‘క్రైమ్‌’ కలవరం!

21 Nov, 2019 12:17 IST|Sakshi
భర్తను చంపిన నిందితులను చూపుతున్న పోలీసులు (ఫైల్‌)

జిల్లాలో సంచలన హత్యలు.. ప్రమాదాలు

ఈనెలలోనే వరుస ఘటనలు

కలకలం రేపిన దారుణాలు 

సాక్షి, నిర్మల్‌: నిర్మల్‌.. పేరుకు తగ్గట్టుగా ప్రశాంతంగా ఉండే జిల్లా. అలాంటి జిల్లాలో నెలరోజులుగా ఏదో ఒక ఘటన కలవర పెడుతూనే ఉంది. వరుసగా జరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు, రోడ్డు ప్రమాదాలు, దొంగతనాలు జిల్లాలో కలకలం రేపుతున్నాయి. పొన్కల్‌లో గోదావరిలో లభ్యమైన మృతదేహం వెనుక ఉన్న మిస్టరీని మరచిపోకముందే.. తల్వేద చెరువులో మహిళ మృతదేహం గోనెసంచిలో లభ్యమైంది. ఇదిలా ఉండగా, ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దారుణంగా చనిపోయాడు. ఇలా.. క్రైమ్‌ సీరియల్‌ మాదిరి ఈనెలలో వరుసగా నేరఘటనలు చోటు చేసుకున్నాయి. హత్యలు, ఆత్మహత్యలు, ప్రమాదాలు, దొంగతనాలు, కొట్లాటలతో ఇది క్రైమ్‌సీజన్‌గా మారింది. పోలీసులకూ ఈ సీజన్‌ సవాల్‌గానే సాగుతోంది. 

భర్తను చంపించిన భార్య.. 
ఇద్దరు ప్రియులతో కలిసి ఓ భార్య తన భర్తనే దారుణంగా చంపించింది. ఇలాంటి ఘటనలు మీడియాలో చూడడమే తప్ప స్థానికంగా ఎప్పుడూ వినలేదు. భర్తను చంపేసిన తర్వాత కూడా.. చచ్చాడా.. లేదా.. మరోసారి చూడండంటూ ప్రియులకు ఫోన్‌ చేసి మరీ.. ఆ భార్య నిర్దారణ చేసుకున్న తీరు దారుణం. ఈనెల 1న బయటపడ్డ ఈ కేసు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. మృతుడు, నిందితులు జిల్లావాసులు కాకున్నా ఘటన మాత్రం స్థానికంగా జరిగింది. నిజామాబాద్‌ జిల్లా అంకాపూర్‌కు చెందిన గుజ్జెటి ఉదయ్‌కుమార్‌(39)ను ఆయన రెండో భార్య పావని ఆలియాస్‌ లావణ్య చంపించింది. తన ఇద్దరు ప్రియులు దవాతే దౌలాజీ అలియాస్‌ రమేష్, గంగాధర్‌తో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడింది.   

చంపేసి.. మూటకట్టి.. చెరువులో పడేసి 
తమ సోదరుడిని చంపారన్న అనుమానంతో నిందితులు ఓ మహిళను బలిగొన్న తీరు వీళ్లు మనుషులా.. అన్న భావనను కలిగించింది. పచ్చని పల్లెలో పగతో రగిలిపోయిన వాళ్లు ప్రతీకారం తీర్చుకునే క్రమంలో మృగాలుగా వ్యవహరించిన తీరు అందరినీ కలచివేసింది. సారంగాపూర్‌ మండలం బోరిగాంకు చెందిన ప్రశాంత్‌ అతడి స్నేహితుడు మహేందర్‌ బైక్‌పై నిర్మల్‌ వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో ప్రశాంత్‌ మృతి చెందాడు. అయితే ఇది ప్రమాదం కాదని, తమ సోదరుడిని మహేందర్‌ హత్య చేశాడని ప్రశాంత్‌ సోదరులు, కుటుంబసభ్యులు కక్షగట్టారు. ఈక్రమంలో ఈనెల 12న రాత్రి మహేందర్‌ తల్లి కళావతి తమ ఇంటి ముందు నుంచి వెళ్తుండగా నిందితులు ఆమెను బలవంతంగా ఇంట్లోకి లాక్కెళ్లి హతమార్చారు. ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని గోనెసంచిలో కుక్కి, కారులో తీసుకెళ్లి నిర్మల్‌రూరల్‌ మండలంలోని తల్వేద చెరువులో పడేశారు. పాతకక్షల నేపథ్యం ఉండటంతో గ్రామస్తులు నిందితులపై చర్యలు తీసుకోవలంటూ గ్రామంలో ఆందోళన చేపట్టారు. ఈ ఘటనలో నిందితులకు సహకరిస్తున్నారంటూ పోలీసుల తీరుపైనా గ్రామస్తులు ఆరోపణలు చేశారు.  

