స్టేషన్లోనే సెటిల్‌ చేద్దామనుకుని!

20 Feb, 2019 02:47 IST|Sakshi
నందిగామలోని ఘటనాస్థలం వద్ద క్రైమ్‌ సీన్‌ రీ–కన్‌స్ట్రక్షన్‌ చేస్తున్న పోలీసు అధికారులు. నందిగామలోని బార్‌ వద్దకు రాకేష్‌ను తీసుకెళ్తున్న పోలీసులు

పోలీసు అధికారి నిస్సహాయతతో ఇంట్లోనే హత్యకు ప్లాన్‌ 

జయరామ్‌ హత్యకేసులో రాకేష్‌ రెడ్డి తీరు 

సహకరించిన పోలీసు అధికారులను త్వరలోనే విచారణ 

జూబ్లీహిల్స్‌ నుంచి నందిగామ వరకు క్రైమ్‌సీన్‌ రీ–కన్‌స్ట్రక్షన్‌

సాక్షి, హైదరాబాద్‌: ఎక్స్‌ప్రెస్‌ టీవీ చైర్మన్, కోస్టల్‌ బ్యాంక్‌ డైరెక్టర్‌ చిగురుపాటి జయరామ్‌ హత్యకు ముందు ఓ అధికారి, తర్వాత మరో అధికారితో రాకేష్‌రెడ్డి సంభాషించినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఇన్‌స్పెక్టర్‌ హోదాల్లో ఉన్న ఈ ఇద్దరితోపాటు మరో ఏసీపీని పిలిచి విచారించాలని నిర్ణయించారు. బుధ, గురువారాల్లో ఈ విచారణ జరనగనుందని సమాచారం. మొదట జయరామ్‌ కేసును పరిచయమున్న పోలీసు అధికారుల సాయంతో స్టేషన్లోనే సెటిల్‌ చేద్దామనుకున్నప్పటికీ.. అది కుదరకపోవడంతో జూబ్లీహిల్స్‌లో తన ఇంట్లోనే రాకేష్‌ హత్యచేశాడని తెలిసింది. మరోవైపు, కేసు దర్యాప్తు అధికారిగా ఉన్న బంజారాహిల్స్‌ ఏసీపీ కె.శ్రీనివాసరావు మంగళవారం నిందితులతో క్రైమ్‌ రీ–కన్‌స్ట్రక్షన్‌ నిర్వహించారు.

ఇందులో భాగంగా నిందితులను జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం.10 లోని రాకేష్‌ ఇంటి నుంచి నందిగామ వరకు తీసుకువెళ్లి వచ్చారు. జయరామ్‌ను వీణా పేరుతో ‘హనీట్రాప్‌’ చేసిన రాకేష్‌.. ఆయన్ను బంధించడానికి సహకరించాల్సిందిగా సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌లో పనిచేస్తున్న అధికారిని సంప్రదించాడు. జయరామ్‌ను తీసుకొచ్చి పోలీసుస్టేషన్‌లోనే ఉంచాలని, ఆపై డబ్బు వసూలుతోపాటు పత్రాలపై సంతకాలు తీసుకుందామని అన్నాడు. అయితే అలా చేయడం తనకు ఇబ్బందికరంగా మారుతుందని ఆ ఇన్‌స్పెక్టర్‌ స్థాయి అధికారి చెప్పాడు. దీంతో తానే రంగంలోకి దిగిన రాకేష్‌ గత నెల 30న జయరామ్‌ను జూబ్లీహిల్స్‌ క్లబ్‌ వరకు రప్పించి తన ఇంటికి వచ్చేలా ప్లాన్‌ వేశాడు.  

