రాక్షసులు

19 Aug, 2019 11:27 IST|Sakshi

బరితెగిస్తున్న హంతకులు  

పాశవికంగా హత్యలు 

చంపేసి మూటలుగా చుట్టేసి..  

శవాలను ముక్కలుగా నరికేసి..  

నగరంలో ఉదంతాలెన్నో...  

తాజాగా మౌలాలీలో మరో ఘటన  

సాక్షి, సిటీబ్యూరో: టెర్రాస్‌పై ప్రభాకర్‌... సిమెంట్‌ దిమ్మెలో నవీశ్‌... మూటలో మంజుల... ఫ్రిజ్‌లో ‘సిరిసిల్ల’ శ్రీనివాస్‌... గోనె సంచిలో పింకీ... సూట్‌కేస్‌లో మరో మహిళ... ముక్కలు ముక్కలుగా బాలుడు... డ్రమ్‌లో వికలాంగుడు... తాజాగా మౌలాలీ ప్రాంతంలో బకెట్లలో ముక్కలుగా చేసిన కన్నతండ్రి శవం... ఇవన్నీ సిటీలో సంచలనం సృష్టించిన హత్యలు. వ్యక్తిగత, ఆర్థిక ఇతర వివాదాల నేపథ్యంలో హత్యలు చేయడం.. మృతదేహాలను వదిలేసి పారిపోవడం జరుగుతూనే ఉంటుంది. అయితే బరితెగిస్తున్న కొందరు నరరూప రాక్షసులు చంపడంతో పాటు శవాలనూ వివిధ రకాలుగా పార్సిల్స్‌ చేస్తున్నారు. ఇలాంటి ఉదంతాల్లో అనేకం ఇప్పటికీ మిస్టరీలుగానే ఉన్నాయి. నగరంలో జరిగిన ఈ తరహా ఉదంతాలను పరిశీలిస్తే...  

ప్రభాకర్‌: 2003లో వెలుగులోకి వచ్చిన ప్రభాకర్‌ హత్య తీవ్ర కలకలం సృష్టించింది. యూసుఫ్‌గూడ ప్రాంతంలో ప్రింటింగ్‌ ప్రెస్‌ నిర్వహించే ప్రభాకర్‌ ఫైనాన్స్‌ వ్యాపారం కూడా చేసేవాడు. పుట్టిన రోజుకార్డులు ప్రింటింగ్‌ చేయించుకోవడానికి వచ్చిన శైలజతో ఇతడికి పరిచయమైంది. దాన్ని ఆసరాగా చేసుకొని ప్రభాకర్‌ నుంచి రూ.లక్షల్లో అప్పు తీసుకుంది శైలజ. ప్రభాకర్‌     చెల్లింపుల కోసం ఒత్తిడి పెంచడంతో ఇంటికి పిలిచి, కూల్‌డ్రింక్‌లో నెయిల్‌ పాలిష్‌ రిమూవర్‌ కలిపి తాగించింది. మత్తులోకి వెళ్లాక హత్య చేసి శవాన్ని ఐదు భాగాలుగా కోసింది. వీటిని గోనె సంచుల్లో కట్టి వంటింటి నుంచి టెర్రాస్‌ వరకు ఐదు ప్రాంతాల్లో దాచిపెట్టింది. 

నవీశ్‌: ‘జనహర్ష’ అధినేత రమణమూర్తితో ఉన్న ఆర్థిక విభేదాల నేపథ్యంలో ఇతడి పార్టనర్‌ నవీశ్‌మూర్తి 2005లో దారుణ హత్యకు గురయ్యాడు. రమణమూర్తి, ఇన్‌స్పెక్టర్‌ విజయ్‌సింగ్‌ మరికొందరు కలిసి నవీశ్‌మూర్తిని ఉప్పల్‌ ప్రాంతంలోకి తీసుకువెళ్లారు. అక్కడ నిర్మాణంలో ఉన్న తమకు పరిచయస్థుడి ఇంట్లో హత్య చేశారు. శవాన్ని వంటింట్లో పడేసి, కాంక్రీట్‌ను దిమ్మగా పోసేశారు. ఆ ఇంటి వెనుక నివసించే ఓ మహిళ ఇచ్చిన సమాచారంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. 

మంజుల: కర్నూలు జిల్లా గడివేముల గ్రామానికి చెందిన రామ్‌భూపాల్‌రెడ్డి రాజకీయ పనుల నేపథ్యంలో తరచూ రాజధానికి రాకపోకలు సాగించిన క్రమంలో ఫిల్మ్‌ ఫైనాన్షియర్‌ మంజులారెడ్డితో పరిచయమైంది. వీరిద్దరూ 2001లో వివాహం చేసుకున్నారు. 2006 ప్రథమార్థం నుంచి రామ్‌భూపాల్‌రెడ్డి, మంజులారెడ్డిల మధ్య మనస్పర్థలు ప్రారంభమయ్యాయి. విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్న ఇద్దరూ వేర్వేరుగా ఉండడం ప్రారంభించారు. అయితే మనస్పర్థలు తారాస్థాయికి చేరడంతో మంజులారెడ్డిని హతమార్చాలని రామ్‌భూపాల్‌రెడ్డి నిర్ణయించుకున్నాడు. తన మిత్రులైన చింతా మల్లికార్జునరెడ్డి, నరాల మధుసూధన్‌రెడ్డిలతో కలిసి కుట్ర పన్నాడు. పథకం ప్రకారం 2006 జూన్‌ 27న మంజుల గొంతు పిసికి చంపేశారు. అనంతరం ఆమె మృతదేహాన్ని గోనె సంచుల్లో మూటగట్టారు. ఆ మూటను ఆమె కారులోనే పెట్టుకొని ఖమ్మం వరకు వెళ్లి పాలేరు జలాశయంలో పడేశారు. 

