఈడీ టీవీలు, 500 గ్రామాలు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మొత్తం 17 మందిని అరెస్ట్‌ చేశారు. అరెస్టయిన వారిలో అనంతపురంతో పాటు ధర్మవరం, నార్పలకు చెందిన వారు ఎక్కువ శాతం మంది ఉన్నారు. నిందితులను పట్టుకోవడంలో ఎస్పీ ప్రత్యేక బృందం (ఎస్‌ఓజీ) కీలకంగా వ్యవహరించింది. బెట్టింగ్‌ ఈస్థాయిలో సాగుతున్నా స్థానిక పోలీసులు గుర్తించలేకపోవడం గమనార్హం. 

గతేడాది డిసెంబర్‌ 30న వైఎస్సార్‌ జిల్లా సీఐ హమీద్‌ఖాన్‌ తాడిపత్రిలో మట్కా నిర్వాహకుల అరెస్ట్‌కు యత్నించడం, మట్కా నిర్వాహకులు పోలీసులపైకే తిరగబడి దాడి చేసి, వారి వాహనాలను తగలబెట్టడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. స్థానిక పోలీసుల సహకారం లేకపోవడంతో వారిని అరెస్ట్‌ చేయలేకపోయినా ఈ ఘటనలో జేసీ అనుచరులు నెలకొల్పిన మట్కా చీకటి సామ్రాజ్యాన్ని వెలుగులోకి తేవడంలో ఆ జిల్లా పోలీసులు    సఫలీకృతం అయ్యారు.  

నెలవారీ మామూళ్లు.. స్థానిక నాయకులతో మిలాఖత్‌.. వెరసి నేరాలకు అడ్డుకట్ట వేయడంలో స్థానిక పోలీసులు విఫలమవుతున్నారు. ఇతర జిల్లా పోలీసులు వచ్చి నేరస్తుల ఆటకట్టించే ప్రయత్నం చేస్తే తప్ప ఇక్కడి నేర సామ్రాజ్యం వెలుగులోకి రాని పరిస్థితి. దీన్నిబట్టి చూస్తే స్థానిక పోలీసుల పనితీరు ఏస్థాయికి దిగజారిందో అర్థమవుతోంది.

నేరాల అడ్డుకట్టపై దృష్టి అసాంఘిక కార్యకలాపాలను అడ్డుకో వాల్సిన బాధ్యత స్థానిక పోలీసులపైనే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో విధి నిర్వహణలో ఒత్తిళ్ల కారణంగా జాప్యం జరుగుతుంది. ప్రత్యేక సిబ్బం ది దృష్టి నేరస్తులపైనే ఉంటుంది కాబట్టి త్వరితగతిన ఛేదిస్తారు. ఏదేమైనా నేరాలు అడ్డుకట్ట వేయడంపై అందరూ దృష్టి సారించాలి. – జీవీజీ అశోక్‌కుమార్, జిల్లా ఎస్పీ  

మరిన్ని వార్తలు