ఆంధ్రజ్యోతి, రాధాకృష్ణపై క్రిమినల్‌ కేసు నమోదు

8 Apr, 2019 16:09 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఆంధ్రజ్యోతి దిన పత్రిక, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ఛానల్‌తో పాటు ఆ ఛానల్‌ ఎండీ వేమూరి రాధాకృష్ణపై జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో సోమవారం క్రిమినల్‌ కేసు నమోదు అయింది. తనది కాని ‘వాయిస్‌’ను డబ్బింగ్‌ చేసి ఏబీఎన్‌ ఛానల్‌లో పదే పదే ప్రసారం చేస్తూ తన పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించడమే కాకుండా, అసత్య ప్రచారం చేస్తూ.. తెలుగు రాష్ట్రాల ప్రజల మనోభావాలు దెబ్బతీశారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార‍్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఈ నెల 7వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై న్యాయ సలహా అనంతరం పోలీసులు ఇవాళ... సెక్షన్లు 171సి, 171జీ, 171ఎఫ్, 469,505(2) కింద కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించి త్వరలో పోలీసులు నోటీసులు జారీ చేయనున్నారు.

కాగా టీడీపీకి అమ్ముడుపోయిన వేమూరి రాధాకృష్ణ తన వాయిస్‌ అంటూ ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ఛానల్‌లో ప్రసారం చేయడంతో పాటు ఆంధ్రజ్యోతి దిన పత్రికలోనూ ప్రచురించి తన పరువు తీశారని విజయసాయిరెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. రాధాకృష్ణపై ఐపీసీ సెక్షన్‌ 120 (బి), సెక్షన్‌ 153 (ఏ), 171(సి) 171(హెచ్‌), 420, 123,125 రిప్రజెంటేషన్‌ పీపుల్స్‌ యాక్ట్‌ 1951 కింద క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని ఆయన ఫిర్యాదులో కోరారు. ఈ నెల 5వ తేదీన తనదికాని వాయిస్‌తో ఏబీఎన్‌ ఛానల్‌లో ఏపీ ప్రజలకు నిబద్ధత లేదు అన్నట్లుగా ప్రసారం చేసి తనతో పాటు పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించారని, శనివారం కూడా ఈ అంశంపై చర్చా వేదిక ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. ఈ చర్చావేదికలో పాల్గొన్నవారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.  

ఆధారాలు లేకుండా ప్రసారం చేసిన అంశంపైన తన వాయిస్‌ను డబ్బింగ్‌ చేసిన విధానంపై  తాను మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఖండించానని విజయసాయిరెడ్డి తెలిపారు. ఈ కుట్ర వెనక ఏపీ సీఎం చంద్రబాబు హస్తం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. నిరాధారమైన ఆరోపణలు చేసి తన ప్రతిష్టకు భంగం కలిగించి తప్పుడు ప్రచారం చేశారని, తెలుగు ప్రజల మనోభావాలు దీని వల్ల దెబ్బతిన్నాయని ఆయన పేర్కొంటూ ఈ నెల 5,6 తేదీల్లో ఆ చానల్‌లో  తనపై వచ్చిన ప్రసారాల ఆడియో టేపులను, ఈనెల 7న ఆంద్రజ్యోతి ప్రచురించిన కథనాన్ని విజయసాయిరెడ్డి ఫిర్యాదుకు జత చేశారు.

చదవండి...:
వారిద్దరిపై కేసు నమోదు చేయండి
ఆంధ్రజ్యోతి వశీకరణ వార్తలు పట్టించుకోవద్దు!
ఆంధ్రజ్యోతి కులజ్యోతి మాత్రమే!

మరిన్ని వార్తలు