వ్యాపారులపై క్రిమినల్‌ కేసులు

17 Aug, 2018 11:37 IST|Sakshi
ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌   

ఖమ్మంవ్యవసాయం : ఎటువంటి అనుమతులు, లైసెన్సులు లేకుండా అక్రమంగా వ్యాపారాలు సాగిస్తున్న ఏడుగురిపై క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి. వీరంతా, ‘కమీషన్‌ వ్యాపారులు’గా, ‘ఖరీదుదారులు’గా చలామణవుతూ రైతులను నిలువునా దోచుకుంటున్నారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఫిర్యాదుతో వీరిపై క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి. 

వీరంతా ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో కొంతకాలం నుంచి అక్రమంగా వ్యాపారాలు సాగిస్తున్నారు. మార్కెట్‌కు వచ్చిన రైతులకు మాయమాటలు చెప్పి, అధిక ధర పెట్టిస్తామంటూ బోల్తా కొట్టిస్తున్నారు. వారి పంటను కమీషన్‌ వ్యాపారుల ద్వారా ఖరీదుదారులకు చూపిస్తున్నారు. అడ్డగోలుగా కమీషన్లు దండుకుంటున్నారు. పంట విక్రయంలో వాస్తవానికి కమీషన్‌ వ్యాపారి మాత్రమే కమీషన్‌ తీసుకోవాలి. వీరు మాత్రం కమీషన్‌ వ్యాపారుల నుంచి, కొన్నిసార్లు ఖరీదుదారుల నుంచి కూడా (కమీషన్‌) దండుకుంటున్నారు.

సాధారణంగా కమీషన్‌ రూపాయిన్నర నుంచి రెండ్రూపాయల వరకు ఉంది. వీరు మాత్రం రైతుల నుంచి ఐదారు రూపాయల కమీషన్‌ గుంజుతున్నారు. పంటను చూసినప్పుడు ఓ ధర నిర్ణయిస్తారు. కాంటాల సమయంలో తిరకాసు పెడతారు. సరుకు బాగా లేదంటారు. తేమ శాతం ఎక్కువగా ఉందంటారు. తక్కువ ధరకు అమ్మేందుకు రైతులు ఒప్పుకోకపోతే.. తమకు అసలు ఆ సరుకు అవసరమే లేదంటూ మధ్యలోనే వెళ్లిపోయేవారు.

మరో వ్యాపారి అటువైపు రాకుండా, ఆ సురుకును చూడకుండా ప్రయత్నించేవారు. ఎక్కడి నుంచో వచ్చిన ఆ రైతులు... గత్యంతరం లేని పరిస్థితుల్లో వీరు అడిగిన రేటు/కమీషన్‌ ఇచ్చేవారు. రైతుల అనైకక్యత, వ్యాపారుల ఐక్యత/సిండికేట్‌ కారణంగా అధికారులు కూడా ఇన్నాళ్లూ ఏమీ చేయలేకపోయారు. గత ఏడాది ఈ మార్కెట్‌కు పర్సన్‌ ఇన్‌చార్జిగా అప్పటి జాయింట్‌ కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి (ప్రస్తుతం, జనగాం కలెక్టర్‌) బాధ్యతలు చేపట్టారు.

కొద్ది రోజులకే ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో ఈ–నామ్‌ అమలయింది. తమ అక్రమాలకు ఇది అడ్డుగా ఉండడంతో కొందరు వ్యాపారులు వ్యతిరేకించారు. ఆ తరువాత, ఇందులోని లొసుగులను పట్టేసుకున్నారు. వాటి ద్వారా తమ అక్రమాలను కొనసాగించారు. మార్కెట్‌ ఫీజు చెల్లించని వ్యాపారులపై మార్కెటింగ్‌ శాఖ అధికారులు దృష్టి సారించారు.

వినయ్‌కృష్ణారెడ్డి బదిలీతో పర్సన్‌ ఇన్‌చార్జిగా కలెక్టర్‌ డీఎస్‌ లోకేష్‌కుమార్‌ నియమితులయ్యారు. మార్కెట్‌లో అక్రమాలపై, అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. రాష్ట్ర మార్కెటింగ్‌ శాఖ కూడా సీరియస్‌గానే దృష్టి పెట్టింది. మార్కెట్‌కు దాదాపుగా 15లక్షల రూపాయల ఫీజు చెల్లించని ఇద్దరు వ్యాపారులపై క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి.

అప్పటికీ ఫలితం లేకపోవడంతో అధికారులు మరో అడుగు ముందుకేశారు. ఎటువంటి లైసెన్స్‌ లేకుండా వ్యాపారాలు సాగిస్తున్న వారిని గుర్తించే పనిలోకి దిగారు. ఈ క్రమంలోనే, లైసెన్సులకు సంబంధించి ఎటువంటి తాడు–బొంగరం లేని ఏడుగురు ‘వ్యాపారులు/ఖరీదుదారులు’ను గుర్తించారు.

మార్కెట్‌ పర్సన్‌ ఇన్‌చార్జ్‌ (కలెక్టర్‌) లోకేష్‌కుమార్‌ ఆదేశాలతో ఆ ఏడుగురిపై ఖమ్మం మూడవ అదనపు మొదటి తరగతి జ్యూడీషియల్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులో క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని గురువారం మార్కెట్‌ ఉన్నత శ్రేణి కార్యదర్శి రత్నం సంతోష్‌కుమార్‌ తెలిపారు. వీరికి ఆరు నెలల నుంచి ఏడాది వరకు జైలు శిక్ష పడే అవకాశముందని చెప్పారు. మార్కెట్‌లో రైతులను మోసగించే, పంట దొంగలపై నిఘా పెంచినట్టు చెప్పారు.

మరిన్ని వార్తలు