ఆ శవం ఎవరిది?
మెహిదీపట్నం ప్రధాన బస్టాప్‌లో పీవీ నర్సింహారావు ఎక్స్‌ప్రెస్‌వే పిల్లర్‌ నంబర్‌ 12 ఎదురుగా ఉన్న బస్‌షెల్టర్‌ నంబర్‌ 3 వద్దకు 2011 ఆగస్టు 8న మధ్యాహ్నం 3గంటల ప్రాంతంలో టోలిచౌకీ వైపు నుంచి ఓ ఇండికా కారు వచ్చి ఆగింది. తొలుత అందులో నుంచి ఓ యువతి కిందికి దిగింది. వెనక్కు వెళ్లి కారు డిక్కీ తెరిచి అందులో నుంచి సూట్‌కేస్‌ను బయటకు తీయడానికి ప్రయత్నించింది. అయితే అది బరువుగా ఉండడంతో డ్రైవర్‌ను పిలిచి అతని సహాయంతో కిందికి దించి బస్టాప్‌లోకి చేర్చింది. అదే కారులోంచి దిగిన మరో మహిళతో కలిసి ఆ సూట్‌కేస్‌ పక్కనే బస్టాప్‌లో కాసేపు కూర్చుంది. అలా కాసేపు కూర్చున్న ఇద్దరూ అదే కారులో వెళ్లిపోయారు. ఆటోడ్రైవర్‌ ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు సూట్‌కేస్‌ తెరిస్తే అందులో మహిళ శవం లభించింది. ఇది ఎవరిదనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది.  

ముక్కలుగా బాలుడు:  నారాయణగూడ పోలీసు స్టేషన్‌ పరిధిలో నమోదైన గుర్తుతెలియని శవం కేసు తీవ్ర సంచలనం సృష్టించింది. తొలుత రామ్‌కోఠి చౌరస్తాలోని సిద్ధార్థ ఏజెన్సీస్‌ వద్ద కాళ్లు, తల లేని మొండెం దొరికాయి. దీనిపై సుల్తాన్‌బజార్‌ ఠాణాలో కేసు నమోదైంది. ఇది జరిగిన రెండు రోజులకు నారాయణగూడలో ఆ శవం కాళ్లు లభించాయి. దీంతో ఇక్కడ మరో కేసు నమోదు చేయడంతో పాటు సుల్తాన్‌బజార్‌ కేసునూ ఇక్కడకు బదిలీ చేశారు. ఈ కేసు సైతం ఇప్పటికీ కొలిక్కి చేరలేదు.  

సిరిసిల్ల వ్యాపారి:  కరీంనగర్‌ జిల్లా సిరిసిల్లకు చెందిన వస్త్ర వ్యాపారి శ్రీనివాస్‌ సిటీలో దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘాతుకం జరిగిన నాలుగు రోజుల అనంతరం ఆయన మృతదేహాన్ని ఉప్పల్‌లోని నిందితులకు చెందిన ఫ్లాట్‌లో ఉన్న ఫ్రిజ్‌లో పోలీసులు గుర్తించారు. సిరిసిల్లకే చెందిన ప్రొఫెషనల్‌ నేరగాడు శ్రీధర్‌ సూత్రధారిగా అక్కడి పోలీసులు గుర్తించారు. హతుడి ‘బలహీనత’ను క్యాష్‌ చేసుకున్న దుండగులు కిడ్నాప్‌ చేసి, రూ.25లక్షలు డిమాండ్‌ చేసి, పథకం పారకపోవడంతో హత్య చేసినట్లు నిర్ధారణ అయింది.

రామ్‌కుమార్‌: హఫీజ్‌పేటకు చెందిన రామ్‌కుమార్‌ను హత్య చేసిన దుండగులు మృతదేహాన్ని పాలథీన్‌ సంచిలో పార్సిల్‌ చేసి చెత్తుకుప్పలో పడేశారు. ప్లాస్టిక్‌ సంచిలో (గన్నీ బ్యాగ్‌) ఉంచిన మృతదేహం కాళ్లకు ట్రాన్స్‌పోర్టు కంపెనీల్లో వినియోగించే నైలాన్‌ తాడు కట్టారు. గొంతుకు ఉరిబిగించడంతో పాటు తలపై బలంగా గాయపరచడంతో మరణించినట్లు పోస్టుమార్టం నిర్వహించిన ఫోరెన్సిక్‌ వైద్యులు నిర్ధారించారు. గుర్తుతెలియని వ్యక్తి హత్యగా నమోదైన ఈ కేసులో పోలీసులు హతుడిని కనిపెట్టినా హంతకులు మాత్రం చిక్కలేదు. 

పింకీ: గతేడాది సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని బొటానిక్‌ గార్డెన్స్‌ వద్ద గోనె సంచిలో పది ముక్కలుగా దొరికిన గర్భిణి మృతదేహం తీవ్ర కలకలం సృష్టించింది. ఈ కేసును ఛాలెంజ్‌గా తీసుకొని దర్యాప్తు చేసిన పోలీసులు అది బిహార్‌ నుంచి వలస వచ్చిన పింకీదిగా తేల్చారు. భర్త, అతడి తరఫు వారే పథకం ప్రకారం ఇంట్లో హత్య చేసి, పార్సిల్‌ చేసి పడేసినట్లు వెలుగులోకి వచ్చింది.  

మరిన్ని వార్తలు