తల ఎగిరిపోయింది.. 
ఈనెల 17న రాత్రి భైంసా–నిర్మల్‌ మార్గంలో 61 వ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్ర మాదం సంచలనమైంది. తల లేకుండా రోడ్డుపై మొండెం మాత్రమే కనిపించింది. హత్యనా.. లేక ప్రమాదమా.. అన్న చర్చ మొదలైంది. ఘటన జరిగిన మరుసటి రోజు వరకూ మృతు డి తల దొరకలేదు. దిలావర్‌పూర్‌ మండలం లోని కుస్లి గ్రామానికి చెందిన సూర అరుణ్‌ అనే యువకుడు ఆదివారం రాత్రి డోంగూర్‌గావ్‌ నుంచి తమ ఊరికి వెళ్తుండగా నర్సాపూర్‌(జి) మండలంలో ప్రమాదానికి గురయ్యాడు. ఎదురుగా వేగంతో వస్తున్న భారీ వాహనం(హార్వేస్టర్‌గా భావిస్తున్నారు) మెడ భాగంలో బలంగా ఢీకొట్టడంతో అరుణ్‌ తల ఎగిరిపోయింది. దాదాపు 30మీటర్ల దూరంలో పడింది. ఘటన జరిగిన తర్వాత మరుసటి రోజు తల దొరికింది. రోడ్డుపై మొండెం మాత్రమే ఉండటంతో కుటుంబసభ్యులు, గ్రామస్తులు అరుణ్‌ది హత్యగా భావించారు. కానీ ఘటన జరిగిన తీరును అంచనా వేసిన పోలీసులు రోడ్డుప్రమాదంగా భావిస్తున్నారు.  

వరుస ఘటనలతో.. 

గతానికి భిన్నంగా జిల్లాలో వరుసగా నేరాలు, ఘటనలు చోటుచేసుకోవడంతో సర్వత్రా క్రైమ్‌పైనే చర్చ నడుస్తోంది. ప్రధానంగా పొన్కల్, బోరిగాం కేసులు మానవత్వానికే మాయని మచ్చగా నిలిచాయని పేర్కొంటున్నారు. ప్రియుల మోజులో పడి భర్తను చంపించిన తీరు, అనుమానంతో కక్షకట్టి ఓ అమాయకురాలి ప్రాణం తీసిన.. ఈ ఘటనలు జిల్లావాసులను కలచివేశాయని చెప్పవచ్చు. ప్రశాంతంగా ఉండే జిల్లాలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడంతో పాటు పలు రోడ్డుప్రమాదాలు, వరుస దొంగతనాలూ ఈనెలలోనే జరిగాయి. జిల్లాకేంద్రానికి చెందిన యువకుడు మొగిలి అంజు సై తం రోడ్డుప్రమాదంతో మృత్యువు దరికి చేరాడు. మామడ మండలంలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఇలా వరుస ఘటనలు జరగడంతో ఇది క్రైమ్‌ కాలంగా జిల్లావాసులు భావిస్తున్నారు. మరోవైపు పెరుగుతున్న క్రైమ్‌రేట్‌ పోలీసులకు కొత్త సవాళ్లు విసురుతోంది. 

మరిన్ని వార్తలు