దారుణాలు

2 May, 2019 08:36 IST|Sakshi
తండ్రి నరేందర్‌రెడ్డితో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన స్ఫూర్తిరెడ్డి (ఫైల్‌)

ఒకే రోజు మూడు హత్యలు  

మౌలాలి, పహాడీషరీఫ్, ఆర్‌సీపురంలో ఘటనలు  

మరో మూడు ఆత్మహత్యలు సైతం  

ప్రేమ కారణంతో బీటెక్‌ విద్యార్థి, అనారోగ్య సమస్యలతో దంపతులు

ఇంకోవైపు బొమ్మలరామారం రోడ్డు ప్రమాదంలో నలుగురు విద్యార్థుల దుర్మరణం  

మన నగరానికి ఏమైంది? ఓవైపు హత్యలు, మరోవైపు ఆత్మహత్యలు, ఇంకోవైపు ప్రమాదాలు... వెరసి కుటుంబాలు ఛిన్నాభిన్నమవుతున్నా యి. మంగళవారం రాత్రి, బుధవారం చోటుచేసుకున్న ఘటనలతో
నగరంలో విషాదఛాయలు అలుముకున్నాయి. యాదాద్రి జిల్లాబొమ్మలరామారం మండలం మైసిరెడ్డి గ్రామ శివారులో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో సిటీకి చెందిన నలుగురు విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. మరోవైపు తార్నాకలో నివసిస్తున్న సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి రోహిత్‌ శామ్యూల్‌ను మౌలాలి రైల్వే స్టేషన్‌కు వెళ్లే మార్గంలోని చెట్ల పొదల్లో బండరాయితో మోది గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేయగా.. పహాడీషరీఫ్‌ ఠాణా పరిధి ఈద్గా ప్రాంతంలోని శ్మశాన వాటిక సమీపంలో గుర్తు తెలియని వ్యక్తిని ఆగంతకులు చంపేశారు. ఇక రామచంద్రపురం ఠాణా పరిధిలో కానిస్టేబుల్‌గా పనిచేసే మందరికా (32)ను హత్నూరు స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేసే ప్రకాశ్‌ పటాన్‌చెరు సమీపంలోని ఓ పంట చేనులో గొంతునులిమి చంపి పెట్రోల్‌ పోసి తగలబెట్టాడు.ఇంకోవైపు అల్వాల్‌లో బీటెక్‌ విద్యార్థి సాయికిరణ్‌ ఆత్మహత్య చేసుకోగా.. సికింద్రాబాద్‌ మార్కెట్‌ పీఎస్‌ పరిధిలోని ఆదయ్యనగర్‌లో దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు.
     

గుర్తు తెలియని యువకుడి దారుణ హత్య
పహాడీషరీఫ్‌: గుర్తు తెలియని యువకుడు దారుణ హత్యకు గురైన సంఘటన పహాడీషరీఫ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో బుధవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. జల్‌పల్లి ఈద్గా ప్రాంతంలోని శ్మశాన వాటిక సమీపంలో వ్యక్తి మృతదేహాన్ని గుర్తించిన మున్సిపల్‌ సిబ్బంది బుధవారం ఉదయం పోలీసులకు సమాచారం అందించడంతో పహాడీ షరీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ శంకర్, బాలాపూర్‌ అదనపు ఇన్‌స్పెక్టర్‌ సుధీర్‌ కృష్ణ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా గుర్తు తెలియని యువకుడిని దారుణంగా హత్య చేసినట్లు గుర్తించారు. వాదే ముస్తఫా బస్తీకి వెళ్లే రహదారిపై హత్య చేసి ఈడ్చుకెళ్లి గోతిలో పడేసి ఆనవాళ్లు గుర్తించారు. డాగ్‌ స్క్వాడ్, క్లూస్‌ టీంలు ఆధారాలు సేకరించాయి. ఎల్‌బీ నగర్‌ డీసీపీ సన్‌ప్రీత్‌ సింగ్, వనస్థలిపురం ఏసీపీ గాంధీ నారాయణ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడి మెడపై మూడు కత్తిపోట్లు, కుడి కన్ను దిగువన మరో గాయం ఉన్నట్లు గుర్తించారు. మృతుడు కుడి చేతిపై ‘మామ్‌’, ‘మమత’ పేర్లతో రెండు పచ్చబొట్లు ఉన్నాయి. మృతుడి కుడి చేతి బొటన వేలిని కోసి వేశారు. మృతుడి వయసు 25–30 ఏళ్ల మధ్య ఉంటుందన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాల పుటేజీని పరిశీలిస్తున్నారు.

చెరువు వరకు వెళ్లిన డాగ్‌ స్క్వాడ్‌.  
 పోలీస్‌ జాగిలం 200 మీటర్ల దూరం వెళ్లి జల్‌పల్లి చెరువు ఒడ్డున ఆగిపోయింది. మృతదేహం పడి ఉన్న ప్రాంతం నుంచి వాదే ముస్తఫా బస్తీ వైపు వెళుతూ....రహదారికి చాటుగా ఉన్న గుండ్ల వైపు ఉన్న నీటి వరకు జాగిలం వెళ్లడాన్ని బట్టి....నిందితులు డాగ్‌ స్క్వాడ్‌కు దొరకకుండా చెరువులో స్నానం చేసి వెళ్లి ఉండవచ్చునని భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు