అమ్మ చేసిన పాపం శాపమైంది

15 Dec, 2019 08:42 IST|Sakshi

కత్తి, యాసిడ్‌ దాడిలో అత్త దుర్మరణం  

ప్రజాగ్రహానికి నిందితుడి బలి 

అనాథగా వాసంతి 

తమిళనాడులో సంచలనం

భర్త మరణించడంతో భార్య తప్పటడుగులు వేసింది. ఓ కసాయిని నమ్మి కన్నబిడ్డలకు దూరమైంది. అతడి మనసు ఆమె కుమార్తెపై పడింది. లొంగదీసుకోవాలని భావించాడు. వ్యభిచార కూపంలోకి దించాలని నిశ్చయించాడు. దీనికి అడ్డు వచ్చిన ఓ వృద్ధురాలినీ అతి దారుణంగా పొడిచేశాడు. తరువాత ఆమెపై యాసిడ్‌ పోసి పైశాచిక ఆనందంలో మునిగిపోయాడు. చివరకు విధి విధించిన శిక్షకు బలైపోయాడు. ఈ ఘటన తమిళనాడులో సంచలనమైంది.  

సాక్షి ప్రతినిధి, చెన్నై: నామక్కల్‌ జిల్లా పుదుసత్తిరానికి చెందిన కందస్వామి, దనం దంపతుల కుమారుడు రవికుమార్‌ (46). ఇతను మూడేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అతడి భార్య విజయ (38) బనియన్‌ కంపెనీలో పనిచేసేది. వీరికి వాసుకి (21), వాసంతి (17) ఇద్దరు కుమార్తెలు. తాళం వేసిన ఇళ్లలో దొంగతనాలకు పాల్పడడం, ఒంటరిగా ఉన్న మహిళలను ముగ్గులోకి దింపడంలో సిద్ధహస్తుడైన ధర్మపురి జిల్లా తడంగం అవ్వయ్యార్‌ కాలనీకి చెందిన సామువేల్‌ (40)తో విజయకు పరిచయం ఏర్పడింది. ఇది వివాహేతర సంబంధానికి దారితీసింది. సామువేల్‌తో తల్లి సన్నిహితంగా మెలగడాన్ని గమనించిన కుమార్తెలు తీవ్రంగా మందలించారు. 

పిల్లల మందలింపును ఏమాత్రం పట్టించుకోలేదు. విజయ సామువేల్‌తో సహవాసాన్ని విడిచిపెట్టలేదు. తల్లిలో మార్పురాకపోవడంతో పెద్ద కుమార్తె వాసుకి తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లాడి తనదారి చూసుకుంది. చిన్న కుమార్తె వాసంతి నానమ్మ దనం (65) ఇంటికి చేరుకుంది. ప్రయివేటు కాలేజీలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. తీరిక వేళల్లో ఒక ఫార్మసీ దుకాణంలో పనిచేస్తూ నాన్నమ్మకు ఆర్థికంగా సహకరిస్తోంది. భర్త చనిపోయి, కుమార్తెలు వెళ్లిపోయి ఒంటరిగా మిగిలిన విజయ తన ప్రియుడు సామువేల్‌తో కాపురం పెట్టింది. 

కాగా, వాసంతిని సైతం లొంగదీసుకోవాలని భావించిన సామువేల్‌ ఫార్మసీ షాపులో కలుస్తూ లైంగికదాడి యత్నించేవాడు. అంతేగాక వాసంతిని ఎలాగైనా వ్యభిచారవృత్తిలోకి దించేందుకు తెగించాడు. మనుమరాలిని దనం రోజూ రాత్రిపూట బంధువుల ఇంట్లో ఉంచడం ప్రారంభించింది. అత్తగారి ఇంట్లో ఉంటున్న కుమార్తెను పిలుచుకు రావాల్సిందిగా సామువేల్‌ను విజయ పురమాయించింది. శుక్రవారం రాత్రి దనం ఇంటికి వచ్చిన సామువేల్‌తో పంపేది లేదని దనం తెగేసి చెప్పింది. ఆగ్రహించిన సామువేల్‌ ఇంట్లో ఉన్న కత్తితో ఆమె గొంతు కోశాడు. అనేక చోట్ల పొడిచాడు. అంతటితో శాంతించక తన వెంట తెచ్చుకున్న యాసిడ్‌ను ఆమెపై కుమ్మరించాడు. బాధతో ఆమె పెట్టిన కేకలకు ఇరుగుపొరుగు వారు గుమికూడారు. 

పోలీసుల సహకారంతో తలుపులు తెరిచి లోపలికి వెళ్లారు. అప్పటికే ఒళ్లంతా కాలిపోయి, రక్తం మడుగులో దనం విగతజీవిగా పడిఉంది. ఇంట్లో దాక్కుని ఉన్న సామువేల్‌ను పోలీసులు, ప్రజలు పట్టుకునే ప్రయత్నం చేయగా యాసిడ్‌ను వారిపై కూడా వెదజల్లుతూ పరుగులు పెట్టాడు. ఆగ్రహంతో రగలిపోతున్న ప్రజలు సామువేల్‌ను రాళ్లు, కర్రలతో తరిమికొడుతూ వెంటపడ్డారు. ఈ సమయంలో సామువేల్‌ ఒక సిమెంటు దిమ్మెపై బోల్తాపడగా తల నుంచి తీవ్రరక్తస్రావమై ప్రాణాలు విడిచాడు. సామువేల్‌ పాత నేరస్తుడని, అతనిపై 13 క్రిమినల్‌ కేసులు విచారణ దశలో ఉన్నాయని పోలీసులు తెలిపారు. యాసిడ్‌ దాడిలో దనం ఇంటి పరిసరాల ప్రజలు గాయపడ్డారు. కన్నతండ్రి మరణించి, కన్నతల్లి, ఆదరించిన నానమ్మ దూరమై వాసంతి అనాథగా మిగిలింది.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

దారుణం: 8 ఏళ్ల బాలికపై బంధువు అత్యాచారం

ప్రాణం తీసిన 'తబ్లిగి జమాత్‌' వివాదం

హత్య వెనుక ప్రేమ వ్యవహారం

సొంతింటికే కన్నం.. భర్తకు తెలియకుండా..

అనుమానం పెనుభూతమై.. 

సినిమా

మహేష్‌ మేనల్లుడు అశోక్‌ లుక్‌ రివీల్‌..

బన్నీ బర్త్‌ డే.. ముందే సర్‌ప్రైజ్‌ ఇచ్చిన దేవీశ్రీ

కోడలికి కృతజ్ఞతలు తెలిపిన మెగాస్టార్‌

ట్విటర్‌లో ట్రెండింగ్‌గా మారిన రష్మికా..

లాక్‌డౌన్‌లో నటి జాలీ రైడ్‌, గాయాలు

రాక్షసిలాగా అనిపించింది ఆ జైలు!