ఎర్రగుంట్ల బస్టాండ్‌.. చోరీలకు కేరాఫ్‌

6 Dec, 2018 13:30 IST|Sakshi
చోరీలకు నిలయంగా మారిన ఎర్రగుంట్ల ఆర్టీసీ బస్టాండ్‌

ఎర్రగుంట్ల బస్టాండ్‌లో పెరిగిపోతున్న చోరీలు

బెంబేలెత్తుతున్న ప్రయాణికులు

స్పందించని పోలీసులు

వైఎస్‌ఆర్‌ జిల్లా, ఎర్రగుంట్ల: ఎర్రగుంట్ల ఆర్టీసీ బస్టాండ్‌ చోరీలకు  నిలయంగా మారిందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ బస్సులు ఎక్కాలంటేనే ఏ బ్యాగులో నుంచి ఏ వస్తువు చోరీ చేస్తారో.. ఎవరి జేబులో నుంచి ఎంత నగదు మాయమవుతుందో.. ఎవరి పర్సు కొట్టేస్తారో.. అనే భయం ప్రయాణికులను వెంటాడుతోంది. ఆర్టీసీ బస్టాండ్‌లో సీసీ కెమెరాలు ఉన్నా దొంగలు మాత్రం హస్త లాఘవం ప్రదర్శిస్తూనే ఉన్నారు. ఇక్కడ సెల్‌ ఫోన్‌లు, బంగారు , డబ్బులు చోరీ కావడం నిత్యకృత్యమైంది. బుధవారం ఏకంగా ఓ వ్యక్తి నిక్కరు జేబును బ్లేడ్‌తో  కోసి రూ.2 లక్షలు నగదు దొంగిలించిన సంఘటన చోటు చేసుకుంది. దీంతో ప్రయాణికులు బస్టాండ్‌లో బస్సులు ఎక్కాలంటేనే భయపడుతున్నారు. పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదులు పెరిగిపోవడమే గాని చోరీల నియంత్రణకు పోలీసులు తీసుకున్న చర్యలు మాత్రం శూన్యం.

నిఘా కెమెరాలు ఉన్నా లేనట్టే..
 ఆర్టీసీ బస్టాండ్‌లో పోలీసులు నిఘా కెమెరాలను ఏర్పాటు చేసినా వాటి వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని తెలుస్తోంది. ఈ కెమెరాలు ఉన్న డైరెక్షన్‌లో చెట్లు అడ్డంగా ఉండడంతో చోరీ జరిగిన సంఘటనలు అందులో నమోదు కాలేకపోతున్నాయి. ఒక వేళ నమోదయినా దొంగలు సరి గా కన్పించడంలేదు. అంతేకాక బస్సులు కూడా నిఘా కెమెరాలకు అడ్డంగా వస్తుండడంతో ప్రయాణికులు బస్సు ఎక్కే దృశ్యాలు నమోదు కాలేక పోతున్నాయి. ఇప్పటికైనా పోలీసులు స్పందించి బస్టాండులో నిఘా ఏర్పాటు చేసి అ నుమానితులను గుర్తించి అదుపులోకి తీసుకుని చోరీలను నివారించాలని ప్రయాణికులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు