సాక్ష్యాలు రుజువు చేయాల్సిందే..

29 Jul, 2018 13:47 IST|Sakshi
సాక్ష్యాలకు సంబంధించిన దృశ్యం

జగిత్యాలజోన్‌:  చాలామం దివివిధ సమస్యలపై కోర్టు మెట్లు ఎక్కుతుంటారు. కానీ ఆ సమస్యకు సంబంధించిన సరైన సాక్ష్యం సమర్పించలేకపోవడంతో కేసులు కొట్టుడుపోతుంటాయి. ఈ నేపథ్యంలో  సాక్ష్యానికి సంబంధించిన విషయాల గురిం చి జగిత్యాల బార్‌ అసోసియేషన్‌ మాజీ ప్రధాన కార్యదర్శి, సీనియర్‌ న్యాయవాది కటుకం చంద్రమోహన్‌(94400 08494) ఇలా వివరించారు.
 
రుజువు చేసుకోవాల్సిందే 
ఒక వ్యక్తి తనకు అందాల్సిన చట్టబద్ధమైన హక్కులు లేక బాధ్యతల గురించి తీర్పును ఇవ్వవలసిందిగా కోర్టును కోరినప్పుడు, ఆ వ్యక్తి సదరు విషయాలకు సంబంధించిన సాక్ష్యాలను రుజువు చేయవలసి ఉంటుంది.  సాక్ష్యాన్ని రుజువు చేయడమనేది సివిల్, క్రిమినల్‌ కేసులకు వర్తిస్తుంది. అయితే ఒకే విధంగా ఉండదు. ఒక విషయం వాస్తవమేనని రుజువు చేయడమే రుజువుభారం(బర్డెన్‌ ఆఫ్‌ ప్రూప్‌)గా పిలుస్తారు. ఎవరు ముందుగా కోర్టును ఆశ్రయిస్తారో.. తాను న్యా యాన్ని పొందుటకు అర్హుడనని సదరు వ్యక్తి రు జువు చేసుకోవాల్సి ఉంటుంది. క్రిమినల్‌ కేసుల్లో రుజువుభారం పూర్తిగా ప్రాసిక్యూషన్‌పైనే ఆధారపడి ఉంటుంది. కానీ వరకట్నపు హింస, వరకట్నం హత్య మొదలగుకేసుల్లో తాము నిర్దోషులమని నిరూపించుకోవలసిన బాధ్యత ముద్దాయిలపై ఉంటుంది. సివిల్‌ కేసుల్లో వాది దాఖలు చేసిన కేసు చెల్లదని రుజువు చేయవలసిన భారం ప్రతివాదిపై ఉంటుంది. రుజువుభారం అంటే కేసు లోని ప్రతి అంశాన్ని రుజువు చేయాలని కాదు.
 
ఇరువర్గాలు అంగీకరిస్తే..  
ఉభయ పార్టీలు అంగీకరించిన అంశాలను రుజు వు చేయాల్సిన అవసరం లేదు. ఒక విషయాన్ని కక్షిదారుడు ప్రస్తావించినప్పుడు, దానిని ప్రత్యర్థి నిరాకరిస్తే.. ఆ విషయాన్ని కక్షిదారుడు నిరూపించుకోవాలి. కోర్టు నిర్ధారించే విచారణీయ అంశం ఎవరిపై రుజువుభారం మోపితే వారే ఆ అంశాన్ని రుజువు చేసుకోవాల్సి ఉంటుంది. క్రిమినల్‌ కేసులలో ముద్దాయి సాక్ష్యం చెప్పనవసరం లేదు. నేను నేరం చేయలేదు అని అంటే చాలు. పూర్తి ఆధారాలతో ఎలాంటి అనుమానాలకు తావివ్వకుండా ముద్దాయి చేసిన నేరాన్ని ప్రాసిక్యూషన్‌ రుజువు చేయాల్సి ఉంటుంది. ముద్దాయి తాను నిర్దోషినని రుజువు చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రాసిక్యూషన్‌ వారి కథనంలో ఏ మాత్రం పొంతన లేకపోయినా, అనుమానం ఉన్న సందేహ స్పదంగా(బెనిఫిట్‌ ఆఫ్‌ డౌట్‌) కేసు కొట్టివేయుదురు. క్రిమినల్‌ కేసుల్లో, నేరం జరిగినప్పుడు తాను అక్కడ లేనని, మరోచోట ఉన్నానని ముద్దాయి వాదన చేసినప్పుడు ఆ విషయాన్ని రుజువు చేసుకోవాల్సిన భారం ముద్దాయిపై ఉంటుంది. భారతీయ సాక్ష్యం చట్టంలోని సెక్షన్‌–101 ఈ విషయాలను సూచిస్తుంది.

 రుజువు చేయలేకపోతే.. 
భారతీయ సాక్ష్య చట్టంలోని సెక్షన్‌–102 ప్రకారం.. ఒక సివిల్‌ దావా లేదా ప్రొసీడింగ్‌లలో ఇరువర్గాలు(వాది, ప్రతివాది) సాక్ష్యాన్ని ప్రవేశపెట్టలేనప్పుడు, తీర్పు ఎవరికీ వ్యతిరేకంగా వచ్చునో రుజువు భారం ఆ కక్షిదారుడిపై ఉంటుంది. ఉదాహరణకు.. రామయ్య, రాజయ్యకు రూ.10 వేలు ప్రామిసరీ నోటుపై అప్పుగా ఇచ్చాడు. ఆ డబ్బును తిరిగి చెల్లించకపోవడంతో కోర్టులో కేసు వేశాడు. అప్పుడు రాజయ్య తాను అసలు నోటు రాయలేదని, తనకు డబ్బు ఇవ్వలేదని వాదన చేసినచో, రాజయ్య నోటు రాశాడని రుజువు చేయాల్సిన భారం రామయ్యపై ఉంటుంది. ఆ ప్రామిసరీ నోటును రాజయ్య రాసిచ్చినట్లుగా రామయ్య సాక్ష్యం చెబితే, తాను ఆ నోటు రాయలేదని రాజయ్య సాక్ష్యంను చెప్పవలెను. రామయ్య సాక్ష్యం చెప్పనిచో, రాజయ్య కూడా సాక్ష్యం చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరు సాక్ష్య ం చెప్పకపోతే కేసు కోట్టివేయుదురు. అప్పుడు రామయ్య నష్టపోతాడు. కాబట్టి, రుజువు భారం రామయ్యపై ఉండును. దీన్నిబట్టి రుజువు భారం ఎవరిపై ఉండునో వారే ముందుగా సాక్ష్యంను చెప్పాల్సి ఉంటుంది.


వాస్తవమేనని నిరూపించుకోవాలి  
భారతీయ సాక్ష్యం చట్టం సెక్షన్‌–103 ప్రకారం ఒక నిర్ధిష్ట విషయం వాస్తవమేనని రుజు వు చేయాల్సిన బాధ్యత, అది వాస్తవమేనని నమ్మిన వ్యక్తిపై ఉంటుంది. ఉదాహరణకు..రాజు దొంగతనం చేసినట్లుగా రాము కే సును దాఖలు చేశాడు. రాజు తన నేరాన్ని రాజారావు వద్ద ఒప్పుకున్నాడని  రాము వాదన. ఆ వి షయాన్ని రాజారావు చేత సాక్ష్యా న్ని చెప్పించుట ద్వారా రాము రు జువు చేయాల్సి ఉంటుంది. ఇదే చట్టంలోని సెక్షన్‌–105 ప్రకారం ఒక వ్యక్తిపై నేరారోపణ చేయబడినప్పుడు, ఆ నేరం కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో చే యబడిన ఎడల, ఆ ప్రత్యేక పరిస్థితులను రుజువు చేసుకోవాల్సిన బాధ్యత నేరారోపణ చేయబడిన వ్యక్తిపై ఉంటుంది. ఉదాహరణకు..రమేశ్‌పై హత్యానేరం మోపబడింది. విచారణలో రమేశ్‌ తనకు మతిస్థిమితం లేదని, తాను ఏమి చేయుచున్నాడో తనకే తెలియడం లేదని వాదించాడు. ఆ నేరం జరిగినప్పుడు తనకు మతిస్థిమితం లేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత రమేశ్‌పై ఉంటుంది. బుద్ధిపూర్వకంగా నేరం చేయలేదని, క్షణికావేశంలో చేశానని ముద్దాయి రుజువు చేసుకోగలిగితే శిక్ష తగ్గుతుంది.

  

సీనియర్‌ న్యాయవాది కటుకం చంద్రమోహన్‌

మరిన్ని వార్తలు