రెండ్రోజులపాటు బంధించి! 
ఆహారం, మద్యం అందిస్తూ రెండు రోజుల పాటు ఇంట్లోనే ఉంచాడు. తొలుత కొన్ని ఖాళీ రూ.100 స్టాంప్‌ పేపర్లపై బలవంతంగా జయరామ్‌తో సంతకాలు చేయించుకున్న రాకేష్‌.. ఆపై బలవంతపు వసూలుకు ప్రయత్నించాడు. జయరామ్‌తో అనేక మందికి ఫోన్లు చేయించి రూ.10 లక్షల నుంచి రూ.కోటి వరకు వీలున్నంత పంపాల్సిందిగా చెప్పించాడు. చివరకు ఒకరు రూ.6 లక్షలు పంపడంతో తన అనుచరుడిని దస్‌పల్లా హోటల్‌కు పంపి ఆ మొత్తం రిసీవ్‌ చేసుకున్నాడు. ఈ డబ్బును తన ఇంట్లో తానే జయరామ్‌కు ఇస్తున్నట్లు నటిస్తూ విశాల్‌తో వీడియో రికార్డింగ్‌ చేయించాడు. జయరామ్‌ తన దగ్గర అప్పు తీసుకున్నాడని చెప్పేందుకు ఆధారంగా ఉంటుందనే ఈ వీడియా ప్లాన్‌ వేశాడు. ఆ సమయంలోనూ సైబరాబాద్‌ ఇన్‌స్పెక్టర్‌కు కాల్‌ చేసిన రాకేష్‌.. ఆ ఫోన్‌ జయరామ్‌కు ఇచ్చి మాట్లా డించాడు. అప్పుడు మాట్లాడిన సదరు పోలీసు అధికారి.. రాకేష్‌ ఇవ్వాల్సిన, అతడు కోరిన మొత్తం ఇవ్వాలంటూ జయరామ్‌ను హెచ్చరించాడు.

హైదరాబాద్‌ టు నందిగామ
హత్య చేశాక జయరాం శవాన్ని ఆయన కారులోనే పెట్టుకుని నల్ల కుంట పోలీసుస్టేషన్‌కు రాకేష్‌ వెళ్లాడు. తనకు పరిచయస్తుడైన ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసులుకు ఫోన్‌ చేశాడు. తాను ఆంధ్రమహిళా సభ ఆస్పత్రి వద్ద ఉన్నానంటూ చెప్పడంతో అక్కడకు వెళ్లిన రాకేష్‌ కారు దూరంగా ఆపి ఇన్‌స్పెక్టర్‌ను కలిశాడు. హత్య విషయం ఆయనకు చెప్పగా.. దాన్ని అతిగా మద్యం సేవించడంతో జరిగిన రోడ్డు ప్రమాదంగా మార్చాలని సూచించాడు. హైదరాబాద్‌ లేదా చుట్టుపక్కల అలా చేస్తే సీసీటీవీలు ఇతర ఆధారాలతో పోలీసులు పట్టుకుంటారని, ఏపీకి తీసుకువెళ్లి సీన్‌ క్రియేట్‌ చేయమని సలహా ఇచ్చాడు. దీంతో రాకేష్‌ విజయవాడ వైపు బయలుదేరాడు. మధ్యలో రాకేష్‌కు ఏసీపీ మల్లారెడ్డి ఫోన్‌ చేశాడు.

ఆదిభట్లలో ఉన్న ఓ ల్యాండ్‌ వివాదం నేపథ్యంలో వీరికి పరిచయం ఉంది. ఆపై నందిగామ వరకు వెళ్లి ఓ బార్‌లో బీరు బాటిళ్లు కొని ఐతవరంలో రోడ్డు కిందకు కారు వదిలేసి వెనక్కు వచ్చేశాడు. గతంలో రాకేష్‌ ఇంట్లో క్రైమ్‌ సీన్‌ రీ–కన్‌స్ట్రక్షన్‌ నిర్వహించిన పోలీసులు మంగళవారం అక్కడినుంచి నల్లకుంటకు, నందిగామ, ఐతవరం వరకు వెళ్లి ఈ ప్రక్రియ చేసి వచ్చారు. వీరి వెంట నిందితులు సైతం ఉన్నారు. విచారణలో నింది తులు చెప్పిన వివరాలు, రీ–కన్‌స్ట్రక్షన్‌లో గుర్తించినవి ఒకేలా ఉన్నాయ ని దర్యాప్తు అధికారులు తెలిపారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసుల్ని మరో 2రోజుల్లో పిలిచి విచారించాలని నిర్ణయించారు.

మరిన్ని వార్తలు